‘భగవద్గీత’ వ్రాయడానికి కారణమేమంటే,‘‘నీవు వ్రాయగలవు అన్నా! మాకు చెప్పేవన్నీ అక్షర రూపంలో పెట్టు’’ అని మొదట ప్రోత్సహించినది నా మిత్రుడు శ్రీ కొనకళ్ళ శివరామప్రసాదు!
మీరు వ్రాయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎంచుకోండి అంటూ ఫేస్ బుక్ అక్కౌంట్ నాకోసం తెరచి, అందులో వ్రాయడం ఎలాగో నేర్పిన ఇంకొక సహృదయుడైన మిత్రుడు ఇ. రామకృష్ణనాయుడు గారు.
ఎలా వ్రాయాలి సత్యం అని మిత్రుడు, సుప్రసిద్ధ రచయిత ‘‘వంశీకృష్ణ’’ ను అడిగాను. ‘‘నువ్వు ఏం చెపుతున్నావో అలాగే వ్రాయి’’అని చెప్పి మొదట కొన్ని రోజులు వ్రాసిన వ్యాసాలు చూసి అభిప్రాయం చెప్పి ముందుకు నడిపిన మిత్రుడు శ్రీ టి. సత్యనారాయణ!
అలాగే వ్యాసాలు చదివి ముందు మాట వ్రాయండి అని అడిగిన వెంటనే ఓపికగా చదివి తన అభిప్రాయం వ్యక్తం చేసిన శ్రీ G.V కృష్ణరావు I.R.S (Rtd) గారికి, మిత్రుడు విశ్రాంత ఆంగ్ల ఉపన్యాసకుడు, గర్స్ల్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కె. సత్యప్రసాద్ రాయ్ గారికి, మా సహోద్యోగి సీనియర్ మేనేజర్ అయిన శ్రీ టి. సత్యనారాయణగారికి కృతజ్ఞుడను !
నాకు సంస్కృతము రాదు ! పెద్దగా చదువుకోలేదు అప్పుడెప్పుడో చిన్నప్పుడు భారతీయ విద్యాభవన్ వారి బాలబోధ, ప్రారంభ, ప్రవేశ పరీక్షలు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాను. ఆ తరువాత పెద్దగా పట్టించుకొనకపోవడం వలన కేవలం ఇంగువకట్టిన గుడ్డలాగ మాత్రమే మిగిలింది నా భాషాపరిజ్ఞానము.
దాదాపు పది పుస్తకాలు వివిధ ప్రసిద్ధ వ్యక్తులవి గీత చదివి, మరల కొన్ని శ్లోకాలు ధ్యానం చేసినప్పుడు నాకు కలిగిన ఆలోచనలను F.B. లో మిత్రులతో పంచుకున్నాను. ‘‘బాగున్నాయి. పుస్తకరూపంలో తీసుకురండి’’ అన్న వారి కోరిక నేటికి ఒక రూపం దాల్చింది! కేవలం నా వ్యాసాలు పుస్తకరూపంలోకి తీసుకురావాలన్న ప్రయత్నమే ఇది! అందుకే ఈ పుస్తకం వెల ‘‘లేనిది’ …మిత్రుల కోసం మాత్రమే!
అడిగిన వెంటనే అర్ధవంతమైన, కళాత్మకమైన, ముఖ చిత్రాన్ని, గీసి ఇచ్చిన భార్గవి అక్కకు శతసహస్ర వందనాలు, కృతజ్ఞతలు. చక్కగా ప్రూఫ్ రీడిరగ్ ఓపికగా చేసినది నా అర్ధాంగి అనూరాధ.
ఈ వ్యాసాలు మొదట చదివి వాటికి తన గొంతు ఇచ్చి తను ఉన్న సింగపూర్ లో కొందరికి షేర్ చేసినవాడు చిన్నతమ్ముడు కీ.శే సుధాకర్ వాడికి ఈ పుస్తకం అంకితం!
–వూటుకూరు జానకిరామారావు, M.Sc.