Sunday, December 22, 2024

బైడెన్, కమలకు శుభాకాంక్షలు

  • అమెరికాలో డెమాక్రాట్ల నాయకత్వంలో కొత్త  ప్రభుత్వం
  • బైడెన్ కు స్వాగతం చెబుతున్న పెను సవాళ్ళు
  • ట్రంప్ నష్టాలూ, తంపులూ అధిగమించడమే తక్షణ కర్తవ్యం
  • కొత్త ప్రభుత్వం విదేశాంగనీతి ఎట్లా ఉంటుందో చూడాలి
  • ట్రంప్ మళ్ళీ మరో రూపంలో వస్తానంటున్నాడు. నిజంగా వస్తాడా?

అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అమెరికాతో సంబంధాలున్న భారత్ మొదలు అనేక దేశాలకు కొత్త ఆశలు చివురిస్తున్నాయి. దేశాన్ని అగ్రరాజ్యంగా నిలుపుతానని, అందరితో కలిసి సాగుతానని, పాత బంధాలు తిరిగి నిర్మిస్తానని, కొత్త బంధాలు సృష్టిస్తానని, కొత్త వెలుగులు పూయిస్తానని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తొలి ప్రసంగంలో తన వాణిని లోకానికి వినిపించారు.

గతం విస్మరించని బైడెన్

దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడు దాకా ఎదిగిన బైడెన్ నిన్నటి జీవితాన్ని మరచిపోలేదు. తనలోని సగటు మనిషిని అలాగే నిలుపుకున్నాడని, అతను రాల్చిన కన్నీటి బొట్లే సాక్ష్యం చెబుతున్నాయి. విపరీత మనస్తత్వంతో వికృత చేష్టలు చేసి, జాత్యహంకారం, ధనమదం, అధికారం పొగరు చూపించిన నిన్నటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బోలెడు చెడ్డపేరు మూటగట్టుకొని, గంపెడు కష్టాలు కానుకగా ఇచ్చి, సీటు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. జో బైడెన్ వైఖరి తొలి నుంచీ ట్రంప్ కు పూర్తి భిన్నంగా ఉంది.తాను  అందరివాడిననే భరోసాను ప్రకటించాడు.

భారత్ తో సంబంధాలు మెరుగవుతాయని నమ్మబలికాడు

ట్రంప్ చేపట్టిన అనేక కార్యక్రమాలకు బైడెన్ భరతవాక్యం పలికాడు. భారత్ తో తమ బంధాలు మరింత దృఢంగా ఉంటాయనే విశ్వాసాన్ని కలిగించాడు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను ఎంపిక చేసిననాడే ఎందరివో  మనసులు గెలుచుకున్నాడు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావడం అమెరికాలో చారిత్రక అంశమైతే, భారతీయ మూలాలు కలిగి ఉండడం మనకు అమితంగా నచ్చిన అంశం. మొదటి నుంచి వినవచ్చినట్లుగా, బైడెన్ బృందంలో కీలకమైన పదవుల్లో ఎక్కువమంది భారత అమెరికన్లే ఉన్నారు. ప్రతిభతో పాటు, నైతికత వల్ల బైడెన్ వీళ్ళందరినీ  విశ్వసించారు. భారతదేశం పట్ల అతనికి ఉండే ప్రత్యేక గౌరవానికి, విశ్వాసానికి ఇవి మచ్చుతునకలు.

తొలిరోజే అనేక నిర్ణయాలు

బైడెన్ తొలినాడే అనేక కీలక నిర్ణయాలు తీసుకొని, సరిహద్దుల గోడలు  బద్దలు కొట్టేశారు. అందులో మిగిలిన దేశాలకు ఒనగూరే అంశాల విషయం అట్లుంచగా, భారతదేశానికి ప్రయోజనాలు కలిగించే అంశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు, వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, విద్యాభ్యాసం సాగిస్తున్నవారందరికీ స్వేచ్చాయిత వాతావరణం కలిగే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీసా అనుమతులు, పౌరసత్వం మొదలైన కీలకమైన అంశాల్లో మనవాళ్లకు ఊరట కలిగే విధంగా విధానాలు ఉండనున్నాయి. అమెరికా ప్రగతి ప్రయాణంలో భారత్ ను కూడా కలుపుకొని సాగుతామని బైడెన్ పదేపదే చెబుతున్నారు.

అమెరికా తోడ్పాటు భారత్ కు అత్యవసరం

అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాల్సిన మనకు అమెరికా తోడ్పాటు చాలా అవసరం. ముందుగా తాను ఇంట గెలవాలి. తర్వాత రచ్చ గెలవాలి. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఆర్ధిక  ప్రయాణంలో వెనుకుబాటుతనం, కోవిడ్ వల్ల ఏర్పడ్డ అనారోగ్యం వాతావరణం, నిరుద్యోగ సమస్యలు, గత పరిపాలన మిగిల్చిన ఆర్ధికపోట్లు, వివిధ దేశాలతో ఏర్పడ్డ అగాధాలు నుంచి అమెరికాను మళ్ళీ సాధారణ స్థితికి తేవాలి. ట్రంప్ తెచ్చిన నష్టాన్ని పూడ్చాలి. సమాంతరంగా అంతర్జాతీయ ప్రయాణం సాగించాలి.

