————–
( ‘BEAUTY’ FROM ‘THE PROPHET’ BY KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
—————–
సౌందర్యం –
నీ మార్గం, మార్గ దర్శకం
అయితే తప్ప
ఎక్కడని అన్వేషిస్తావు ?
ఎలా కనుగొంటావు ?
‘అందమే‘ –
నీ వాక్కులను నేస్తే తప్ప
‘ఆమె‘ గురించి ఎలా చెప్పగలవు?
బాధితులు, క్షతగాత్రులు –
” అందం –
దయామయి, సౌమ్యురాలు “
అంటారు.
తన ముగ్ధత్వానికి
నును సిగ్గు పడే లేత బాలింతలా
‘ఆమె‘ మన మధ్య మసలుతుంది.
సౌందర్యం —
” భూమ్యాకాశాలను
వణికించే పెను తుఫాను” లా
” ఒక భయానక శక్తి ” అంటారు
సౌందర్యారాధకులు
అలసి సొలసిన వారు
‘సౌందర్యం‘ —
” సున్నితమైన గుసగుసలతో
అంతరాత్మలో సంభాషిస్తుంది. ” –
అంటారు !
” నీడను చూసి భయంతో వణికే
మసక వెలుతురులా
మన నిశ్శబ్దానికి
‘సౌందర్యం ‘
గొంతు విచ్చుకుంటుంది.”
అవిశ్రాoతులు –
” పర్వత శ్రేణి ప్రతిధ్వనులే సౌందర్యం “
” డెక్కల ధ్వని, రెక్కల చప్పుడు,
సింహ గర్జనలు –
ప్రతిధ్వనులకు తోడవుతాయి.”
అంటారు.
” తూర్పున ఉషోదయమే అందం !” –
రాత్రి నగర కావలిదారుల మాట.
” సూర్యాస్తమయ గవాక్షాల నుండి
అవనిపై వాలేదే సౌందర్యం.”
అని అపర్ణాహంలో
శ్రామికులు, బాటసారులు అంటారు.
” వసంతోదయంతో
కొండలపై పరుచుకునేదే సౌందర్యం ! ”
అని మంచు ముసుగుల
హేమంతం అంటుంది.
” శరదృతువులో నాట్యమాడే
ఆకులదే సౌందర్యం !
ఆమె సిగలో మంచు కప్పు చూస్తాము !”
అని గ్రీష్మంలో కోత కార్మికులు అంటారు.
పైవన్నీ కవి భావనలే !
అవి తీరని కాంక్షలు మాత్రమే
‘ సౌందర్యం ‘ నిర్వచనాలు కావు !
‘అందం‘ —
ఆవశ్యకం కాదు.
అది ఒక పారవశ్యం !
సౌందర్యం —
దాహార్తి కాదు,
సాచిన రిక్త హస్తమూ కాదు!
అది ఒక జ్వలిత హృదయం,
మంత్ర ముగ్ధ ఆత్మ !
అది వీక్షించే దృశ్యం కాదు,
ఆలకించే గానమూ కాదు !
సౌందర్యం —
అంతః చక్షువులు కనే చిత్రం!
అంతః కర్ణాలు వినే గీతం !
అది ముడుచుకున్న
బెరడు స్రవించే రసం కాదు,
పక్షి గోళ్ళ కున్న రెక్క కాదు !
సౌందర్యం —
నిత్య వికసిత నందనవనం
ఎగిరే దేవ కన్యల అనంత విహారం !
” అందం “–
పరదా తొలగిన
పావన జీవన ముఖారవిందం !
నీవే జీవితం —
నీవే పరదా!
“సౌందర్యం” —
దర్పణంలో స్వీయ వీక్షణ చేసే
శాశ్వతత్త్వం !
శాశ్వతత్వమూ నీవే,
దర్పణమూ నీవే !
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: హేతువు– తృష్ణ