సంపద సృష్టిద్దాం -14
ఆర్థిక స్వేచ్ఛ పొందాలనుకుంటున్న వారంతా అన్నిటికంటే ముందర ఈ క్యాష్‌ఫ్లో క్వాడ్రెంట్ గురించి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. గత వారం ఇందులో ఉన్న ఇ, ఎస్, బి మరియు ఐ అనే నాలుగు భాగాల గురించీ తెలుసుకున్నాం. మనమందరమూ ఈ నాలిగింటిలో ఏదో ఒక విభాగానికి చెందుతాం. ఇ అంటే ఎంప్లాయీ (ఉద్యోగి), ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ (స్వయం ఉపాధిపై ఆధారపడిన చిన్న వ్యాపారి), బి అంటే బిజినెస్ ఓనర్ (వ్యాపారవేత్త), ఐ అంటే ఇన్వెస్టర్ (పెట్టుబడిదారుడు) అని అర్థం చేసుకున్నాం. తమ సమయాన్ని అమ్ముకుని తమకు స్థిరంగా ఆదాయాన్ని అందించే ఉద్యోగం చేసుకునేవారంతా ఇ విభాగానికి చెందుతారు.
Also read: మనం మారితేనే మన ఆర్థిక పరిస్థితి మారేది
అన్ని విభాగాలలో ఆదాయం
సామాన్య ప్రజలలో 85 శాతం ఇ విభాగంలోనే ఉండడానికి ఇష్టపడతారు. వీరి మనస్తత్వం ప్రకారం వీరికి ఆర్థిక భద్రత కావాలి. నిలకడ కలిగిన స్థిరమైన ఆదాయం కావాలి. మన సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మన పాఠశాలలు, మన పాఠ్యప్రణాళికలు కేవలం ఇ విభాగంలోని ప్రజలను తయారు చేయడానికి ఉద్దేశించినవి అని మనం గుర్తుంచుకోవాలి. ఈ విభాగంలో ఉన్నవారి మాట తీరుకూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ‘‘నాకు సురక్షితమైన, భద్రతనిచ్చే ఉద్యోగం కావాలి. మంచి వేతనం, ఇతరత్రా ప్రయోజనాలుండాలి’’ అని వీరు అంటుంటారు. ఎవరైనా వ్యాపారం చేయదలచుకున్నామని వీరికి చెప్తే, ‘‘జాగ్రత్తగా ఆలోచించావా, హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు రిస్కు తీసుకుంటున్నావు!’’ అని సలహాలిస్తారు. ఉద్యోగులకు వారి వేతనం మాత్రమే లభిస్తుంది. తమ యజమాని లాభనష్టాలతో తమకు సంబంధం ఉండదు. దీనికి ఒక తాజా ఉదాహరణగా ఎలన్ మస్క్ టేకోవర్ చేసిన ట్విటర్ కంపెనీ గురించి చెప్పుకోవచ్చు. ట్విటర్ కంపెనీని 44 అమెరికన్ బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ వెంటనే వందలాదిగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాడు. కనీసం నెల రోజుల నోటీసులు కూడా కొందరికి అందలేదు. మరి అన్ని బిలియన్ డాలర్ల లాభం సంపాదించిన మునుపటి యజమానులు వారిని ఆదుకున్నారనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. యజమాని లాభాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు చేరవు. ఉద్యోగం చేసినంత కాలమూ వేతనం అందుకోవడమే ఉద్యోగ జీవితంలో ఆర్థిక భద్రత.
Also read: సమయానికి వేద్దాం కళ్లెం
నైన్ టూ ఫైవ్ ఉద్యోగ జీవితంతో విసిగి వేసారిన కొందరు దానికి చరమగీతం పాడుదామనుకుంటారు. తమ వ్యక్తిగత నైపుణ్యంపై ఆధారపడి సొంతంగా ఏదైనా పని చేసుకోవాలనుకుంటారు. తమ యజమాని తీరు నచ్చక, లేదా మరో కారణంతో సొంత దుకాణం పెట్టుకుందామనుకునే వారు మరికొందరు. వీరంతా తమకు తెలిసో తెలియకో ఇ విభాగం నుంచి ఎస్ (స్వయం ఉపాధి) విభాగంలోకి అడుగు పెడుతున్నారన్న మాట. దానికదే ఇదొక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. మనం ఒక విభాగంనుంచి మరొక విభాగంలోకి మారుతున్నామంటే మన స్వభావాన్ని ఆసాంతం మార్చుకుంటున్నట్లే. ఎస్ విభాగంలో ప్రజలు తమను తాము యజమానులుగా ఉండాలని కోరుకుంటారు. డబ్బు విషయంలో వీరి వ్యవహారం చాలా నిర్దిష్టంగా ఉంటుంది. కష్టపడి పనిచేయటం, శ్రమకు తగ్గ విలువను రాబట్టుకోవడం వీరి నైజం. ఇతరులు చెప్పినట్టు నడుచుకోవడానికి అంతగా సుముఖత చూపరు. భయం, ఆర్థిక ఇబ్బందులను దీటుగా ఎదుర్కోవటానికి ధైర్యంగా నిలబడతారు. ఈ విభాగంలో వృత్తి నిపుణులు, డాక్టర్లు, లాయర్లు, డెంటిస్టులు, రిటైల్ షాపు ఓనర్లు, రెస్టారెంట్ ఓనర్లు, కన్సల్టెంట్లు, థెరపిస్టులు, చిన్న పత్రికల యజమానులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెంట్లు, హెయిర్ స్టైలిస్టులు, ఆర్టిస్టులు.. ఈ కోవలోకి వస్తారు. ‘‘ఈ సిటీలో నాకంటే భిన్నంగా ఎవరూ ఈ పని చేయలేరు. నా అంత బెస్ట్ సౌకర్యాలు ఇంకెక్కడా దొరకవు..’’ ఇలా ఆత్మస్థైర్యంతో మాట్లాడుతుంటారు.