చైనా, రష్యాలతో బైడెన్ ఎలా వ్యవహరిస్తారు?

ఈ ప్రయాణంలో చైనాతో ఎలా వ్యవహారిస్తారు? రష్యాతో విధానం ఎలా ఉంటుంది? పాకిస్తాన్ -భారత్ బంధాలలో సమతుల్యత ఎట్లా సాధిస్తారు? మొదలైనవన్నీ ప్రశ్నలే. వీటికి తోడు, ట్రంప్ తెచ్చిన “అమెరికా ఫస్ట్” అనే నయా శ్వేత జాతివాదంతో ఎలా వ్యవహారిస్తారు అని కోట్లాదిమంది తెల్లజాతీయులు బైడెన్ వైపు చూస్తున్నారు. నేను ఎక్కడకీ వెళ్లడం లేదు, కొత్త రూపంలో మళ్ళీ వస్తానని ట్రంప్ చెప్పివెళ్లారు. కొత్తరూపం అంటే? శ్వేత జాతీయవాదంతో కొత్త పార్టీని స్థాపిస్తాడా? అనే చర్చలు మొదలయ్యాయి.

అమెరికా పార్లమెంటులో చిత్రమైన పరిస్థితి

బైడెన్ తన విధానాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే రెండు సభల్లోనూ ఆమోదముద్ర పొందాలి. కాంగ్రెస్ లో తమ పార్టీ మెజారిటీ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కంటే తక్కువగా ఉంది. దీన్ని అధిగమిస్తూ ముందుకు సాగాలి. తన పరిపాలన, ప్రవర్తన ద్వారా అచంచలమైన విశ్వాసాన్ని కలుగజేసి భవిష్యత్తులో రాబోయే కాంగ్రెస్ ఎన్నికల్లో తమ డెమోక్రాటిక్ పార్టీ మెజారిటీ సాధించేలా చూడాలి. ఇవన్నీ సవాళ్లే. చైనా ప్రయాణం చాలా వేగవంతంగా ఉంది. త్వరలోనే అమెరికాను అధిగమిస్తుందని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అమెరికా అగ్రాసనాధిపత్యాన్ని కాపాడడం బైడెన్ కు అత్యంత ముఖ్యమైన సవాల్. 

లేటు వయస్సులో ఘాటు ఎజెండా

వయసు రీత్యా బైడెన్ ఎనిమిది పదుల వయస్సుకు చేరువలో ఉన్నారు. ఆరోగ్యం కూడా అంత గొప్పగా లేదు.  అధ్యక్షుడుగా సమర్ధవంతమైన పాలన అందించాలంటే, జవనాశ్వంలా పరుగులెత్తాలి, పరుగులు పెట్టించాలి. ఇంతలేటు వయస్సులో ఎంత వరకూ సాధ్యమో అన్నది ప్రశ్న. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇంకా ఆరుపదుల లోపే ఉన్నారు.అమెరికా పాలనలో ఈమె పాత్ర కీలకం కానుందని వినపడుతోంది. తన దక్షత చూపించుకుంటే వచ్చే ఎన్నికల్లో  అధ్యక్షురాలుగా ఎంపికైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. జో బైడెన్, కమలా హ్యారిస్ మధ్య బంధాలు మొదటి నుంచీ ఎంతో దృఢంగా ఉన్నాయి. ఈ పాలనాకాలంలో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. బైడెన్ మొదటి నుంచి భారత్ కు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుడు కూడా అయ్యారు. ఆయనకు తోడు కమలా హ్యారిస్ కూడా ఉన్నారు.

కొత్త ప్రభుత్వం పట్ల భారత్ ఆశాభావం

ఈ ద్వయం ఉభయతారక మంత్రంగా ఉపయోగపడతారనే విశ్వాసం భారతీయులలో ఉంది. ఈ స్వప్నం ఏ మేరకు సాకారమవుతుందన్నది  భావికాలంలో బయటపడుతుంది. భారత ప్రధాని నరేంద్రమోదీకి జో బైడెన్ తో  పూర్వ పరిచయం బాగానే ఉంది. ఇవన్నీ కలిసిరావాలి.  భారత్ విషయంలో చైనా చాలా  దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. కరోనా ప్రభావంతో మన దేశం చాలా దెబ్బతింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగాలి. బైడెన్ స్నేహహస్తాన్ని మరింతగా అందిపుచ్చుకుని, చైనాను ఎదుర్కోవాలి. ఈ రెండు దేశాల మధ్య భారత్ అడకత్తెరలో పోక చెక్క కాకూడదు.అమెరికా కొత్త ప్రయాణం కొత్త ప్రగతికి చక్రాలుగా ఊతమిస్తుందని విశ్వసిద్దాం. జో బైడెన్, కమలా హ్యారిస్ కు అభినందనలు అందిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles