Thursday, November 7, 2024

భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన

భరద్వాజ మహర్షి ఆశ్రమం

రామాయణమ్ 50

వశిష్ఠ మహర్షిని అల్లంతదూరములో చూడగనే భరద్వాజమహర్షి ఒక్క ఉదుటున లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు.

వశిష్ట మహర్షి భరతుని చూపి ‘ఈతడు దశరథ కుమారుడు’ అని పరిచయం చేశారు.

తరువాత వారందరి క్షేమం భరద్వాజుడు విచారించి భరతునితో ఇలా అన్నాడు…”రాజ్యమును పరిపాలించుకొనే నీవు ఇచటికి ఎందుకు వచ్చావు? నా కేదో అనుమానముగా ఉన్నది నీ గురించి! తండ్రి మాటకోసమై అడవులుపట్టి వెళ్ళిపోయిన సీతారామలక్ష్మణుల విషయమై నీవేమీ పాపపుతలంపుతో ఇచటకు రాలేదుకదా!’’

Also read: గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం

ఆ మాటలు భరతుని హృదయాన్ని ఈటెల్లాగా చీల్చివేయగా హృదయమందు అప్పటికే గంగానదిలా ప్రవహిస్తున్న దుఃఖము మరింత వేగంగా ఉబికి బయటకు వచ్చి కన్నీరుగా ప్రవహించగా, తడబడే మాటలతో భరద్వాజుని చూసి …

“పూజ్యుడవైన నీవు కూడా నన్ను ఇలాగ భావించినచో నన్ను చంపివేసినట్లే! మహాత్మా నావలన ఏ దోషమూలేదు! నన్ను నీవు ఈ విధముగా తలంచకుమయ్యా! నేను లేని సమయములో నా తల్లి పలికిన మాటలన్నీ నాకు ఇష్టములుకావు. వాటిచే నాకు సంతోషము కలుగలేదు. వాటిని నేను సమ్మతించను. నేను ఇప్పుడు పురుషశ్రేష్ఠుడైన రాముని పాదములకు నమస్కరించి ఆయనను అనుగ్రహింపచేసుకొని మరల అయోధ్యకు తీసుకు వెళ్ళటానికి వచ్చిఉన్నాను. మహర్షీ రాముడెక్కడున్నాడో ఎరుకపరుపుము!”

Also read: భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

సత్ప్రవర్తన, వినయముతో కూడిన భరతుని ఆ మాటలు విని భరద్వాజమహర్షి ప్రసన్నుడై ‘‘రఘువంశములో పుట్టినవాడు మాట్లాడే విధంగానే మాట్లాడావు అవి నీకు తగి ఉన్నవి. నీ హృదయం తెలుసుకుందామనే అలా అన్నాను!’’ అని పలికి నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ..

.

రాముడు చిత్రకూటపర్వతమందు నివసిస్తున్నాడు. నీవు రేపు అచటికి వెళ్ళవచ్చును. ఈ రాత్రికి మా ఆశ్రమమందే విశ్రమించుము…..

భరద్వాజుని కోరిక మేరకు ఆ రాత్రికి అక్కడనే విడిదిచేసినాడు భరతుడు. అప్పుడు భరద్వాజుడు భరతునితో ‘నేనిచ్చే విందు స్వీకరించు’ అని అడిగాడు.

‘‘స్వామీ అరణ్యములో లభించేవాటిని మీరిప్పటికే నాకు అనుగ్రహించారుకదా. ఇంక వేరే విందు ఏమివ్వగలరు?’’ అని బదులు పలికాడు భరతుడు.

Also read: రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

మహర్షి చిరునవ్వుతో, ‘‘భరతా! నీవు అల్పసంతోషివి అని నేనెరుగుదును. నీవు అన్నిసత్కారములకు అర్హుడవు! నీకు, నీ సేనకు ఏమిచ్చినచో సంతుష్టులగుదురో ఆ విందు ఇవ్వవలెననే కోరిక నాకున్నది.  అవునూ ! నీ సైన్యాన్నంతా దూరంగా వదిలి ఒక్కడవే ఇక్కడికి వచ్చావేమిటి?’’ అని ప్రశ్నించాడు భరద్వాజుడు.

.

‘‘స్వామీ మీకు తెలియునుకదా. రాజు కానీ ,రాజపుత్రుడు కానీ  ఎల్లవేళలా మునివాటికలకు దూరంగా సంచరించవలెను అని కదా నియమము!’’

..

 (ఇది ఆనాటి ధర్మం! ఈ రోజున విశ్వవిద్యాలయాల గ్రౌండ్సు అన్నీ కూడా రాజకీయ సభలకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే రచ్చరచ్చ. ఏ కాలంలో నాగరికత, మర్యాద ఉన్నదో గమనించండి.

We are modern but not civilized).

‘‘నా సైన్యములో మదించిన ఏనుగులు సంచరిస్తున్నాయి. అవి మీ ఆశ్రమప్రాంగణంలోని వనాన్ని ధ్వంసం చేయరాదనే తలంపుతో నేనొక్కడనే వచ్చినాను.’’ భరతుని ఆ మాటలు విని సంతసించారు మహర్షి.

