చిన్నప్పటి నించీ… ఒక రకంగా ఊహ తెలిసిన దగ్గర్నుంచీ… చాలామంది లాగే, నేను కూడా “గెడ్డం” ఉన్న వాళ్ళందరూ “గొప్పోళ్ళు” అనే నమ్ముతూ వచ్చాను… ‘చందమామ’ కధల పుస్తకం లో బొమ్మల ప్రభావమో… మా అమ్మ పుణ్యాన చిన్నవయసు నుంచీ చదువుతోన్న-పుస్తకాల, చూస్తున్న-సినిమాల, ఏర్పరుచుకున్న ఎంతో-కొంత భక్తి ప్రభావమో… “గెడ్డం” గట్రా ఉన్నవాళ్లు కనపడితే ఎంతో గొప్పోళ్ళుగా, గౌరవంగా చూసేవాడిని… అప్పట్లో, నా దృష్టి లో వాళ్ళు ‘పెద్ద’ మనుషులు.
అందరూ గొప్పోళ్ళు కాదురా…
అప్పటికీ, మా నాన్న గారు అప్పుడప్పుడూ చెప్తూనే ఉండేవారు ‘గెడ్డం” పెంచే వాళ్ళందరూ “గొప్పోళ్ళు” కాదురా అని!… కానీ, ఎందుకో… ఈయన ప్రతీదీ అలాగే చెప్తారు! ఈయనకి గడ్డం లేదని కుళ్ళు గామోసు అని అప్పట్లో సమాధానపడేవాడ్ని. నేనెంతో ఇష్టపడే స్వామి వివేకానంద ఫోటో కూడా ‘గెడ్డం’ ఉన్నదే ఎప్పుడూ నా దగ్గర ఉంచుకొనే వాడ్ని.
ఈ రోజుల్లో గెడ్డం ఉన్న స్వాములే అన్ని మతాల్లోనూ ప్రముఖులు గా వెలుగొందుతున్నారు. గెడ్డానికి మతంతో పెద్దగా పని లేదు. కానీ, అన్ని మతాల్లోని ముఖ్యులందరూ ఎందుకో గెడ్డం తోనే ఉంటున్నారు… ఇంకా, ఈ మధ్య చాలా మంది ‘గెడ్డాలు’ చాలా బాగా పెంచుతున్నారు… ఎందరో ‘పెద్దమనుషులు’ కూడా ప్రత్యేకంగా ‘ఇంకా’ పెద్దగా గెడ్డాలు పెంచి ఇంకా గొప్ప ‘పెద్ద’ మనుషులుగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు…
పరమానందయ్య శిష్యుల కథ
ఇక్కడ పెద్దమనుషులంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ చూపించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’ అనే గొప్ప సినిమా గుర్తుకొస్తుంది… ఆ సినిమా లో వచ్చే ఒక గొప్ప పాట “పరమ గురుడు చెప్పిన వాడు ‘పెద్ద’ మనిషి కాదురా… ‘పెద్ద’ మనిషి అంటేనే ‘వాడి’ బుద్ధులన్నీ వేరురా…” లోని ప్రతి పదం-చరణం నిజం గా అక్షర సత్యం అని ఇన్ని దశాబ్దాల తర్వాత నాకు అర్ధం అవుతోంది!… మా నాన్న గారి మాటల్లోని సత్యం కూడా ఇప్పుడిప్పుడే పూర్తి గా బోధపడుతోంది…!
అప్పట్లో ఉత్తములు, యోగులు, మునులు, బ్రహ్మచారులు, పరివ్రాజకులు, యోగులు, సర్వత్సంగపరిత్యాగులు… ఇత్యాది నిజమైన పెద్దమనుషులు మన దేశం లో, మన సమాజం లో అన్ని మతాల్లోనూ ఉండేవారు… వాళ్లలో చాలా మంది గడ్డాలతో ఉండేవారు. కానీ, వాళ్ళెవరూ వీళ్ళలాగా ప్రత్యేకంగా గెడ్డాలు గట్రా పెంచేవారు కాదు… కేవలం ఆధ్యాత్మికత లో అంకితం అవటంచేత, బాహ్యసౌందర్యాన్ని పట్టించుకోకపోవడం చేత వాళ్ళు అలా ఉండేవారు.