Also read: బకెట్లు మోసే ప్రపంచం
అడుగు – నమ్ము – పొందు
కోటీశ్వరులు కావాలనుకుంటున్న సాహసవీరులంతా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇ విభాగం నుంచి ఎస్ విభాగానికి రావడం ఒక మెట్టు ఎక్కినట్టు కాదు. డబ్బు మనకు ఏ విభాగం నుంచి వస్తుందన్నదే ప్రధానం కాని, ఏ విభాగమూ దానికదిగా గొప్పదీ కాదు. ఏ విభాగమూ తక్కువదీ కాదు. కేవలం మన మనస్తత్వాలకు అనుగుణంగా ఏదో ఒక విభాగంలో మనం అంతులేని సంతృప్తి చెందుతాం. అంతేతప్ప విభాగం మారితే మన మనస్తత్వం మారిపోతుందని అపోహ పడకూడదు. అన్ని విభాగాలూ ఆదాయం పొందగలిగేవే. మనలో చాలామందికి అన్ని విభాగాల నుంచి డబ్బు సంపాదించే సామర్ధ్యం ఉంటుంది. దానికి ఒక ఉదాహరణగా వైద్య వృత్తిని చూపించవచ్చు. కాని, అందరు వైద్యులు ఇలా చేస్తారని కాదు. అది కేవలం వారి మనస్తత్వాన్ని బట్టి, ఆర్థిక విషయాల పట్ల అవగాహనను బట్టి మారుతుంది. మన ఆసక్తులు, బలాబలాలు, సామర్ధ్యాలు కలిసి దీనిపై ప్రభావం చూపుతాయి. ఒక డాక్టర్ ప్రభుత్వ ఉద్యోగమో, కార్పొరేట్ ఆసుపత్రిలోనో ఉద్యోగం చేస్తూ ఇ విభాగంలో ఆదాయం సంపాదిస్తుంటాడు. అదే సమయంలో తన ఇంటివద్దనో, మరో చోటనో రోజులో కొద్ది గంటలు ప్రైవేటు ప్రాక్టీసు పెట్టి ఎస్ విభాగంలో చేరి అదనపు ఆదాయం సంపాదిస్తాడు. నెమ్మదిగా వచ్చిన ఆదాయంలో పొదుపు చేస్తూ సొంతంగా క్లినిక్, లేబరేటరీ పెట్టి ఇతర వైద్యులకు, టెక్నీషియన్లకు ఉపాధి కల్పించడం ద్వారా బి విభాగంలోకి చేరి వ్యాపారవేత్త అవతారం ఎత్తుతాడు. తన సామర్ధ్యాన్ని బట్టి మరిన్ని శాఖలు అదే సిటీలో ఏర్పాటుచేయవచ్చు. ఇలా వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని ఇతరుల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం పొందవచ్చు. అంటే ఐ విభాగంలోకి చేరి పెట్టుబడిదారుడిగా అవతరించాడన్న మాట. మనమేం చేస్తున్నామనేది కాదు, సంపద ఎలా సృష్టిస్తున్నాం అనేది పరిగణనలోకి తీసుకోవాలి.
Also read: పైప్ లైన్ నిర్మిద్దాం!
తప్పక చేయండి: శమీరు నివసిస్తున్న పట్టణంలో ఏదన్నా జంక్షన్ మొదలు నుంచి చివరి వరకు కుడి ఎడమలలో ఎన్ని వ్యాపార సంస్థలున్నాయో గమనించారా? వీటిలో ఎన్ని సంస్థలు ఐదేళ్లలోపు ఏర్పాటయ్యాయో పరిశీలించండి. పదేళ్లకు మించి, పాతికేళ్లకు మించి నడుస్తున్న వ్యాపార సంస్థల గురించి వివరాలు సేకరించండి. వ్యాపార దక్షత, నిర్వహణల గురించి లోతైన విషయాలు అవగాహనకు రాగలవు.
Also read: తలపోతల వలబోతలు
– దుప్పల రవికుమార్