- తృణమూల్ కు ఎదురుదెబ్బ
- మంత్రిపదవికి రాజీనామా చేసిన లక్ష్మీ రతన్ శుక్లా
- త్వరలో బీజేపీలోకి సువేందు తండ్రి, సోదరుడు?
- ప్రభుత్వ పనితీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేస్తున్న మరో మంత్రి
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఇప్పటి వరకూ అధినేత్రే సర్వస్వం అని నమ్మిన నేతలు ఎన్నికల వేళ ఒక్కక్కరు పార్టీని వీడేందుకు క్యూకడుతున్నారు. దీంతో ఎంతో బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేతల రాజీనామాలతో క్రమంగా బలహీనపడుతోంది. తాజాగా మమత మంత్రివర్గంలో క్రీడల శాఖమంత్రి లక్ష్మీ రతన్ శుక్లా రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మమతా బెనర్జీతోపాటు, గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు పంపారు. గతంలో బెంగాల్ రంజీ క్రికెట్ జట్టు సారథిగా బాధ్యతలు నిర్వహించిన శుక్లా ఉత్తర హవ్ డా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజీకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నందున మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తన రాజీనామా లేఖలో తెలిపారు.
ఇది చదవండి: తృణమూల్ కాంగ్రెస్ లో భారీ కుదుపు
అమిత్ షా వ్యాఖ్యలకు బలం
అయితే బీజేపీలోకి చేరేందుకే శుక్లా రాజీనామా చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పేరున్న బలమైన నేతలు తృణమూల్ కాంగ్రెస్ ను వీడుతుండటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడం అంత తేలికకాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెంగాల్లో అధికారం దక్కించుకునేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్న బీజేపీకి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి దీదీ ఒక్కరే పార్టీలో మిగులుతారని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మరోవైపు సువేందు అధికారి తమ్ముడు సౌమేందు అధికారి కూడా బీజేపీలో చేరారు. అంతేకాకుండా సువేందు అధికారి తండ్రి శిశిర్, మరో సోదరుడు దివ్యేందు అధికారి ప్రస్తుతం తృణమూల్ ఎంపీలుగా కొనసాగుతున్నారు. పరిస్థితులను బట్టి వీరు కూడా బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది చదవండి: మమత సర్కార్ బలనిరూపణకు కాంగ్రెస్ డిమాండ్
తొలిసారి గడ్డు పరిస్థితులు
తృణమూల్ కాంగ్రెస్ స్థాపించిన 23 ఏళ్ల తరువాత మమతా బెనర్జీ తొలిసారి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. రెండు దఫాలుగా అధికారంలో ఉండటంతో స్వతహాగా పార్టీ వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు బీజేపీ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రం ఉండటంతో పోలింగ్ నాటికి ఓటరు నాడి ఎటువైపు మళ్లుతుందో ఇపుడే చెప్పడం కష్టం.
పార్టీని వీడనున్న మరికొంత మంది నేతలు
మమత కేబినెట్ లోని మరో ప్రముఖ మంత్రి రజీబ్ బెనర్జీ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం జరిగిన కేబినెట్ భేటీకి గైర్హాజరు కావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందు ముందు మరి కొంతమంది ప్రముఖులు కూడా పార్టీని వీడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది చదవండి: దీదీకి, శరద్ పవార్ రాజకీయ పాఠాలు