భగవద్గీత

0
585

మనిషి `మనసు` సైన్సు

మనిషి విరుద్ధభావాల పుట్ట, He is a bundle of contradictions అని అంటారు రాధాకృష్ణ   పండితులు!

ఎవరిని జయించడానికి తన అమ్ములపొదిలో అనేక దివ్యాస్త్రములు సమకూర్చుకున్నాడో, ఎవరిని నిర్జించటానికి ముక్కంటితో పోరుసల్పి పాశుపతాన్ని వరంగాపొందాడో, ఎవరివల్ల మోసపోయి జీవితంలోని 13 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డాడో, ఎవరి వల్ల కులసతి అవమానం పాలయ్యిందో అట్లాంటి వారి తలలతో చెండాట ఆడవలసిన సమయంలో ఆయన మనసు నీరుకారి పోయింది.

వైరులుగా పోరుసలుప వలసిన వారు గురువులుగా, సోదరులుగా, మేనమామలుగా, సఖులుగా, రకరకాల బంధుమిత్రులుగా కనపడ్డారంటే మనస్సు విరుద్ధ భావాల పుట్ట కాదా!

TO BE OR NOT TO BE. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే మీమాంసే! ఇలాంటి మీమాంసలు తొలగించుకొని సందేహాలు లేకుండా జీవన గమనం సజావుగా సాగాలంటే మనిషికి తన మనసేమిటి? దాని స్వరూపమేమిటి అని పూర్తిగా తెలియాలి. సత్యాన్వేషణ దిశగా ముందుకు సాగాలి …

ఏది సత్యం ఏది అసత్యం తెలిపి అర్జునుడిని విజయుడుగా నిలిపి కిరీటిని చేసిన నల్లనయ్య ఆ శ్రీకృష్ణపరమాత్మ తెలిపిన ‘‘భగవద్గీత’’ లోని ఒక్క శ్లోకమయినా మనం మననం చేస్తే చాలు. సత్యం సాక్షాత్కరిస్తుంది..

భూమి మీద మనిషి వ్యామోహం అంతులేనిది. మనిషి పుట్టినప్పటి నుండీ వున్న వ్యామోహమది. భూమికోసం ఎన్నో యుద్ధాలు చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడుగూడా. తన ఎదురుగుండా ఎంతోమంది చనిపోతూ ఉంటారు. అయినా మనిషి తానొక్కడినే శాశ్వతం అనుకుంటాడు.

అంతులేని ధన సంపాదన, అనంతమయిన వ్యామోహం మనిషికి పట్టిన జబ్బులు. తినటానికింత తిండి, కప్పుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి గూడు ఇవికదా అసలు అవసరాలు? కానీ వ్యామోహం అనే భూతం భూమి కూడబెట్టిస్తుంది, భూకబ్జాలు చేయిస్తుంది, రంగురాళ్ళు పోగేయిస్తుంది, మట్టిలోనుండి తీసిన లోహంతో వళ్ళంతా అలంకరింపచేయిస్తుంది!

స్త్రీ, భూమి, బంగారం, ఈ మూడిటికొరకు, మనిషి ఆరాటపడతాడు, పోరాటాలు చేస్తాడు. చివరకు మట్టిలో కలిసిపోతాడు. ఏవీ వెంటరావు. ఏవీ వెంటరావని తెలిసినా, తరతరాల చరిత్ర చెపుతున్నది ఇదే అని తెలిసినా, తపన ఆగదు తాపత్రయం వీడడు.

తనదికాని సొమ్ముకోసం ఆశపడి ప్రక్కవాడినుండి లాక్కొని వాడు పగ తీర్చుకుంటాడేమో అని అనుక్షణం తనకు పొంచి వున్న ముప్పును తలచుకుంటూ తల్లడిల్లిపోతాడు. అలాంటి వాడే ధృతరాష్ట్రుడు. తనదికాని రాష్ట్రం (రాజ్యం) ధరించినవాడు. తమ్ముడు ప్రేమతో సింహాసనం మీద కూర్చోపెడితే అది తనదే అని భ్రమించిన గుడ్డివాడు …

యుద్ధరంగంలో ఇరుపక్షాలు మొహరించివున్నాయి కదా సంజయా ఏమి జరిగింది? అని అడగలేదు!

‘‘నా’’ వాళ్ళు, పాండు పుత్రులు ఏమిచేశారు అని అడిగాడు సంజయుణ్ణి! ‘‘నా’’ అట

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః?

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ

మూర్తీభవించిన ధర్మం ఎవరు అని అడిగితే రాముడని ఎలా సమాధానం చెపుతామో, అలాగే మూర్తీభవించిన స్వార్ధం ఎవరు అని అడిగితే ధృతరాష్ట్రుడు అని ఠక్కున సమాధానం వస్తుంది!

