రామాయణ, భారతాలు ఋషుల ద్వారా ప్రపంచానికి అందిన భగవత్ ప్రసాదాలు. మానవ జాతికి మార్గదర్శకాలు. రామాయణం మనిషి ఎలా ఉండాలో పురుషోత్తముడైన రాముడిని చూసి నేర్చుకోమంటుంది. భారతం సమాజం ఎలా ధర్మబద్ధంగా నడవాలో జగద్గురు కృష్ణుడి ద్వారా తెలియజేస్తుంది. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతరిoచిన వీరు మంచికి చెడుకు జరిగే పోరాటంలో మంచి ఎలా జయిస్తుందో, చెడు ఎలా నాశన మవుతుందో తెలియజెపుతారు. మనిషి బయటే కాదు లోపల కూడా మంచికి చెడుకు యుద్దం జరుగుతూనే ఉంటుంది. స్వార్ధం, అహంకారం కారణంగా కలిగిన కోరికలు వినాశానికి దారితీస్తాయి. తనకు, ఇతరులకు మేలు చేసే ఆలోచనలతో మంచిని పెంచుకున్న వాడివల్ల సుఖం. శాంతి లభిస్తాయి అన్న సత్యాలను తెలుపుతాయి ఈ ఇతిహాసాలు.
Also read: “జీవితం ఎందుకు?”
నిష్కామ కర్తవ్య బోధన
మహాభారతంలో దాదాపు చివర కనిపించే భగవద్గీత మానవాళికి భగవత్ సందేశం. కురుక్షేత్రంలో రాజ్యంకోసం యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు ఎదురుగా కనిపించిన బంధువులను, హితులను చంపడం ఇష్టంలేక యుద్దం వద్దంటాడు. స్వార్ధంతో, పగతో, రాజ్యంకోసం కాక ధర్మ రక్షణకు, అధర్మాన్ని నిర్మూలించడానికి యుద్దం తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఒక బాధ్యత అని చెబుతాడు కృష్ణుడు. మనిషి అంటే శరీరం కాదని, ఆత్మ నశించదని మరో శరీరంతో అది పునర్జీవిస్తుందని కాబట్టి దాని గురించి చింతించ వద్దని చెబుతాడు కృష్ణుడు. తాను కర్తననే భావన వదలి ధర్మకర్తననే భావనతో కార్యక్రమాలు జరపాలంటాడు. ఆ నిష్కామ కర్తవ్య బోధనే భగవద్గీత.
Also read: తెలుగును ఆంగ్లంతో కలుషితం చేస్తున్నామా?
భీష్మ, ద్రోణులు అధర్మానికి చెల్లించిన మూల్యం
మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు అన్నీ మనకు పాఠాలే. కొన్ని మనం ఎలా నడుచుకోవాలో నేర్పిస్తే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలియజేస్తాయి. భీష్మ, ద్రోణులు పెద్దలైనా ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకోలేక పోతారు. రాజుకు విధేయులై ఉండాలన్న ధర్మం (బాధ్యత) పాటిస్తారు కానీ కళ్ళముందు జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డుకోరు. జీవితమంతా మంచిగా బ్రతికినా ఈ అధర్మ కార్యానికి శిక్షగా యుద్దంలో చంపబడతారు. మనం చెడు చేయక పోవడమే కాదు జరుగుతున్న చెడును అడ్డకోక పోవడం కూడా అధర్మమేనని, దానికీ శిక్ష పడుతుందని తెలియచేస్తాయి ఈ పాత్రలు. తన కుమారుడు అశ్వద్దామ కంటే శ్రద్ధ కలిగిన అర్జునుడికే ఎక్కువ బోధించాడు ద్రోణుడు. ఒక గురువు ఎలా నిష్పక్షపాతంగా ఉండాలో, శిష్యుడు ఎంత శ్రద్దతో నేర్చుకోవాలో తెలుస్తుంది ఇక్కడ. దృతరాష్ట్రుడు వారించకపోయినా తల్లి గాంధారి దుర్యోధనుడిని చెడు మార్గం వదలమంటుంది. కానీ దుర్యోధనుడు శకుని, కర్ణుడిలాంటి చెడ్డవారి మాటలకే ఆకర్షితుడవుతాడు. మంచి కంటే చెడు ఎంత ఆకట్టుకుంటుందో తెలుస్తుందిక్కడ.
Also read: “టీ టైంమ్ పొయెట్స్”
దుష్టచతుష్టయం
దుర్యోధనుడు స్వార్ధం, అహంకారం, ఈర్ష్య, కక్ష లాంటి లక్షణాలతో మంచివాళ్ళైన పాండవులను అనేక రకాలుగా బాధపెట్టడానికి, చంపడానికి ప్రయత్నిస్తాడు. అతనికి తోడైన శకుని, కర్ణుడు, దుశ్శాశనుడు కుట్ర, కుతంత్రాలతో, మాయోపాయాలతో ఎంత ప్రయత్నించినా చివరకు ధర్మ పరులైన పాండవులతో యుద్దంలో నశిస్తారు. సూర్య పుత్రుడు, శౌర్యవంతుడు, దానకర్ణుడుగా ప్రసిద్ధిగాంచిన రాధేయుడు కూడా చావక తప్పలేదు, అధర్మ ప్రభువును అనుసరించడం. దుర్లక్షణాలు, దుష్ప్రవర్తనకు ఫలితం చెడుగానే ఉంటుంది.