అప్పుడు మహర్షి అగ్నిగృహములో ప్రవేశించి దీక్షలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వానించాడు. దేవేంద్ర, యమ, వరుణ, కుబేర అనే లోకపాలకులని కూడా ఆహ్వానించి ‘‘నేను భరతునకు ఆతిధ్యమివ్వదలుచుకున్నాను. కావున మీరు వచ్చి తగు ఏర్పాట్లు గావించండి’’ అని కోరినాడు.

Also read: భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

మహర్షి సంకల్పానికి అనుగుణంగా అక్కడ క్షణాల్లో ఒక మహానగరం ఏర్పాటయ్యింది. గంధర్వులైన విశ్వావసు, హాహాహూహూలూ, దేవజాతికి చెందిన అప్సరసలు –  వారిలో ఘృతాచి, విశ్వాచి, మిశ్రకేశి, అలంబుస, నాగదంత, హేమ, హిమ …అనే స్త్రీలు ఉన్నారు. సకల దేవతా స్త్రీ లను అక్కడకు రావించాడు మహర్షి.

మైరేయము అనే మద్యము నదిగా పారింది! బాగా తయారు చేయబడిన “సుర” మరొక నది అయ్యింది. చెరకురసాలు నదులుగా పారాయి. చంద్రుడు  చక్కని అన్నము తెచ్చాడు. అది పంచభక్ష్యపరమాన్నాలతో కూడినటువంటుది. భరద్వాజుడి సంకల్పానికి తగ్గట్లుగా అప్పటికప్పుడు అక్కడ ఒక సుందరమైన లోకం ఇంద్రభవనాలతో దేవేంద్ర వైభవంతో సృష్టింపబడింది.  ఇదివున్నది, అదిలేదు అనిలేదక్కడ!  ఎవరికి ఏది కావలిస్తే అది .

మహర్షి అనుమతితో భరతుడు రాజసభలోకి ప్రవేశించాడు..

ఆ సభలో ఒక సమున్నతమైన ఆసనం! దానికెదురుగా మంత్రి సామంత దండనాధులు కూర్చొనుటకు వీలుగా సముచిత సుఖాసనాలు అమర్చారు. అక్కడి దివ్యమైన సమున్నత ఆసనానికి భరతుడు ప్రదక్షిణ చేశాడు అక్కడ రాముడున్నట్లుగా ఊహించుకొని ఆయనకు నమస్కారము చేసి ఆ ఆసనానికి వింజామరతో వీచి తాను మంత్రికూర్చునే ఆసనం మీద కూర్చున్నాడు.

Also read: తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

.

(మనసా వాచా కర్మణా ఆయనకు రాముడే రాజు. ఆయన పరోక్షంలో కూడ భరతుడికి సింహాసనం మీద మోహం లేదు!)

భరద్వాజ మహర్షి ఇచ్చిన విందుతో మైమరచిపోయారందరూ. ఏ పానీయం కావాలంటే ఆ పానీయం నది రూపంలో ప్రవహించినదక్కడ.

.

ఏ జవరాలి చేతిలో చిక్కితే మగవాడు తనను తాను మరచిపోయి చిత్తయిపోతాడో అలాంటి జవరాండ్రు వేలకువేలు ప్రత్యక్షమయ్యారక్కడ. నారదుడు, తుంబురుడు, గోపుడు భరతుని ఎదుట గానం చేశారు. భరద్వాజుని ఆజ్ఞచేత ఆయన మునివాటికలోని వృక్షాలన్నీ  రకరకాల మనుష్యరూపాలు ధరించాయి.

మారేడు చెట్లు మృదంగవాయిద్యకారులుగాను, తాండ్రచెట్లు తాళము వేసేవారుగానూ, రావిచెట్లు నర్తకులుగానూ ,సరళ ,తాళ, తిలక, నక్తమాల, వృక్షములు అంతఃపురములో సంచరించే కుబ్జలుగాను, వామనులుగానూ మారిపోయినాయి.

శింశుపా, ఆమలకి, జంబూ, మల్లికా, మాలతి, జాజి లతలు లతాంగులైనవి. ఒక్కొక్కపురుషుని ఏడుగురు స్త్రీలు చుట్డుముట్టి నలుగుపెట్టి స్నానము చేయించారు.మరల వారి శరీరమర్దనమునకు అందమైన కళ్ళుగల స్త్రీలు త్వరగా వచ్చారు. శరీరముతుడుచుటకు ఒకతి ,సురాపానము చేయించుటకొకతి.అందరూ వళ్ళుమరచి ఆనందంతో తైతక్కలాడసాగారు. ఆ విందులూ చిందులూ పొందులూ సైనికులను అదే శాశ్వతము అనుకునేటట్లుచేసింది.

.

వారికి రాజేలేడన్నట్లుగా, అదే సుఖము జీవితాంతము ఉండి అక్కడే ఉండిపోవాలని కోరుకున్నారు..

