- ఆకలిరాజ్యం ప్రతినిధికి అఖండ సానుభూతి
- యాచకుడికి బ్రహ్మాండంగా అంత్యక్రియలు
- పట్టణ ప్రజలందరూ అంతిమయాత్రలో పాల్గొన్న వైనం
- ఒక్క రూపాయ కంటే ఎక్కువ స్వీకరించని థర్మాత్ముడు
- ప్రపచంలో కనీవినీ ఎరుగని యథార్థ ఘటన
ఒక యాచకుడు మరణిస్తే కొన్ని వేలమంది అంతిమ యాత్రలో పాల్గొని అఖండ నీరాజనం పలికిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటువంటి సంఘటన ఇదివరకు ఎన్నడూ జరిగినట్లు కూడా దాఖలాలు లేవు. ధర్మమార్గంలో నడిస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని ఈ తాజా సంఘటన రుజువు చేస్తోంది.’స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్’… అంటూ ఆ మధ్య ‘ఆకలిరాజ్యం’ సినిమా కోసం ఆత్రేయ రాశాడు. ఈ పాట రాసి నలభై ఏళ్ళయ్యింది. డబ్బున్నవాళ్లు, ప్రముఖులు వెళ్లిపోతే భాజా భజంత్రీల బ్యాండ్ మేళాలతో అంతిమయాత్రను అట్టహాసంగా జరుపుతారు. అది చూసే ఆత్రేయ అలా రాశాడు.
Also read: సంపాదక శిరోమణి ముట్నూరి కృష్ణారావు
లోకం విడిచి పోయినా ప్రజల హృదయాలలో చిరంజీవి
గుండెనిండా ప్రేమించే నాయకులు, నటులు, కళాకారులు లోకాన్ని వీడినప్పుడు లోకమంతా ఏకమై శోకసంద్రంలో మునుగుతారు (ఇటీవల కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి ఇందుకు తాజా ఉదాహరణ). మహాత్మాగాంధీ, ఘంటసాల,ఎన్టీఆర్ వంటి వారు తనువు చాలించిన సందర్భంలో లక్షలాదిమంది బారులు తీరారు. ఉన్నప్పుడే కాదు, వెళ్లిపోయిన తర్వాత కూడా మనుషుల హృదయాలలో చిరంజీవిగా నిలిచేవారు చాలా అరుదుగా ఉంటారు. పాడె మొయ్యడానికైనా నలుగురు దొరికితే చాలు అంటుంటారు. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము..’ అన్నాడు శ్రీశ్రీ. ఇట్లా ఎన్నో వాక్యాలు రాయవచ్చు. ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. వీటన్నిటినీ తలపుల్లోకి తెస్తున్న బిచ్చగాడి అంతిమయాత్రకు సంబంధించిన పూర్వాపరాల్లోకి ఒకసారి వెళ్దాం. అతని పేరు హుచ్చబస్య. బసవ అని కూడా అంటారు. నలభైఐదేళ్లు ఉంటాయి. కర్ణాటకలోని విజయనగర జిల్లా బళ్లారి ప్రాంతమైన హూవినహడగలిలో బిచ్చమెత్తుకొని జీవించేవాడు. మానసిక వైకల్యం కూడా ఉంది (మానసిక దివ్యాంగుడు). మొన్న శనివారం నాడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వదిలాడు. ఈ వార్త తెలియగానే హూవినహడగలి పట్టణం మొత్తం కదిలిపోయింది. శోకసంద్రమై విలపించింది. ఆ పట్టణంలో అతని గురించి తెలియనివాళ్లంటూ లేరు. అందరికీ తలలో నాల్కలా ఉంటాడు. అందరూ తలా కాస్త డబ్బులు వేసుకొని అంతిమ సంస్కారాన్ని అద్భుతంగా నిర్వహించారు. వేలమంది ఆ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా అతనికి నీరాజనాలు పలుకుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమైన కూడళ్ళలో పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి తమ ప్రేమనూ, అభిమానాన్నీ చాటుకున్నారు. అతనేమీ రాజకీయ నాయకుడు కాడు. సెలబ్రిటీ కాదు. సంపన్నుడు కాదు. స్వామీజీ కాడు. బిచ్చమెత్తుకొని పొట్టపోసుకొనే ఆకలిరాజ్యం ప్రతినిధి. అతని తల్లి కూడా ఇటీవలే వెళ్లిపోయింది. పెళ్ళి కాలేదు. తల్లి మరణంతో పూర్తిగా ఒంటివాడై పోయాడు. దానితో అందరికీ అతనిపై మరింత జాలి పెరిగింది. ప్రతిఒక్కరినీ అప్పాజీ.. అంటూ ప్రేమగా పిలుస్తాడు. వీధుల్లో తనకు ఎదురైనవారిని ఒక్క రూపాయి మాత్రమే అడుగుతాడు. అంతకంటే ఎంత ఎక్కువ ఇచ్చినా తీసుకోడు. వెంటనే వెనక్కు ఇచ్చేస్తాడు. అతనికి బిక్షం పెడితే మంచి జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలంతా నమ్మేవారు. పిలిచి మరీ అన్నంపెట్టేవారు. అదృష్టబస్య.. అంటూ ప్రేమగా పిలుచుకొనేవారు. మానసిక దివ్యాంగుడైనప్పటికీ ఎవ్వరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఆ ప్రాంత ప్రజలందరికీ ప్రేమపాత్రుడు, దైవస్వరూపుడు. ఎమ్మెల్యేలు వంటి ప్రజా నాయకులను సైతం పేరు పెట్టి పిలిచేవాడు. వారిని కూడా ఒక్కరూపాయే అడిగేవాడు. ఇల్లు కట్టిస్తామని వచ్చినా నవ్వుతూ తిరస్కరించే వాడు. దేవాలయాలు, విద్యాలయాలలోనే తలదాచుకొనేవాడు.
Also read: అఫ్ఘాన్ లో భారత్ చొరవ
మానవీయ లక్షణాలు
తల్లి బతికి ఉన్నంత కాలం కంటికి రెప్పలా చూచుకున్నాడు. మనుషులను ప్రేమించడం, ప్రేమించబడడం.. అతనికి ఆ రెండే తెలుసు. కడుపునింపుకోడానికి, అవసరానికి ఎంతకావాలో అంత వరకే ఆలోచించేవాడు. పైకి బికారిలా కనిపించినా లోపల ఏదో దివ్యత్వం ఉందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అతని మంచితనానికి, చల్లని చూపుకు, ధర్మనిరతికి వాళ్ళందరూ ఫిదా అయ్యారు. ‘బసవ భౌతికంగా వెళ్లిపోయినా మా గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు’ అని అక్కడి ప్రజలు అతని తలపుల్లో జీవిస్తున్నారు. బసవ అంతిమ యాత్ర కర్ణాటక మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తి పోతోంది. ఈ సంఘటన తాజాగా జరిగింది. కథ కాదు. కల్పితం కాదు. వాస్తవ ఘటన. హుచ్చబస్యకు సాయం చేస్తే మేలు జరుగుతుందనే స్వార్ధం ఆ ప్రజల్లో ఉన్నా అతను వెళ్లిపోయిన తర్వాత కూడా అదే ప్రేమను చూపించడం కదిలించే అంశం. డబ్బు మీద యావ లేకపోవడం, తల్లితండ్రులను సేవించడం, తోటి వారిని ప్రేమించడం, సాటి మనుషులకు మంచి జరగాలని కోరుకోవడం, ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా ఉండడం, ధర్మమెత్తుకొని జీవించడం, ప్రజల గుండెల్లో పీఠం వేసుకోవడం… ఇదే ఈ బసవ జీవిత సర్వసం, సారాంశం. అతను మానసిక వికలాంగుడు కాదు, నిజమైన దివ్యాంగుడు. మంచితనానికి, ధర్మవర్తనకు జేజేలు పలికిన హూవినహడగలి పట్టణవాసులకు జేజేలు పలుకుదాం.
Also read: మితిమీరుతున్న మధుమేహం
నిజంగా గొప్ప విషయమే!