- నేతాజీ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, మమతా బెనర్జీ
- పోటా పోటీగా జయంతి కార్యక్రమాలు
- మోదీ సర్కార్ పై మమత తీవ్ర స్థాయిలో విమర్శలు
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రాజకీయ రంగు పులుముకుంది. బెంగాల్ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ వారసత్వం ద్వారా లబ్ధి పొందేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార దాహంతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతాజీ జయంతిని పరాక్రమదివస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నారు. నేతాజీ జయంతి పేరుతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు బల ప్రదర్శన చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు.
దేశ్ నాయక్ దివస్ వేడుకల్లో మమతా బెనర్జీ:
మరోవైపు నేతాజీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళులర్పించారు. ఇందులో భాగంగా 6 కిలో మీటర్ల భారీ పాదయాత్ర చేపట్టారు. శ్యామ్ బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో వందలాది తృణమూల్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిపై కేంద్ర ప్రభుత్వం పరాక్రమదివస్ గా ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తీవ్ర స్తాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని ఎన్నికలు ఉన్న సంవత్సరంలో మాత్రమే తాము జరుపుకోమంటూ బీజేపీని ఎద్దేవా చేశారు. పరాక్రమ్ అంటే ఏంటో తనకు తెలియదని దేశాన్ని ప్రేమించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోథుడిగా మాత్రమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలుసని అన్నారు. బెంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతాజీ కుటుంబసభ్యులతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మమత విమర్శించారు. నేతాజి జయంతిని దేశ్ నాయక్ దివస్ గా ప్రకటించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నేతాజీకి దేశ్ నాయక్ అనే బిరుదునిచ్చారనీ… అందువల్ల నేతాజీ జయంతిని దేశ్ నాయక్ దివస్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఈ రోజు కోల్ కతాలో జరిగే పరాక్రమ్ దివస్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కోల్ కతాలోని నేతాజీ భవన్ ను సందర్శించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ ధనకర్ లు ప్రధాని వెంట ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కోల్ కతాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేతాజీ పుట్టిన రోజైన జనవరి 23 ని ప్రతి ఏటా పరాక్రమ్ దివస్ గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాని మోదీ విక్టోరియా మెమోరియల్ ను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పరాక్రమ్ దివస్ ప్రారంభ వేడుకలకు మోదీ అధ్యక్షతన వహించారు. సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రపై ప్రదర్శన, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ఆయన ప్రారంభించారు. నేతాజీ పేరిట స్మారక నాణాన్ని, పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు.
వేడులకు ముందు నేషనల్ లైబ్రరీని సందర్శించారు. నిర్వాహకులు లైబ్రరీ విశేషాలను ప్రధానికి వివరించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై వెలువడిన 21 వ శతాబ్దపు వారసత్వ పత్రాలను పరిశీంచారు.
ఇదీ చదవండి:నేతాజీ చుట్టూ బెంగాల్ రాజకీయాలు…ఎందుకంటే ?