వారికి భరతుడులేడు. రాముడు లేడు. ఆయన దండకారణ్యములేదు!

Also read: భరతుడి పీడకల

ఎవరికి వారు విచ్చలవిడిగా రెచ్చిపోయి తాగితూలుతూ పచ్చిపచ్చిగా నచ్చిననెచ్చెలితో విహరిస్తూ సర్వమూ మరచిపోయారు.

( మానవ మనస్తత్వ చిత్రణ ఇది! మనిషికి అన్నీ దొరికితే ఎవడినీ లెక్కపెట్టడు).

తెల్లవారింది మహర్షి ఆజ్ఞ ఇవ్వగా ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు. మరల మునివాటిక ,అరణ్యము ప్రత్యక్షమయ్యింది. అంతా ఒక కలలా అనిపించింది! కానీ కలకాదు! రాత్రి తాగిన మత్తువదలక అంతా అడవిలోని నేలపై పడిదొర్లుతున్నారు.

భరతుడు వినయంగా మహర్షిని సమీపించి ‘‘స్వామీ మీ ఆతిధ్యము అనితరసాధ్యము. నేనూ, నా పరివారమూ అందరమూ సంతుష్టులమైనాము. మాకు ఇక సెలవు ఇప్పించండి. మా అన్నగారు బసచేసిన తావు చూపించండి’’ అని ప్రార్ధించాడు.

భరతా ! ఇక్కడికి మూడున్నర యోజనముల దూరములో నిర్జనవనమున్నది. అక్కడ అందమైన సెల ఏరులతో కూడిన అడవులు కల చిత్రకూటపర్వతమున్నది. దానికి ఉత్తరాన మందాకిని నది! నీవు ఆ నదిని దాటిగానీ పర్వతాన్ని చేరుకోలేవు. ఆ పర్వతమే ప్రస్తుతం నీ అన్నగారి నివాసము. దక్షిణంగా కానీ, నైరుతిమార్గంలో కానీ వెడితే నీకు రాముడు కనపడతాడు.

రాముడి ప్రసక్తి రాగానే దశరధుడి భార్యలు మువ్వురూ భరద్వాజమహర్షి వద్దకు వచ్చారు.

వారిలో కృంగి, కృశించి దీనురాలై వణుకుతూ ఉన్న కౌసల్యాదేవి, సుమిత్రాదేవి మహర్షి పాదాలకు ప్రణమిల్లారు.

తనకోరిక నెరవేరని సర్వలోకనిందిత (అందరూ తిట్టే) అయిన కైక సిగ్గుపడుతూ మహర్షి పాదాలను తాకింది.

అప్పుడు భరద్వాజుడు వీరిని పరిచయం చేయమని కోరగా భరతుడు, ‘‘ఓ మునిచంద్రా! ఇదుగో ఇక్కడ ఉపవాసములతో కృశించి, దీనంగా ఉండి దేవతాసదృశురాలైన ఈ మాతృమూర్తి కౌసల్యామాత. రాముని కన్నతల్లి. వనమధ్యములో పూవులురాలిన పెనువృక్షమువలే ఉండి దుఃఖిస్తున్న మనస్సుతో కౌసల్యామాత ఎడమప్రక్కన నిలబడ్డ ఈ మాతృమూర్తి   ఇద్దరు ధీశాలురు, సచ్చరిత్రులు అయిన లక్ష్మణశత్రుఘ్నులను కన్నతల్లి సుమిత్ర.

కోపస్వభావము,వివేకశూన్య,గర్వితురాలు,నేనే అందమైన దానను అనుగర్వము కలది, ఐశ్వర్యమునందు కోరిక కలది, ఆర్యురాలు లాగ కనపడే అనార్య, క్రూరురాలు,  ఆవిడ నిశ్చయాలు పాపానికి దారితీసేవి అయిన ఈవిడ నా కన్నతల్లి కైకేయి. ఈవిడ మూలానే  రాముడికి అరణ్యవాసము, దశరధమహారాజుకు స్వర్గలోకప్రాప్తి సంభవించినవి.’’

తల్లిగురించి మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళు ఎర్రబారాయి, పగబట్టి బుసకొట్టేపాములాగ మాటిమాటికీ నిట్టూరుస్తున్నాడు భరతుడు.

అప్పుడు మహర్షి భరద్వాజుడు భరతుని చూసి ఒకేఒక వాక్యంలో ఇలా హితవు పలికాడు.

‘‘నాయనా భరతా! నీవు నీతల్లి విషయంలో దోషము చూడవద్దు. రాముడి అరణ్యగమనము లోక కళ్యాణము కొరకే. మున్ముందు సుఖకరమైన ఫలితాలు లభిస్తాయి..’’

అదివిని భరతుడు మరొక్కమారు మహర్షికి ప్రదక్షిణము చేసి సైన్యాన్ని కదలమని ఆజ్ఞ ఇచ్చాడు.

Also read: దశరథ మహారాజు అస్తమయం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles