Friday, November 8, 2024

బీహార్ బాహాబాహీ: జేడీయూ, జీజేపీ సీట్ల సర్దుబాట్లు

  • అందరికీ ఇవి ప్రతిష్ఠాత్మకం
  • నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర?
  • ఎల్ జేపీ వ్యూహం ఫలిస్తుందా?
  • ఉపేంద్ర కుష్వాహా ప్రతిపక్షం ఓట్లు చీల్చుతాడా?
  • కోవిద్ చర్యలూ, వలస కార్మికలు వెతలూ, ఆర్థిక సంక్షోభం చర్చనీయాంశాలు

కె. రామచంద్రమూర్తి

బీహార్ లో శాసనసభ ఎన్నికలలో దాదాపు చెరి సగం స్థానాలకు పోటీ చేయాలని అధికార కూటమిలోని జేడీయూ, బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సోమవారంనాడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య అంగీకారం కుదిరింది. జేడీయూ 122 స్థానాలకూ, బీజేపీ 121 స్థానాలకూ పోటీ చేస్తాయి. జేడీయూ తన వాటా నుంచి అయిదు స్థానాలను మాజీ ముఖ్యమంత్రి, జతిన్ రాం మాంఝీ నాయకత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చాకు కేటాయిస్తుంది. అదే విధంగా జీజేపీ మరో మిత్రపక్షమైన వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కొన్ని స్థానాలు ఇస్తుంది.  ఈ పార్టీ అధినేత ముఖేశ్ నిషాద్.

ఎల్ జేపీ ఒంటరి పోరాటం

ఇంతవరకూ ఎన్ డీ ఏ లో భాగస్వామిగా ఉండిన లోక్ జనశక్తి పార్టీ (ఎస్ జేపీ) ఒంటరి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నది. రాం విలాస్ పాశ్వాన్ స్థాపించిన ఈ పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షుడు. రాంవిలాస్ కేంద్రమంత్రిమండలిలో సభ్యుడు. నెల రోజులుగా ఆయన ఆస్పత్రిలోనే ఉంటున్నారు. శనివారంనాడు గుండెకు శస్త్రచికిత్స జరిగింది. కోలుకుంటున్నారు. దాదాపు సంవత్సర కాలంగా పార్టీకి దిశానిర్దేశం చిరాగ్ చేస్తున్నారు. అప్పటి నుంచే ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పైన వ్యతిరేక ప్రచారం అదేపనిగా సాగిస్తున్నారు.

మాంఝీ తెచ్చిన తంటా

పశ్వాన్ లకూ, నితీశ్ కూ మధ్య విభేదాలు పొక్కడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితిన్ రాం మాంఝీని నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ)లోకి ఆహ్వానించడంలో బీహార్ ముఖ్యమంత్రి విశేషమైన చొరవ చూపించడం. మాంఝీ మహాదళిత సామాజికవర్గానికి చెందిన నేత. రాంవిలాస్ పశ్వాన్ సైతం దళిత నాయకుడే. తన ప్రమేయం లేకుండా మాంఝీకి ఎన్ డీ ఏ తీర్థం ఇవ్వడం రాంవిలాస్ కి సహజంగానే నచ్చలేదు. అప్పటి నుంచి జూనియర్ పాశ్వాన్ నితీశ్ పైన తిరగబడి, నిశితమైన దాడి చేస్తూ వచ్చాడు. నితీశ్ ఇప్పటికీ ‘సాథ్ నిశ్చయ్’ – ఏడు వాగ్దానాలు- ఎజెండా అమలు చేయడానికే ప్రయత్నిస్తున్నారనీ,  ఆ ఎజెండాపైన 2015లో ఆర్ జేడీ, కాంగ్రెస్ కూటమిలో ఉంటూ జేడీయూ ఎన్నికల ప్రచారం చేసిందనీ చిరాగ్ గుర్తు చేస్తున్నారు. బీజేపీతో నితీశ్ కు ఆత్మీయబంధం లేదని నిరూపించడానికి చిరాగ్ ప్రయత్నిస్తున్నారు.

నితీశ్ అంటే మొహం మొత్తిందా?