మోడరన్ పెద్దమనుషులు
కానీ, ఈ మోడరన్ ‘పెద్ద’ మనుషులు మాత్రం ప్రత్యేక పబ్లిసిటీ లో భాగంగా, ప్రచార పటాటోపాల కోసమే స్పెషల్ గా ట్రిమ్ చేసుకుంటూ గెడ్డాలు పెంచుతున్నారు… ఈ నయా ట్రెండ్ ‘గొప్పోళ్ళ’లో గెడ్డం పెంచడం అనేది కామన్… ఇది ఒక ప్రధాన అర్హతా???… తెలియదు.
వీళ్ళు నిజమైన నటులు
కానీ, వీళ్ళు నిజమైన నటులు… అసలైన నట సామ్రాట్టులు… నిక్కమైన నట రత్నాలు… అసలు సిసలు నవరస నట సార్వభౌములు. మనసులో లేని మాటలు కూడా నోటితో చాలా తీయగా చెప్పే నట కౌశలం వీరి సొంతం. నిజంగా, వీళ్ళ నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా వీళ్ళ స్థాయి కి అది సరిపోదు…!
తెలుగు చలనచిత్ర రంగం లో ఆణిముత్యం లాంటి గుండమ్మకథ చిత్రం లో సినీ కవి గారు చెప్పినట్టు ఈ నయా గెడ్డం స్వాములు…
“వేషమూ మార్చెను… భాషనూ మార్చెను…
మోసము నేర్చెను… తలలే మార్చెను…
అయినా మనిషి మారలేదు…
ఆతని కాంక్ష తీరలేదు!
వేదికలెక్కెను… వాదము చేసెను…
త్యాగమె మేలని బోధలు చేసెను…
అయినా మనిషి మారలేదు…
ఆతని బాధ తీరలేదు!”.
వీళ్ళ తపన ఐతే అస్సలు ఎప్పటికీ తీరదు. ఈ ప్రతి పదం-చరణం నిజంగా అక్షర సత్యం… అన్ని మతాలూ మానవ వికాసం కోసమే… విశ్వశాంతి కోసమే… మనఃశాంతి కోసమే… ఐతే, కొందరు వీటికి వక్ర భాష్యాలు చెప్తూ తమ స్వార్ధం కోసం ప్రజల్ని వక్రమార్గం లోకి నడపాలనుకొంటున్నారు.
ఇది చదవండి: ‘కులం’ చేత… ‘కులం’ కోసం… ‘కులం’ తో… సకలం ‘కులం’ గా… సం’కులం’తో వ్యా’కుల’మైపోతున్న మన ‘భారతీయం’
ఆధ్యాత్మిక జీవనమే పునాది
మన దేశం అనాదిగా ఆధ్యాత్మిక జీవనమే పునాదిగా, సర్వ-మత సమ్మేళనంగా, సకల జన సమ్మేళనమైన జీవితంతో, ప్రపంచానికే ఆదర్శం గా శాంతియుతమైన ప్రజా ప్రపంచాన్ని సృష్టించింది. సమాజాన్ని-దేశాన్ని కుల, మత, జాతి, వర్గ, ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొట్టి-విడగొట్టి లబ్ది పొందడమే లక్ష్యం గా, దేశం పై సంపూర్ణ ఆధిపత్యం కోసం అన్ని మతాలకూ చెందిన ఈ నయా గెడ్డం స్వాములు నిరంతరం కేవలం ‘రాజ్యాధికారం’ కోసం రాక్షసంగా రాజకీయాలు చేస్తున్నారు.
