తెలుగునాట తొలి దళిత నాయకుడు మాదరి భాగ్యరెడ్డివర్మ పిన్న వయస్సులోనే పెద్ద సేవ చేసిన సేవాతత్పరుడు. ఈ దేశ మూలవాసులు దళితులేనని చెబుతూ, వారిని అంటరానివారిగా చూస్తున్న సమాజం వైఖరిని నిశితంగా ఖండిస్తూ ప్రసంగాలు చేసిన సాహసి. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో 1906లోనే ‘జగన్మిత్రమండలి’ని నెలకొల్పారు. 22 మే 1888లో వెంకయ్య, రంగమాంబ దంపతులకు పుట్టిన భాగ్యరెడ్డి వర్మ 50 ఏళ్ళ వయస్పులోనే కన్నుమూశారు. ఈ తక్కువ కాలంలోనే 32 సంవత్సరాల ప్రజాసేవకు అంకితభావంతో కృషి చేశారు. 18 ఫిబ్రవరి 1939లో మరణించే నాటికి భాగ్యరెడ్డి వర్మ నిజాం ప్రభుత్వంతో పోరాడిన యోధుడుగా పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మసమాజ్ , ఆర్యసమాజ్ లతో కలసి పని చేశారు. దళిత విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠశాలలు నిర్వహించారు. ఆదిహిందువుల ఐక్యతకూ, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా, దళితుల ప్రగతికోసం అహరహం శ్రమించారు. అణగారినవర్గంగా, అంటరానివారుగా, చదువుకీ, ప్రగతికీ దూరంగా బతుకులు ఈడుస్తున్నవారిగా దళితులను ఆదిఆంధ్రులని పిలిచేవారు.
Also Read: నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జువ్వాడి రత్నాకర్ రావు
అంబేడ్కర్ కు స్పూర్తిప్రదాత:
అంబేడ్కర్ కంటే ముందుగానే దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు భాగ్యరెడ్డివర్మ. దళితులకు ఎనలేని సేవచేసిన అంబేడ్కర్ కు భాగ్యరెడ్డివర్మ స్పూర్తిప్రదాత. ఆ రోజుల్లో తెలంగాణ అంతటా అక్షరాస్యుల శాతం ఐదారుకు మించి లేదు. ఆదిహిందూపత్రిక అనే పత్రికను నెలకొల్పి అక్షరాస్యత ఉద్యమాన్ని కొనసాగించారు. రాజారామమోహన్ రాయ్ ప్రవచనాలనూ, బుద్ధజయంతి సందర్బంగా వచ్చిన రచనలనూ ఆ పత్రికలో అచ్చువేసి ప్రచారం చేశారు. సంపాదకీయాలలో దేశంలోని సమస్త సమస్యలనూ ప్రస్తావించారు. అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలో దళితులపైన జరిగిన దాడులను ప్రస్తావిస్తూ అ టువంటి దాడులు హైదరాబాద్ సంస్థానంలో జరగకుండా చూడాలని నిజాం నవాబుకు విజ్ఞప్తి చేశారు. తన పత్రికలోనే కాకుండా వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవారు. ‘వెట్టిమాదిగ’ అనే శీర్షికతో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ‘అజ్ఞాతవాసి’ అనే కలంపేరుతో కథ రాసి ప్రచురించారు.
(ఫిబ్రవరి 18 భాగ్యరెడ్డివర్మ వర్ధంతి)
Also Read: జానపద పరిశోధకరాజు `బిరుదురాజు`