మూడు టరమ్ లు, అంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ పట్ల ప్రజలకు మొహం మొత్తిందనీ, ఆయన పట్ల ప్రజలలో చాలా వ్యతిరేకత ఉన్నదనీ భావించి ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి ఎల్ జేపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది. కానీ బీజేపీని వ్యతిరేకించడానికి కానీ, జాతీయ స్థాయిలో ఎన్ డీఏ నుంచి వైదొలగడానికి కానీ, రాంవిలాస్ పశ్వాన్ మంత్రిమండలి నుంచి రాజీనామా చేయడానికి కానీ సిద్ధంగా లేరు. అందుకే, ‘బీజేపీసే బైర్ నహీ, నితీశ్ తేరీ ఖైర్ నహీ’ (బీజేపీతో వైరం లేదు. నితీశ్ తో మైత్రి లేదు) అనే నినాదాన్ని చిరాగ్ ప్రచారం చేశారు.

చిరాగ్ ఆదివారంనాడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం దిల్లీలోనే నిర్వహించారు. నితీశ్ పార్టీ జేడీయూకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టాలనీ, రాష్ట్ర స్థాయిలో ఎన్ డీ ఏ నుంచి బయటకు రావాలనీ, బీజేపీకి మద్దతు కొనసాగించాలనీ చిరాగ్ చేసిన ప్రతిపాదనలను బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. జేడీయూ, హిందూస్థానీ అవామ్ మోర్చా అభ్యర్థులపైన ఎన్ జేపీ అభ్యర్థులను పోటీ పెడతారు. ఎల్ జేపీ టిక్కెట్టుపైన కొందరు బీజేపీ నాయకులను రంగంలో దింపడానికి కూడా చిరాగ్ సంసిద్ధతను శనివారంనాడు బీజేపీ అధ్యక్షుడు జే.పీ.  నడ్డా, దేశీయాంగమంత్రి అమిత్ షాలను కలుసుకున్నప్పుడు వెలిబుచ్చారు. ఒక వైపు జేడీయూతో సీట్లు పంపిణీ చేసుకొని మరోవైపు జేడీయూని వ్యతిరేకిస్తున్న ఎల్ జేపీతో రహస్యంగా పొత్తు పెట్టుకోవడం ఎంతవరకూ సమంజసమని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు.

ప్రతిపక్షానికి తేజశ్వినిదే నాయకత్వం

ప్రతిపక్ష కూటమిని మహాకూటమి అంటున్నారు. దీనికి నాయకత్వం ఆర్ జేడీది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు లాలూప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్, మరో మాజీ ముఖ్యమంత్రి రాబ్డీదేవి సంతానంలో రెండో వాడు తేజశ్వి యాదవ్. అతడే ఆర్ జేడీ నాయకుడు. ఆర్ జేడీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రాథమికంగా సీట్ల సర్దుబాట్లపైన అవగాహన కుదిరింది. ఈ లోగా అప్పటి వరకూ మహాకూటమికి సన్నిహితంగా ఉండిన ఉపేంద్ర కుష్వాహా తేజశ్వి నాయకత్వాన్ని వ్యతిరేకించాడు. తేజశ్వికి నాయకత్వ లక్షణాలు లేవనీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తే తాను మహాకూటమిలో ఉండబోననీ ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. తేజస్వి తమ నాయకుడనీ, ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి అతడేననీ ఆర్ జేడీ పార్టీ ప్రకటించింది. అందువల్ల ఉపేంద్ర కొత్త కూటమి పెట్టుకున్నాడు. అందులో ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ ఎల్ ఎస్ పీ)తో పాటు మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, సోషలిస్టు పార్టీ అయిన లోక్ తాంత్రిక్ పార్టీ భాగస్వాములు. మహాకూటమి సీట్ల  సర్దుబాట్ల వివరాలు వెల్లడించవలసి ఉన్నది.

చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో ఎల్ జేపీ అధికార కూటమి ఓట్లు కొంతవరకూ చీల్చుతుంది. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని చిన్న కూటమి మహాకూటమికి చెందిన ప్రతిపక్ష ఓట్లను చీల్చుతుంది. ఇద్దరి వల్లా రెండు కూటములకూ ఎంతోకొంత నష్టం జరుగుతుంది. నష్టం సమానంగా జరగకపోవచ్చును. కానీ ఇద్దరూ ఒకరిని ఒకరు రద్దు చేసుకుంటారు. కాబట్టి కూటములలోని పార్టీల బలాలు అనుసరించి ఎన్నికల ఫలితాలు ఉంటాయి.