Also read: “తెలుగు జబ్బు”
ధర్మనిష్ఠ కారణంగా పాండవులకు అంతిమ విజయం
పాండవులు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని అవమానాలకు గురైనా ధర్మ మార్గాన్ని వీడలేదు. గంధర్వ రాజు దుర్యోధనుడిని బందీగా తీసుకెళుతున్నపుడు అడ్డుపడి విడిపించాడు అర్జునుడు. తమలో తమకు పొరపొచ్చాలున్నా బయటివారిముందు పలుచన కాకూడదన్న విషయం తెలియజేస్తుంది ఈ సంఘటన. అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తయిన తరువాత ప్రతీకార భావనతో రగులుతున్నా సంధికి సమ్మతిస్తారు పాండవులు. చివరకు అయిదు ఊళ్ళు ఇచ్చినా చాలంటారు. బలవంతులై రాజ్యాన్ని యుద్దంలో గెలుచుకునే అవకాశమున్నా వారి సంయమనం, శాంతికాముకత్వం, ధర్మ నిష్ట తెలుస్తాయి మనకు. పెద్దన్న మాటకు, కృష్ణుడి మార్గదర్శకత్వానికి ఎన్నడూ ఎదురు మాట్లాడని సంస్కృతి వారిది. యుద్ధం ప్రారంభంలో శత్రు పక్షాన నిలిచిన భీష్మ ద్రోణులకు నమస్కార బాణాలతో వినయం చూపిన సంస్కారం అర్జునుడిది. అది నిష్కామకర్మకు చక్కటి ఉదాహరణ. ఎన్ని బాధలు పడ్డా ధర్మనిష్ఠ కారణంగా చివరకు వాళ్ళే జయించారు. అదే మానవ జాతికి ప్రేరణ.
Also read: “చలం – స్త్రీ”
గుణకర్మల ఆధారంగా వర్ణం
“చతురవర్ణం మయా సృష్టం .. గుణ కర్మ విభాగ” అంటాడు కృష్ణుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు తన సృష్టి (అంటే తన బిడ్డలు) అని చెప్పినపుడు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కొంతమంది అనుకోవడం మూర్ఖత్వం. పుట్టుకను బట్టి కాక వారి గుణాలను, చేసే పనులను బట్టి నాలుగు వర్ణాలుగా ఏర్పరచానని అంటాడు. భగవంతుడు అందరినీ తనవారుగా చూసినా మనం వృత్తులను కులాలుగా భావించి సమాజంలో మన మధ్య అడ్డుగోడలు నిర్మించుకొని సమస్యలు సృష్టించుకున్నాం. ఉదాహరణకు పేపర్లు అమ్మిన కలాం, టీ అమ్మిన మోడి పుట్టుకతో కాక ప్రవర్తనతో ఎంత ఉన్నతులుగా ఎదిగారో మనం చూస్తున్నాం.
Also read: “రచన లక్ష్యం”
అంతిమ లక్ష్యం మోక్షం
మానవ జీవిత లక్ష్యం మోక్షమని, అది సాధించడానికి అరిషడ్వర్గాలను అధిగమించడం మార్గమని, సత్వ, రజో, తమో (త్రి)గుణాత్మకమైన లోకంలో నిష్కామకర్మతో కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో తనకనువైనదానిని అనుసరించాలని బోధిస్తుంది గీత. వేదాంతం అంటూ కర్తవ్యాన్ని మరచి సోమరులుగా ఉండకూడదంటుంది గీత. సామాన్యులు కర్మ, భక్తి మార్గాలలో సగుణ బ్రహ్మను ఆరాధించాలని, ఆలోచనాపరులు జ్ఞాన మార్గంలో ప్రయాణించమనీ చెబుతుంది గీత. ఆధునిక యుగంలో తృప్తిలేని జీవితాల్లో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా భావించబడుతున్న యోగ మార్గం నిజానికి జీవుడిని దేవుడికి దగ్గర చేసే మరొక మార్గం అంటుంది గీత. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బ్రహ్మ సూత్రాల వంటి ఆధ్యాత్మిక గ్రంధాలే కాక సమస్త ఆద్యాత్మిక జ్ఞాన సంక్షిప్త రూపమే గీత. నమ్మకం ఆధారంగా ఉన్న మతాలకు భిన్నంగా తార్కానికి నిలబడే మతానికి వివరణ గీత. సిద్ధాంతాలు అర్థం కాకపోయినా ‘భజ గోవిదం’ అంటూ మంచిగా బ్రతికితే చాలంటుంది గీత. సామాజిక, ఆద్యాత్మిక మానవ జీవితం సక్రమ మార్గంలో గడుపుకోవడానికి మనకు లభించిన కరదీపిక గీత. జీవిత విలువల్ని గుర్తించి విలువైన జీవితాన్ని గడపమంటుంది గీత. ధర్మ నిర్వహణే మన పరమ కర్తవ్యమని బోధిస్తుంది గీత.
Also read: “మహమ్మారి”