మతం వీరికి ఒక ముసుగు మాత్రమే… గెడ్డాలు కేవలం అలంకారాలు… ప్రజల్ని గొర్రెల సమూహాలు గా భావించి, సమాజాన్ని- దేశాన్ని విచ్ఛిన్నం చేసి తమ ప్రాబల్యాన్ని, రాజకీయ లక్షాల్ని సాధించుకునే క్రమంలో దేనికైనా దిగజారుతున్నారు ఇప్పటి గెడ్డం స్వాములు… ఇది చాలా దురదృష్టకరం… భారతజాతి కి, చరిత్రకు అవమానకరం.
అవినీతి ఉండదనుకున్నాం
కొందరు అనుకొంటున్నారు… “బ్రహ్మచారులు, యోగులు, సర్వత్సంగపరిత్యాగులు… వంటి స్వామీజీలు, ఆయా మతాలకు చెందిన నయా గెడ్డం స్వాములు రాజ్యాధికారం చేపట్టడం వల్ల అవినీతి కి ఆస్కారం ఉండదు” అని… ఎందుకంటే వీళ్ళు బ్రహ్మచారులవటం వల్ల వారసత్వ రాజకీయాలు, కుటుంబ దోపిడీ, తద్వారా అవినీతి ఉండవు కదా…? అనుకొంటున్నారు.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఆందోళనకరమే. ఇది కొంతవరకూ నిజమే… కానీ, ఇదొక పిచ్చి భ్రమ, నెరవేరని కల అని ఇప్పటికే చాలావరకు నిరూపితమైంది. మనిషి రక్తం రుచి మరిగిన పెద్దపులి కన్నా, రాజ్యాధికారం రుచి మరిగిన రాజకీయ నాయకుడు ఎంతో ప్రమాదకరమైన వాడు… దీనికి ఎవరూ మినహాయింపు కాదు… బ్రహ్మచారులు, యోగులు, న్యూ స్వామీజీలు, నయా గెడ్డం స్వాములు కూడా.
ఇంతకంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు
మత పిచ్చి కన్నా ప్రమాదకరమైన జబ్బు ఈ ప్రపంచంలో లేదు… “అధికార లాలస” అనేది అవినీతి కన్నా, కుటుంబ పాలన కన్నా ఎంతో ప్రమాదకరం… ఒకరకం గా ఇంకా ఎన్నో వేల రెట్లు భయంకరం… “గెడ్డాలు” పెంచేవాళ్ళందరూ “గొప్పోళ్ళు” కాదు…!!! మతం ఎప్పటికీ మానవత్వం కంటే గొప్పది కాదు…
ఈరోజుల్లో చాలామంది “గొప్పోళ్ళు” ‘బాహ్యరూపం మాత్రం సన్యాసి వేషం… అంతరంగం అంతా క్షుద్ర రాజకీయం’ చందాన నటిస్తున్నారు… ఈ పరిణామం చాలా దురదృష్టకరం, అవాంఛనీయం, ఆందోళనకరం… అస్సలు మతం కోసమే పనిచేయాల్సిన గౌరవనీయులైన సన్యాసులకు, స్వామీజీలకు-పూజారులకు, చర్చి బిషప్లకు, ఫాదర్లకు-పాస్టర్లకు , మసీదు ఇమాంలకు, ముల్లాలకు-మౌల్వీలకు రాజకీయాలతో ఏం పని ?
ఖలిస్థాన్ ఉద్యమం
కొందరు స్వార్ధ సిక్కు మతనాయకులు పవిత్రమైన మత హద్దులు దాటడం వల్లే ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమం ఉత్పన్నమయిందని మరచిపోవద్దు. దానివల్ల భారత దేశానికీ, పంజాబ్ రాష్ట్రానికీ, పంజాబ్ ప్రజలకూ కలిగిన నష్టం పూడ్చలేనిది, తిరిగిరానిది. భారతదేశానికి అక్రమంగా సంక్రమించిన ఎమర్జెన్సీ అనేది ఒకరకం గా భారత ప్రజాస్వామ్యానికి ఒక మేలుకొలుపు… ఒక హెచ్చరిక… ఇందిరా గాంధీ జీవితానికీ, కాంగ్రేస్ పార్టీకీ, ఇండియా చరిత్రకూ ఒక మాయని మచ్చ… కానీ, అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ని చాలా దైర్యంగా ప్రకటించి ఒక రకం గా నిజాయితీ గా నియంత అయ్యింది…
కానీ, ఇప్పటి కాలం లో అప్రకటిత ఎమర్జెన్సీ ల మాటేమిటి…? చాలా వరకూ శాసన, కార్యనిర్వాహక, చట్ట, రాజ్యాంగ వ్యవస్థల్నీ, కొంతమేరకు న్యాయ వ్యవస్థనూ, ఇంకొంతవరకూ ఫోర్త్ ఎస్టేట్ ‘మీడియా’ ను కూడా కొందరు స్వార్ధపరులు అంతర్లీనమైన తమ స్వార్ధ ప్రయోజనాలకోసం తమ రాజకీయ గుప్పెట్లో పెట్టుకొంటూ సామ-దాన-భేద- దండోపాయాలతో వంచనతోనైనా, దొడ్డిదారినైనా, బ్లాక్మెయిల్ చేసైనా, హెచ్చరికలతో నైనా ఎంతకైనా తెగించైనా, దిగజారైనా, బెదిరించైనా తమ అధికారం కోసం, భారత దేశాన్ని తమ సంపూర్ణ ఆధిపత్యం లో తెచ్చుకోవడానికి అంగలు చాస్తున్న రాజకీయ ‘అధికార లాలస’ భారతజాతికి ఎంతో ప్రమాదకరం… విచ్ఛిన్నకరం… అందోళనకరం.
ఖర్మభూమి కాదు, కర్మభూమి
భారతదేశం ఒక కర్మ భూమి… ఎవరి ఖర్మ భూమీ కాదు!… అనాదిగా ప్రపంచానికి ఒక మార్గం చూపిన దేశం మనది… ద్విజాతి సిద్ధాంతంతో మన దేశం విడిపోయినా భారత దేశం లో అన్ని మతాలకూ సమాన రక్షణ, ప్రాతినిధ్యం, గౌరవం ఇస్తూ ఇన్నేళ్లు గా కుల, మత, జాతి, వర్గ, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఇంత కాలం మనగలుగుతున్న అతి పెద్ద, ఎంతో గొప్ప, అత్యున్నత ప్రజాస్వామ్య దేశం మనది…
ఎన్నో విభిన్నప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాల, భౌగోళిక ప్రదేశాలకు చెందిన ఇంచుమించు 150 కోట్ల మంది భారతీయులు విశాల భారత ఉపఖండం లో, ప్రపంచవ్యాప్తం గా స్వేచ్ఛ, సమాన, సౌభ్రాతృత్వాలతో జీవిస్తున్నారు… ఇంతకాలంగా ప్రజాస్వామ్యంతో విజయవంతంగా మనుగడ సాగిస్తున్న విభిన్న, విశాల దేశం ప్రపంచం లో మరొకటి లేదు.
దయచేసి మీ రాజ్యాధికారం కోసం, రాజకీయ లక్ష్యాల కోసం ఈ పవిత్ర భారత దేశాన్ని, దేశప్రజల్ని విడగొట్టవద్దు.
(ఈ ఆర్టికల్ ఎవర్నీ ఉద్దేశించినది కాదు… ప్రత్యేకంగా ఏ మతాన్నీ, జాతినీ, కులాన్నీ, అసలెవర్నీ ఉద్దేశించింది అసలే కాదు… “గెడ్డం” ఉన్నవార్ని గానీ, “గెడ్డం” పెంచుతున్న వారినిగానీ “గొప్పోళ్ళ”ను గానీ అసలెవర్నీగాని ఉద్దేశించినది అసలే, ఎంతమాత్రం కాదు… ఒకవేళ గెడ్డాలున్న వారి మనో భావాలు ఏమైనా, ఎంతైనా, కొంచమైనా, పొరబాటున గానీ దెబ్బతింటే దయచేసి మన్నించగలరు… క్షంతవ్యుడ్ని…🙏)
జై హింద్… భారత మాతకు జై.