సింహాసనానికి, చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై హస్తినాపుర రాజ్య పక్షాన నిలబడిన వాడు, అసమానశౌర్య ప్రతాపాలు కలిగియుండి అన్నీ తెలిసినా అధర్మం వైపు నిలబడి పాండవులతో కలబడటానికి సిద్ధమైన వృద్ధమూర్తి, పరుశురామ శిష్యుడు, గంగాతనయుడు, శాంతనవుడు, శాంత గంభీర శౌర్యమూర్తి భీష్మ పితామహుడు, హస్తినాపుర ప్రభుత్వము పోషించినది కాబట్టి అధర్మమయినా రాజ్యం పక్షాన యుద్ధం చేసిన బ్రాహ్మీమయమూర్తి, పోతపోసిన క్షాత్రం గురుద్రోణుడు!

తనవైపు నిలబడిన అసంఖ్యాకమైన సైన్యం చూసి తన బలం ఎంతో ఎక్కువ అని అంచనా వేసుకున్న దుర్యోధనుడు గురువుగారైన ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చాడు. ఆయనకు తన బలాన్ని, బలగాన్ని చెపుతూ దానితో వైరి బలాన్ని, బలగాలను పోలుస్తూ తన బలం అపర్యాప్తమని (అపరిమితం) పాండవుల బలగాలు పర్యాప్తమని (పరిమితం) అహంకార ప్రదర్శన చేశాడు.

కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, పాండవుల పక్షాన 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉన్నది అసలు అంత సైన్యం దుర్యోధనుడికి ఎలా సమకూరింది? విశ్లేషిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది!

శ్రీ కృష్ణుడి సహాయం కోసం అర్జునుడు, దుర్యోధనుడు ఇరువురూ వెళ్ళినప్పుడు ఆయన నేనొక్కడిని ఒక వైపు నాకు గల అక్షౌహిణి సైన్యం మరొక వైపు అని విభాగంచేశాడు నా సఖుడు, నా బంధువు, నా గురువు అయిన బావ నాకు చాలు అని కృష్ణుడిని కోరుకుంటాడు అర్జునుడు. మిగిలిన అక్షౌహిణి సైన్యం దుర్యోధనుడి పక్షానికెళ్ళింది.

అలాగే నకుల, సహదేవుల మేనమామ మాద్రి (పాండురాజు భార్య) అన్న అయిన శల్యుడు పాండవుల పక్షాన యుద్ధం చేయటానికి వస్తుంటే మార్గమధ్యంలో అపూర్వ సత్కారాలతో మాయచేసి ఆయన తన వైపు వచ్చేటట్లు చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇలా ఈ రెండు అక్షౌహిణులు కలుపుకుంటే పాండవులకు కూడా కౌరవుల కున్నంత సైన్యం ఉండేది! చెరి తొమ్మిది అయ్యేవి! ఇక్కడ కూడా దుష్టరాజనీతి ప్రదర్శించాడు రారాజు!

గురు ద్రోణుడితో ఇలా అన్నాడు దుర్యోధనుడు, ‘‘మీరంతా భీష్మపితామహుడిని రక్షిస్తే చాలు మిగిలిన విషయం ఆయన చూసుకుంటాడు.’’  వీరి సంభాషణ భీష్ముని చెవిన పడగానే రారాజును సంతోష పెట్టటానికి తన శంఖం పూరించాడు ఆ వృద్ధమూర్తి. ఆయన శంఖనాదము విని తక్కిన రాజులంతా కూడా తమతమ శంఖాలు దిక్కులు పిక్కటిల్లేటట్లు ధాటిగా ఊదారు. గమనించవలసినది ఏమిటంటే ఇక్కడ మొదట రణన్నినాదం చేసింది, సమరశంఖము పూరించినది కౌరవులే!

ఆ వెనువెంటనే పాండవుల పక్షాన్నుండి

శ్రీ కృష్ణుడు..పాంచజన్యం

అర్జునుడు…దేవదత్తము

భీముడు..పౌండ్రము

ధర్మరాజు..అనంతవిజయము

నకులుడు..సుఘోషము

సహదేవుడు..మణిపుష్పకము

అనే శంఖాలు కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి , దృపదుడు, ద్రౌపది అయిదుగురు కొడుకులు, అభిమన్యుడు తమతమ శంఖాలను పూరించి తమ యుద్ధసన్నద్ధతను వైరివర్గానికి ధీటుగ తెలియ చేశారు!

