రామాయణమ్ – 10
అంశుమంతుడు తన పినతండ్రులు వెడలిన దారిలో ప్రయాణంచేసి వారు భస్మరాశిగా మారిన చోటికి వెళ్లాడు. అక్కడ అతనికి బూడిదకుప్పలు, ఒక చోట గడ్డి మేస్తున్న అశ్వము కనిపించాయి. తన పిన తండ్రులకు జల తర్పణములివ్వవలెనని చుట్టూ కలియచూశాడు ఎక్కడా చుక్క నీరు కనపడలేదు.
Also read: కపిల మునిపై సగరుల దాడి
అప్పుడు అంశుమంతునకు అతని పినతండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడి వీరికి మామూలు నీటితో తర్పణము విడువరాదు పావనగంగోదకము తో ఇచ్చిన తర్పణము మాత్రమే వీరికి పుణ్యలోకాలు కలుగచేస్తుంది అని తెలిపి, ప్రస్తుతమునకు నీవు ఈ గుర్రము తీసుకొని వెళ్ళి యాగము పూర్తిచేయించు అని చెప్పాడు.
అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకొని తన పట్టణము చేరుకొన్నాడు. సగరచక్రవర్తి ఈ వార్తవిన్నతరువాత తీవ్రంగా రోదించి, గంగను తెచ్చే ఉపాయము కానరాక మిన్నకుండిపోయినాడు.
కొంతకాలానికి అంశుమంతుడు రాజైనాడు. ఆయనకు దిలీపుడు అనే కొడుకు కలిగాడు. దిలీపుడు కూడా గంగను తెచ్చే మార్గము కనుగొనలేకపోయాడు. ఆ దిలీప మహారాజుకు పరమ ధార్మికుడైన భగీరధుడు పుత్రుడుగా జన్మించాడు. భగీరధుడు మనస్సులో తన పూర్వీకుల అధోగతి గురించి తీవ్రంగా మధనపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణక్షేత్రానికి వెళ్లి చేతులు పైకెత్తి, నెలకొక్కసారి మాత్రమే భోజనం చేస్తూ వేలసంవత్సరాలు తపస్సుచేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగ భూమికి వచ్చునట్లుగా అనుమతించి, ఇక్ష్వాకు వంశానికి సంతానలోటు లేకుండా కూడా వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు.
Also read: మారీచ, సుబాహుల సంహారం
ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడ్డది భగీరధుడికి! తీవ్రమైన వేగంతో భూమిమీద గంగ దూకినప్పుడు ఆమెను భరించే సమర్ధత ఒక్క పరమశివుడికే మాత్రమే ఉన్నది. కాబట్టి మరల శివానుగ్రహంకోసం ఒక సంవత్సరకాలం కేవలం బొటనవేలును ఆసరాగా చేసుకొని నిలబడి ఘోరమైన తపస్సుచేశాడు. శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు.
గంగను ఆకాశం నుండి దిగమని ప్రార్ధించాడు భగీరధుడు! అహంకారంతో శివుడు ఎట్లా తట్టుకుంటాడో చూద్దామని ఒక్క ఉదుటున అతివేగంగా భూపతనం చెందింది గంగ. శివుడిని తోసుకుంటూ పాతాళానికి తీసుకువెళ్ళాలని గంగ ఆలోచన. శివుడు అది గ్రహించి తన జటాజూటంలో గంగను బందీ చేశాడు. అక్కడనుండి బయటపడే దారిలేక విలవిల లాడిపోయింది గంగ.
Also read: తాటకి వధ
శివజటాజూటంలో బందీ అయిన గంగ కానరాలేదు. ఆమె కోసం భగీరధుడు మరల తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మహాదేవుడు సంతసించి గంగను విడిచిపెట్టాడు. జటాజూటం నుండి గంగ ఏడు పాయలుగా విడివడి ప్రవహించింది. హ్లాదిని, పావని, నళిని ఈ మూడుపాయలు తూరుపు దిక్కుగా సుచక్షువు, సీత, సింధువు ఈ మూడు పడమర దిక్కుగా ప్రవహించినవి.
భగీరధుడి వెంట ఏడవపాయ నడచింది. నడచిన ప్రాంతాలను ముంచెత్తుతూ మహావేగంగా కదలింది. సుళ్ళుతిరుగుతూ నడిచింది. హోరునశబ్దంచేస్తూ పరుగెత్తింది. ఉత్తుంగతరంగాలతో ఉవ్వెత్తున లేస్తూకదిలింది! గంగా తరంగ ఘోష మృదంగ ధ్వనిలా ఒకచోట మేఘగర్జనలా మరొకచోట వినిపించాయి! అంతకంటే వేగంగా ముందు పరుగెడుతున్నాడు భగీరధుడు.
Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు
గంగ తీవ్రమైన వేగంతో వస్తూ వస్తూ జహ్ను మహాముని ఆశ్రమాన్ని ముంచెత్తింది గంగ చేసిన పనికి కోపంతో ఆమహర్షి మొత్తం గంగానదిని ఒక్కగుక్కలో త్రాగి గంగను మాయం చేశాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం! ఏమైఉంటుందా అని తిరిగి చూశాడు భగీరధుడు, గంగ కనపడలేదు.
అర్ధమయ్యింది. మరల మహర్షిని సకలదేవసంఘాలతో కూడి పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. మహర్షి కరుణించి తన చెవులనుండి గంగను విడిచి పెట్టాడు. అప్పటినుండి ఆవిడ “జాహ్నవి” అయ్యింది.
మరల భగీరధుడిని అనుసరించింది గంగ, సముద్రంలో ప్రవేశించి పాతాళానికి చేరుకొని సగరపుత్రుల భస్మరాశిమీదుగా ప్రయాణించింది. అంత వారి పాపములు నశించి వారందరూ స్వర్గము చేరుకున్నారు.
Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు
.
N.B..
ఈ కధలో రెండు విషయాలు మనకు గోచరిస్తాయి.
ఒకటి భగీరధుడి అద్భుతమైన ప్రయత్నం! దానికి సరిసాటి ఇంకొకటిలేదు.
మనమొక లక్ష్యాన్ని నిర్ణయించుకొన్నప్పడు అది పూర్తిచేయడం మన విధి. మడమ తిప్పరాదు. మధ్యలో కలిగే ఆటంకాలను ఓపికగా పరిష్కరించుకుంటూ పోవడమే!
ఇక రెండవది గంగ అహంకారం! తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడుంటాడు అనటానికి ఉదాహరణ. అహంకారం పనికిరాదు. వినయమే ఆభరణం!
Also read: శ్రీరామ జననం
వూటుకూరు జానకిరామారావు