ఎనుముల మంద లేటి కెదురీదెను; నీటను జొచ్చి పట్టు త
ప్పినదొక ఎడ్లబండి శరవేగముతో కెరటాలు పొంగినన్;
కనవలె పిట్టలన్ పొదల కమ్మగ పాడుచు గాలి కూగుచున్;
క్షణమున వాగు దాటి జతగా దవులేగుచు రివ్వురివ్వునన్!
ఏమీ దీనధరిత్రిపై కరుణ పెన్నేటిన్ కటాక్షించెనే!
ద్యోమార్గాల తమో విభావరుల విద్యున్మేఘ సంఘాతముల్;
ప్రేమాధీశు ప్రచండమేఘ పతనోద్వేగంబు శాంతించి వి
శ్రామంబొందు మహీధరాన జలధారాపాత సంగీతముల్!
మౌనముగా దిగంతముల మబ్బులు మూగి, దివాకరుండు ని
ర్వాణము నొందు పర్వత కవాటముపై పరదాలు వైచె; ఝం
ఝానిల మొండు తాకి, తెర సందులలో చిరురేక ప్రాకి, ని
ద్రాణ తృణాళి సోకి, అపరంజి వెలుంగుల సాంధ్యశోభలన్!
అపుడు పెళా పెళా రవము లంబరవీధి శతఘ్ని మ్రోతలై;
అపుడు పొలాలు వీడి విపినాంతము వైపు బకాళి భీతితోన్;
అపుడు ప్రదోష దీప వరదాభయ కాంతులు వాడవాడలం;
దపుడు దివావిషాద చరమాంక తమోహత శక్రచాపమున్!
చెదిరి, మహాప్రవాహ ఘటశేషము వోలె, దినాస్త రాగ మ
య్యది పెనుశూన్యమై పొడమి, ఆంధ్య విభీషణ వార్షుకాభ్రముల్
పదము, పదమ్మునందుఱిమి, పన్నగ దంష్ట్రల భేకగాత్రముల్
చిదిమి, పదేపదే మిసిమి, చిక్కని నీలి మొగిళ్ళలో సుమీ!
నివర్తి మోహన్ కుమార్
Also read: లోక బాంధవా!
Also read: ఎవరు?
Also read: చెఱువు