Sunday, December 22, 2024

కోవిద్ బలి తీసుకున్న మరో సినీ ప్రముఖుడు

సౌమిత్ర ఛటర్జీ భారతీయ సినిమాలో మరపురాని అద్భుతమైన కళాకారుడు. ఆయన సంప్రదాయ విరోధి. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే అభిమాన నటుడు. సత్యజిత్ రాయ్ తరం దాటిన తరువాత సైతం ప్రాసంగికత కలిగిన సాటిలేని మేటి. ఇటు సినిమా, అటు రంగస్థలం, ఇటు రచన, అటు చిత్రలేఖనం, అది ఇది ఏమని అన్ని రంగాలలో రాణించిన అసమాన ప్రతిభాశాలి.

కోవిద్ మహమ్మారి బలితీసుకున్న సినిమా ప్రముఖులలో సౌమిత్ర ఛటర్జీ అగ్రగణ్యుడు. గానగంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మాదిరి సౌమిత్రి సైతం కోవిద్ బారిన పడి అక్టోబర్ 6 నుంచి కోల్ కతా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారంనాడు శాశ్వతంగా కన్నుమూశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత కరోనా పరీక్షలో వైరస్ లేనట్టు (నెగెటివ్) తేలినప్పటికీ కరోనా సోకినప్పుడు శరీరానికి జరిగిన హాని నాడీకేంద్రాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఇతర అవయవాలను కూడా దెబ్బతీసింది. కోలుకోలేకపోయారు. మృత్యువుతో శక్తివంచన లేకుండా పోరాడి ఓడిపోయారు.

సత్యజిత్ రే దర్శకత్వం వహించిన అపూర్ సంసార్ తో 1959లో తెరంగేట్రం చేసిన సౌమిత్ర మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. ఇటీవల ఆస్పత్రిలో చేరే వరకూ ఆయన నటజీవితం నిర్విరామంగా కొనసాగింది. సత్యజిత్ రే సినిమాలలో నటించడం వల్ల ఆయనకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. రేతో పాటు తపన్ సిన్హా, తరుణ్ మజుందార్, అజయ్ కార్, దినేష్ గుప్తా వంటి ఇతర ప్రసిద్ధ దర్శకులతో కూడా సౌమిత్ర పని చేశారు. పాపులర్ సినిమాలోనూ, ఆర్ట్ సినిమాలోనూ రాణించి భారతీయ సినిమారంగం అభివృద్ధికి విశేషంగా దోహదం చేసిన మహానటుడు. భారత చిత్రసీమలో తొలి సూపర్ స్టార్. మరో బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్ కంటే భిన్నమైన మార్గంలో పయనించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చరిత్రలో సృష్టించుకున్నారు. తన వ్యక్తిగత విశ్వాసాలకూ, భావజాలానికీ విరుద్ధమైన పాత్రలు పోషించారు. దాని గురించి మథనపడేవారు. సత్యజిత్ రే తో పని చేసింది 14 సినిమాలలోనే. కనుక సత్యజిత్ రేకి పరిమితమైన నటుడిగా అభివర్ణించలేము. బాలీవుడ్ లో ఇటీవలి దశాబ్దాలలో ప్రవేశించిన కొత్తతరం నటులు ఇర్ఫాన్ ఖాన్, అయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ వంటి వారంతా కలిసి చేసిన కృషికి శ్రీకారం చుట్టిన నటుడు సౌమిత్ర ఛటర్జీ.

ఉత్తమ కుమార్ కంటే భిన్నమైన నటుడు

ఉత్తమ కుమార్ తో సౌమిత్రని పోల్చడం అనివార్యం. తెలుగు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు వంటి జంట అది. అక్కినేని ముసలి పాత్రలలో నటించడానికి అంగీకరించేవారు కాదు. గురజాడవారి గిరీశం పాత్రలో నటించమని నిర్మాతలు అడిగారు. అక్కినేని నిరాకరించారు. ఎన్ టి ఆర్ ఆ పాత్రలో జీవించి శభాష్ అనిపించుకున్నారు. తన ఇమేజ్ గురించి అక్కినేని ఆలోచించేవారు. నటనకు ఉండే విస్తృతి గురించి ఎన్ టి ఆర్ ఆలోచించేవారు. ఇదే తేడా ఉత్తమ కుమార్ లోనూ సమిత్ర ఛటర్జీలోనూ ఉండేది. ఉత్తమ్ కుమార్ హీరోగానే మిగిలిపోతే సౌమిత్ర ఛటర్జీ సమగ్రమైన సినీనటనతో పాటు రచనలో, పెయింటింగ్ లో, నాటక రచనలో, రంగస్థల నటనలో, సంగీతంలో ఆరితేరారు. అపర్ణఘోష్, గౌతమ్ ఘోష్, రితుపర్ణో ఘోష్ వంటి స్వతంత్రేచ్ఛ కలిగిన దర్శకులతో కూడా కలసి పని చేశారు. సాహిత్యరంగంలో సౌమిత్రని బలరాజ్ సాహ్నీతో పోల్చవచ్చు. రంగస్థలంపట్ల ఎంత అభిమానం అంటే రంగస్థలం లేని జీవితం అనూహ్యం అనేవారు సౌమిత్ర. ఆయనపైన బెంగాలీ రంగస్థల మహాపురుషుడు సిసిర్ కుమార్ భదూరీ ప్రభావం ఎక్కువ.

వెండితెర, రంగస్థలం రెండు కళ్ళు

సాధారణంగా పేరుపొందిన నటులు సినిమాలో ప్రవేశించక మునుపూ, సినిమాలో వేషాలు లేనప్పుడూ రంగస్థలంవైపు చూస్తారు. సౌమిత్ర సినీనటుడుగా నిర్విరామంగా పనిచేస్తున్న రోజులలో సైతం తీరక చేసుకొని రంగస్థలంపై నటించేవారు. అది ఆయన ప్రత్యేకత. వెండితెర, రంగస్థలం ఆయనకు రెండు కళ్ళు. ఈ విషయంలో బెంగాలీ రంగస్థల అనుభవాలకే పరిమితం కాకుండా ఫ్రెంచ్, జర్మన్  ఇంగ్లీష్ రంగస్థల చరిత్రనూ, అక్కడి ధోరణులనూ నిశితంగా అధ్యయనం చేశారు. ఆ విధంగా 1982లో రచించి ప్రదర్శించిన నాటకమే రాజకుమార్. మధ్యతరగతి ఇతివృత్తాలను ఎంచుకునేవారు. గాలిమేడలు కట్టడం, ఊహాలోకంలో విహరించడం ఆయనకు  నచ్చేది కాదు. వాస్తవానికి దగ్గర ఉండాలని తపన పడేవారు. విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శక్తిఛటోపాధ్యాయ ఒత్తిడితో సౌమిత్ర తన తొలి గేయసంకలనం ప్రచురించారు. ఎక్ షాన్ అనే సాంస్కృతిక, సాహిత్య పత్రికను స్థాపించారు. ‘చారులత’ సినిమాలో నటించే సమయంలో పాత్రోచితంగా ఉండేందకు కొత్త విషయాలు అనేకం నేర్చుకున్నారు.

హీరోతో పాటు విలన్ గా నటన

సినిమా స్టార్ అన్న భేషజం లేదు. సామాన్యంగా ఉండేవారు. తన ఫోన్ కాల్స్ తానే తీసుకొని మాట్లాడేవారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించేవారు. తపన్ సిన్హా నిర్మించిన జిండర్ బొండీ (1961)లో విలన్ గా నటించారు. అపూర్ సన్సార్, దేవి, ఖుడితో పశాన్, తీన్ కన్యా వంటి సినిమాలలో లో హీరోగా నటించిన రెండేళ్ళలోగానే విలన్ గా నటించడం విశేషం. 1984లోనే తండ్రి పాత్ర పోషించి అభిమానులకు అలరించారు, కొండకచో దిగ్భ్రాంతి కలిగించారు. తారాశంకర్ బంద్యోపాధ్యాయ రచించిన ‘గణదేవత’ ఆధారంగా నిర్మించిన సినిమాలో పౌరహక్కుల కార్యకర్తగా నటించారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడం, సినిమారంగంతో పాటు రంగస్థలానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం, సత్యజిత్ రేతోనే అంటిపెట్టుకోకుండా ఇతర దర్శకులతో కలసి పని చేయడం సౌమిత్ర ఛటర్జీలో చెప్పుకోదగిన విశేషాలు.

చివరి రోజుల వరకూ విరామం ఎరగని నటుడం

సౌమిత్ర నిర్యాణం 86వ ఏట జరిగింది. ఆ వయస్సులోకూడా నటించడానికి అవకాశాలు ఆయనకు అమితంగా వచ్చేవి. చివరి రోజుల వరకూ ఆయన క్షణం తీరికలేని నటుడిగానే ఉన్నారు. క్లింట్ ఈస్ట్ వుడ్, కిర్క్ డగ్లస్, క్రిస్టోఫర్ ప్లమ్మర్ వంటి కాలంతో పని లేని నటులను మినహాయిస్తే ఎనభయ్యో పడిలో కూడా సౌమిత్ర అంత నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొన్న నటీనటులు లేరు. 2012 నుంచీ సౌమిత్రకు అనేక అవార్డులు లభించాయి. కానీ ఆయన విరామం తీసుకోలేదు. మరిన్ని పాత్రలలో నటించడానికి అంగీకరించి పరుగులు తీసేవారు. 2019లో ఆయన నటించిన 15 సినిమాలు రిలీజ్ అయినాయి. కోవిద్ కాటేసిన రోజుల్లో కూడా డజనుకు పైగా చిత్రాలలో ఆయన నటిస్తున్నారు. ఆయన మృతి భారత సీనీ వినీలాకాశంలో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న ఒకానొక తార నేలరాలినట్టు, శాఖోపశాఖలుగా విస్తరించిన ఒకానొక మహావృక్షం కూలిపోయినట్టు, మధ్యతరగలి ప్రజలు విశేషంగా అభిమానించిన ఒక మహానటుడు అకస్మాత్తుగా అదృశ్యమైనట్టు. ‘అపూ’ అనే అపూర్వపాత్రధారి కనిపించని లోకాలకు తరలిపోయినట్టు. మహాద్భుతాలు సాధించిన మహానటుడికి ఇదే అక్షరాంజలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles