- ముందు జాగ్రత్త చర్యలు ప్రజల బాధ్యత
- వ్యాక్సీన్లు సిద్ధంగా చేసుకోవడం ప్రభుత్వ కర్తవ్యం
కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయనే వార్తలు మళ్ళీ భయాన్ని కలిగిస్తున్నాయి. జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాల్లో వ్యాప్తిలో వుంది. కేరళలో 300 కేసులు, తెలంగాణలో 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేరళలో మూడు మరణాలు సంభవించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే. కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం. చలికాలం, పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఇది మంచి పనే. ఇది ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే తప్ప, వేరు కాదు. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్న మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది.కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది. ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Also read: ఉత్సాహం కలిగించని ఉద్యోగపర్వం
కరోనా మనలను వీడి వెళ్ళలేదు
ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం! కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే, ప్రభుత్వం,నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి.
Also read: వైభవంగా సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి జయంతి
యాంటీబయోటిక్స్ వాడకం తగ్గించాలి
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలి. యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది. అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికిమాటికీ యాంటీబయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం, శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం, నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం.
Also read: ప్రపంచాన్ని వణికిస్తున్న సవాళ్లు!