అప్పడు పార్ధుడు ‘‘బావా, నాకు వాళ్ళ సైన్యంలో ఎవరెవరున్నారో చూడాలని ఉంది’’ అని అడిగాడు. పార్ధసారధి కృష్ణుడు తెల్లటిగుర్రాలు పూన్చిన రధాన్ని మెల్లగా ఆ రెండు సేనల మధ్య నిలిపాడు. ‘‘బావా, నేను అందరినీ పరిశీలించి చూసేదాకా రధము కదల్చకయ్యా’’ అని అచ్యుతుణ్ణి వేడుకొని అందరినీ చూడటం మొదలు పెట్టాడు అర్జునుడు.

దుర్యోధనుడి పక్షాన చేరి తమతో యుద్ధం చేసే వారెవరా అని పరిశీలనగా చూశాడు. మొదట సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు కనపడ్డారు. తాత. తండ్రి లేని తమను అన్నీ తానే అయి పెంచిన తాత, తమ యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు కనిపెట్టి పక్షి రెక్కలలో తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అలా తమ అయిదుగురినీ కంటికిరెప్పలా కాపాడి ఇంత వారిని చేసిన తాత! ఎవరి గుండెల మీద అయితే ఆడుకుంటూ తాము పెరిగారో ఇప్పడు ఆ గుండెలను బద్దలుగొడుతూ శరసంధానం చేయాలి తాను!

ఇంకొక వైపుచూశాడు, ఎవరి అనుగ్రహం వల్ల తాను ఇంత మేటి పోటరి అయ్యాడో, ఎవరు ప్రసాదించిన విద్య వల్ల ఇన్ని విజయాలు సాధించాడో, అసలు తనకు ధనస్సు ఎక్కుపెట్టటం, బాణం గురి పెట్టటం ఎవరునేర్పారో అలాంటి పూజనీయుడయిన గురువు ద్రోణాచార్యులవారి మీద ధనస్సెక్కుపెట్టి, బాణంగురిపెట్టాలా? తన ధనుర్విద్యా ప్రావీణ్యం తన గురువు ప్రాణం తీయటానికి ఉపయోగించాలా?

ఇంకా ఎదుటి సైన్యాన్ని తేరిపార చూశాడు!

వారిలో ఆయనకు గురువులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, పౌత్రులు, పెదతండ్రులు, పినతండ్రులు, సన్నిహిత బంధువులు కనపడ్డారు! యుద్ధం చేసి ఇంత మంది సన్నిహితులను చంపి తాను బాపుకునేదేమున్నది? రాజ్యం లభిస్తుంది. కానీ ఆ సుఖాలు తనతో కలిసి పంచుకొని ఆనందించే బంధువు ఒక్కడు కూడా మిగలడు కదా! మరి అలాంటప్పుడు రాజ్యమెందుకు? రాజ్య భోగాలెందుకు? ఈ రక్తపుకూడు తినాలా?

ఇన్ని ఆలోచనలు ఆయన మనస్సులో తేనెటీగలు ముసిరినట్లు ముసురుకున్నాయి, ఒక్కసారిగా మనస్సు పట్టు తప్పింది, నీరుగారి పోయి శరీరం వణకటం మొదలుపెట్టింది!

‘‘బావా, గాండీవం పట్టుతప్పుతున్నదయ్యా. చేతిలోనుండి జారిపోతున్నదయ్యా’’ అని బేలగా మాధవుడితో మొరపెట్టుకున్నాడు సవ్యసాచి!

ఆయన ఎలాంటి యోధుడు? ఒంటి చేత్తో ముక్కంటిని ఎదిరించిన వాడు. ఆ గాండీవంతోటే నివాతకవచులను నిర్జించినవాడు. ఆ గాండీవంతోటే ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సైన్యాలను చీల్చి చెండాడాడు. ఆ గాండీవం ఇప్పడు పట్టుదప్పి చేయిజారిపోతున్నది. పిరికితనం ఆవరించింది. సహజ స్వభావాన్ని కోల్పోయాడు. విపరీతమైన శోకము మనస్సును దహించి వేస్తుంటే. “అచ్యుతా! నాకన్నిటికీ నీవే దిక్కయ్యా. నా కర్తవ్యము నాకు తెలుపవయ్యా”! అని రధంలో కూలబడ్డ కుంతీపుత్రుడిని చూసి వాసుదేవుడు చేసిన కర్తవ్యభోధ ‘భగవద్గీత’.

వూటుకూరు జానకిరామారావు

Previous articleనిరీక్షణ
Next articleగొర్రిగేడ్డ రిజర్వాయర్ : గ్రానైట్ మైనింగ్  మహమ్మారి
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here