- 23 నుంచి ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్
- ప్రథ్వీని పట్టించుకోని ఎంపిక సంఘం
ఇంగ్లండ్ తో మార్చి 23 నుంచి పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే 18 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది.విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, బరోడా ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా, తమిళనాడు యార్కర్ల కింగ్ నటరాజన్, ముంబై సూపర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ లకు చోటు దక్కింది.
విజయ్ హజారే టోర్నీ ప్రాతిపదికనే..
న్యూఢిల్లీ వేదికగా ఇటీవలే ముగిసిన విజయ్ హజారే జాతీయ వన్డే క్రికెట్ టోర్నీలో కనబరచిన ప్రతిభప్రాతిపదికనే వన్డే జట్టును ఎంపిక సంఘం ఖరారు చేసింది.బరోడా కెప్టెన్ గా విజయ్ హజారే ట్రోఫీలో నిలకడగా రాణించిన లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యాకు తిరిగి జాతీయజట్టులో చోటు కల్పించారు. కృణాల్ భారత్ తరపున 18 టీ-20 మ్యాచ్ ల్లో పాల్గొన్న తరువాత వన్డేజట్టులో చోటు దక్కడం విశేషం.విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడి 14 వికెట్లు పడగొట్టిన కర్ణాటక మెరుపు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కు తొలిసారిగా భారతజట్టులో చోటు దక్కింది.
Also Read: నాలుగో టీ-20లో సూర్యప్రతాపం
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగో టీ-20లో కేవలం 31 బాల్స్ లోనే 57 పరుగుల స్కోరుతో ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కు సైతం వన్డేజట్టులోనూ చోటు కల్పించారు.భుజం గాయంతో టీ-20 సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయిన నటరాజన్ ఫిట్ నిస్ నిరూపించుకోడంతో తిరిగి వన్డేజట్టులో చోటు కల్పించారు.
Also Read: లెజెండ్స్ సిరీస్ ఫైనల్లో భారత్
పాపం! పృథ్వీ షా..
విజయ్ హజారే టోర్నీలో నాలుగు సెంచరీలతో రికార్డుల మోత మోగించిన ముంబై యువఓపెనర్ పృథ్వీ షాను ఎంపిక సంఘం పక్కన పెట్టింది. 800 కు పైగా పరుగులు సాధించడంతో పాటు ముంబైని నాలుగోసారి చాంపియన్ గా నిలిచిన పృథ్వీని సెలెక్టర్లు ఏమాత్రం ఖాతరు చేయకుండా కృణాల్, ప్రసిద్ధ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కొద్దిరోజుల క్రితమే ఓ ఇంటివాడైన జస్ ప్రీత్ బుమ్రా వన్డే సిరీస్ కు సైతం దూరమయ్యాడు. క్రికెట్ యాంకర్ సంజనను జీవితభాగస్వామిగా చేసుకొన్న బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ అనుమతితో పెళ్లి సెలవులో ఉన్నాడు.
ఇదీ భారతజట్టు…
విరాట్ కొహ్లీ ( కెప్టెన్ ), రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్ ), శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, రిషభ్ పంత్, కెఎల్. రాహుల్, యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్, కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టీ. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్,ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్.
సిరీస్ లోని తొలివన్డే మార్చి 23న, రెండో వన్డే మార్చి 26న, మూడో వన్డే మార్చి 28 న డే-నైట్ గా జరుగుతాయి. మహారాష్ట్ర్రలో కరోనా వైరస్ తీవ్రంగా ఉండడంతో అభిమానులను అనుమతించకుండానే ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
Also Read: ప్రో-బాక్సింగ్ లో సింగ్ ఈజ్ కింగ్