• నేతాజీ జయంతికి విస్తృత ఏర్పాట్లు
• పోటీపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతాజీ జయంతి ఉత్సవాలను జరిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అక్కరకొచ్చే ఏ అంశం దొరికినా వాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలు వెనుకాడటంలేదు. తాజాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను రాజకీయాల్లోకి లాగుతున్నారు. నేతాజీని కీర్తించడంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు మేమంటే మేమని ఎగబడుతున్నారు. నేతాజీ జయంతి అయిన జనవరి 23న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతోంది. ఆయన జయంతిని దేశ్ నాయక్ దివస్ గా జరుపుతామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. నేతాజీ జయంతి రోజు మమతా బెనర్జీ పాదయాత్ర చేపట్టనున్నారు. శ్యామ్ బజార్ నేతాజీ విగ్రహం నుంచి కోల్ కతా వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్దనున్న అన్ని పత్రాలను బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
ఇది చదవండి: నందిగ్రామ్ బరిలో మమతా బెనర్జీ
కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు :
మరోవైపు జనవరి 23న నేతాజీ జయంతి ఉత్సవాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి పరాక్రమ దివస్ గా జరుపుతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బెంగాల్ నేతాజీ మెమోరియల్ లో జరిగే కార్యక్రమాలకు మోదీ హాజరవుతారని పీఎంవో వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గాంధీ, నెహ్రూలకు తప్ప మిగతా స్వాతంత్ర సమరయోధులను పట్టించుకోలేదని వారి పట్ల నిర్లక్ష్యం వహించారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నేతాజీ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలని కేంద్రం నిర్ణయించింది.
ఇది చదవండి: బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