ఆధునిక భేతాళ కథలు-1
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా స్మశానం వైపు నడవసాగాడు .
అప్పుడు శవంలోని బేతాళుడు “రాజా కష్టపడితే పడ్డావు కానీ నీకు కష్టం తెలియకుండా ఉండటానికి మర్యాద రామన్న కథ చెబుతాను “అంటూ కొత్త కథ చెప్పసాగాడు.
“పూర్వం ఓ విశాల సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యంలో ముప్పై సంస్థానాలు ఉండేవి. ఆసంస్థానాలకి రాజులు ఉండేవారు. వాళ్లందరూ చక్రవర్తికి అనుకూలంగా అణిగిమణిగి మెదిలే వారు. చక్రవర్తికి చెల్లించాల్సిన కప్పాలని సమయానికి చెల్లించేవారు.
ఆ చక్రవర్తి ఆధునిక భావాలు కలిగిన వాడు. తానే రాజై ఉండి తానే తీర్పులు చెప్పడం బాగుండదని అతనికి కనిపించింది. అది ఒక్కటే కారణం కాదు. అతని దగ్గర కేసులను సులువుగా పరిష్కరించడానికి బీర్బల్ లాంటి మంత్రులు కూడా లేరు. అందుకని తీర్పులు చెప్పడానికి ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
తన రాజధానిలోనే కాకుండా ప్రతీ సంస్థానంలో ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని చక్రవర్తి ఫర్మానా జారీ చేశాడు. వాటికి మర్యాద రామన్న న్యాయస్థానాలని పేరు పెట్టాడు. రాజధానిలో ఓ పెద్ద న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఆ న్యాయస్థానం పరిపాలన కింద మిగతా న్యాయస్థానాలు పని చేయాల్సి ఉంటుందని ఫర్మానాలో ప్రత్యేకంగా చెప్పారు. సంస్థానాలలోని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు ఎవరికైనా నచ్చకపోతే వాళ్లు రాజధానిలోని పెద్ద న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆ న్యాయస్థానాలకు విశేష అధికారాలను ఇస్తూ చక్రవర్తి ఓ ఫర్మానా జారీ చేశాడు.
న్యాయస్థానాలు చాలా బాగా పని చేయడం మొదలు పెట్టాయి. ప్రజల సమస్యలను పట్టించుకొని వాటికి పరిష్కారం లభించే విధంగా అవి ఆదేశాలను జారీ చేసేవి. ఆ సంస్థానాధీశులు చేసిన అక్రమ చట్టాలను రద్దు చేసేవి. ఆ రాజుని మందలించేవి. ఆ సామ్రాజ్యంలో ఉత్తర రాజ్యం, మధ్య రాజ్యం, దక్షిణ రాజ్యం అన్న పేర్లతో ఎన్నో రాజ్యాలు ఉండేవి.
ఆ న్యాయస్థానాల పనితీరుతో చాలామంది సంస్థానాధీశులకి కోపం వచ్చేది. అసౌకర్యం కూడా కలిగేది. ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళది. ఎందుకంటే ఆ న్యాయస్థానాలు చక్రవర్తి ఫర్మానా తో ఏర్పడినవి. మరీ ముఖ్యంగా ఉత్తర రాజ్యం రాజుకి ఆ న్యాయస్థానాల మీద అసహనం పెరిగిపోయింది. వాళ్ల రక్షకభటులు ఏ చిన్న తప్పు చేసినా న్యాయస్థానాలు మందలించేవి. ప్రజలకి కష్టం కలిగించే శాసనాలను రద్దు చేసేవి.
సంస్థానాల బాగోగులు చూడటానికి చక్రవర్తి అప్పుడప్పుడు ఆయా సంస్థానాలను సందర్శించేవాడు. ఆ విధంగా ఉత్తర రాజ్యం సంస్థానాన్ని చూడటానికి చక్రవర్తి వస్తారన్న సమాచారాన్ని ఆ రాజుకి తెలియజేశారు. దాంతో ఆ రాజ్యంలో హడావిడి పెరిగిపోయింది. రాజూ, మంత్రులు సమావేశాలని ఏర్పాటు చేసి ఎమేమి చేయాలి అని ఆలోచించసాగారు.
చక్రవర్తి గారిని ఏ కోరికలు కోరాలో అన్న విషయాలని చర్చించారు. నిధులు కావాలని కోరాలని నిర్ణయించుకున్నారు. న్యాయాస్థానాల పనితీరు తమకు నష్టం కలిగిస్తుందని చెప్పాలని మొదట అనుకున్నారు. కానీ ఆ విధంగా చెప్పడం బాగోదని ఓ మంత్రి సలహా ఇచ్చాడు. నేరుగా కాకుండా పరోక్షంగా న్యాయస్థానాల మీద తమ అసంతృప్తిని వ్యక్తపరచాలని అనుకున్నారు.
చక్రవర్తి ఏ రాజ్యానికి వచ్చినా ఆ రాజు అక్కడ దావత్ (విందు) ఇచ్చే సాంప్రదాయం ఉంది. దావత్ కి న్యాయమూర్తులని ఆహ్వానించడం కూడా ఓ రివాజు. ఈసారి చక్రవర్తి ఇచ్చే దావత్ కి ఆ రాజ్యంలోని న్యాయాధీశులతో పాటు రాజధానిలో ఉన్న మర్యాద రామన్నని కూడా పిలవాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా చక్రవర్తి వచ్చినప్పుడు రాజులు ఇచ్చే విందుకి మర్యాద రామన్నని పిలవరు. రాజధాని ఆ రాజ్యానికి చాలా దూరం. అంతే కాకుండా అలాంటి సాంప్రదాయం కూడా లేదు. కానీ ఈసారి మాత్రం మర్యాద రామన్నని పిలవాలని రాజూ,మంత్రులూ నిర్ణయించుకున్నారు.
మర్యాద రామన్నని పిలవడానికి ప్రత్యేకంగా ఓ మంత్రి ని పంపించారు. విందుకు రావడానికి మర్యాద రామన్న అంగీకరించారు. పని చూసుకొని సాయంత్రం ఆరు గంటలకి ప్రత్యేక పుష్పక విమానంలో మర్యాదరామన్న ఉత్తర రాజ్యానికి వచ్చేశాడు. చక్రవర్తికి ఇచ్చిన విందులో పాల్గొన్నాడు. ఆ రాజ్యంలోని న్యాయాధీశులు అందరూ ఆ విందుకు హాజరయ్యారు.
న్యాయాదీశులతో మర్యాద రామన్న చాలాసేపు మాట్లాడినాడు. మర్యాద రామన్న రాకని ఆ న్యాయాధిపతులు ఊహించలేదు. కొంతమంది ఆందోళన చెందారు. మరికొంతమంది అసహనానికి లోనయ్యారు. కొంత మంది సుఖంగా ఉన్న తమకి ఏమైనా సమస్యలు వస్తాయా అని ఆలోచనలో పడ్డారు. ఉత్తర రాజ్యంలో పిల్లలు బంధువులు అందరూ ఉన్నారు. తమకి బదిలీ అయితే ఎలా అని కొంత మంది న్యాయాధీశులు ఆలోచనల్లో పడ్డారు. ఆ రాజుకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన న్యాయాధీశులు మరీ ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు.
ఆ పెద్ద మర్యాద రామన్నని రాజు ఎందుకు ఆహ్వానించాడు? దాని అంతరార్థం ఏమిటి? మర్యాద రామన్న మీద గౌరవంతో పిలిచాడా? వేరే ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది” అన్నాడు బేతాళుడు
దానికి విక్రమార్కుడు “బేతాళా! ఉత్తర రాజ్యం రాజు ఆ రాజ్యంలోని న్యాయాధీశుల తీర్పులతో బాధపడుతున్నాడు. ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు. తాను అనుకున్నట్టుగా పరిపాలన చేయలేకపోతున్నానని భావిస్తున్నాడు. ఆ విషయాన్ని చక్రవర్తికి చెప్పలేడు. తమ రాజ్యం లోని న్యాయధీశులని వేరే రాజ్యాలకి బదిలీ చేయమని చక్రవర్తిని కోరలేడు. అందుకని ఇంత పెద్ద మర్యాద చేశాడు. మేము ఇచ్చే విందుకు అంత దూరం నుంచి మర్యాద రామన్న లాంటి పెద్దయనే వచ్చాడు. మీరెంతా అని అన్యాపదేశంగా తన రాజ్యంలోని న్యాయాధిపతులకి రాజు చెప్పాడు. సఫలమయ్యాడు కూడా .అంతే !
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు.
ఉత్తర రాజ్యం రాజు తెలివిని తేటతెల్లంచేస్తూ అతని విపత్కర పరిస్థితిని దూరం చేసిన మంచి కథ
నాటి కథలు కావు నేటి మేటి కథలు చాలా బాగుంది అద్భుతమైన కృషి కి అభినందనలు …మరిన్ని రావడమే కాదు పుస్తక రూపంలో తేవాలి
మన సంస్థ పైన చురకలు ఇప్పటికి వేస్తున్నారు.
బలే మంచి కథ.
Adbhutamaina kathalu. Samakaalina Rajakeeyala paina, samjam lo kanabadutunna avanchaneeya shaktula paina adbhutamaina rayadam lo Jimbo Rajendar garu Ditta.