లాలూ ప్రచారంలో లేని తొలి ఎన్నికలు

లాలూప్రసాద్ కేంద్ర బిందువుగా ప్రచారం చేయకుండా ఎన్నికలు జరగడం గత మూడు దశాబ్దాలలో ఇదే ప్రథమం. 1974లో లోక్ నాయక్ జయప్రకాశ్ నాయక్ ఉద్యమం, 1989-90లో లాల్ కృష్ణ అడ్వానీ రథయాత్ర, దానిమీదట నాటి ప్రధాని వీపీ సింగ్ మండల్ నివేదిక దుమ్ము దులిపి బెర్రమీదికి తేవడం, బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో సామాజిక న్యాయం ఎజండాగా రాజకీయాలను శాశించిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్. లాలూతో పాటే నితీశ్ కుమార్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చి, ప్రాబల్యం పెంచుకున్నారు. ఈ ముగ్గరూ పాతబడి పోయారు. ఉత్తరప్రదేశ్ లో ములాయం కుమారుడు అఖిలేశ్ బాగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని అయిదేళ్ళు జయప్రదంగా నిర్వహించి తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ యావత్తూ ఇప్పుడు అఖిలేశ్ నాయకత్వంలో నడుస్తున్నది. పదిహేనేళ్లు లాలూ కుటుంబం, పదిహేనేళ్ళు నితీశ్ కుమార్ బీహార్ ని ఏలారు. మళ్ళీ పాతముఖాలేనా అనే విసుగు ప్రజలలో కనిపిస్తున్నది. రాంవిలాస్ పశ్వాన్ కుమారుడు చిరాగ్ కు ఆకర్షణ ఉంది. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆయన నాయకత్వంలోని పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రాబల్యం లేదు. లాలూ ప్రసాద్ కుమారుడు తేజశ్వి నాయకత్వంలో పెద్దపార్టీ ఉంది. కానీ ఆయన ఇంకా పార్టీ పైనా, రాజకీయాలపైనా పట్టు సాధించాల్సి ఉందని అంటున్నారు.

పీకే, యశ్వంత్ ఏమి చేస్తున్నారు?

తెలివితేటలూ, విజ్ఞానం ఉన్న  నాయకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) సెఫాలజిస్టు. ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలకు సహాయం చేసిన వ్యక్తి. నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీకి 2014 ఎన్నికలలో సహాయం చేసి, అనంతరం బీహార్ లో నితీశ్ కుమార్ పార్టీని గెలిపించి, ఆ తర్వాత కాంగ్రెస్ కోసం పని చేసి, తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ ఆర్ సీపీకి పని చేసి ఘనవిజయం సాధించడంలో పాత్రధారి అయ్యాడు. ఆయనకు పార్టీ లేదు. బీహార్ లో పుట్టాడు కనుక ఆ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో పర్యటిస్తున్నారు. అంతకు ముందు నితీశ్ కు అంతేవాసిగా ఉండేవారు. ఆర్ జేడీలో నితీశ్ తర్వాత స్థానంలో పని చేశారు. నితీశ్ కు రాజకీయ వారసులు ఎవ్వరూ లేరు కనుక ఆర్ జేడీ భావి నాయకుడు ప్రశాంత్ కిశోర్ అనే చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని మాసాల కిందట నితీశ్ తో విభేదాలు వచ్చి ప్రశాంత్ కిశోర్ తనదారి తాను చూసుకున్నారు. రాబోయే ఎన్నికలలో ఆయన భూమిక ఏమిటో, పోటీ చేస్తారో, చేయరో, ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలియదు.

యశ్వంత్ సిన్హా మాజీ కేంద్ర మంత్రి. కేంద్ర ఆర్థికమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమారుడు ప్రస్తుతం కేంద్రంలో మంత్రి. అయినా సరే, యశ్వంత్ చాలా రోజులుగా నరేంద్రమోదీ విధానాలను ఎండగడుతున్నారు. ఆయన కూడా బీహార్ లో కొంతకాలంగా పర్యటిస్తున్నారు. ఆయన నైతిక మద్దతు ఎటువైపు ఉంటుందో తెలియదు. మొత్తం మీద బిహార్ ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి.

ఇది మోదీకీ పరీక్షే

బీహార్ గెలుపు బీజేపీ కి చాలా అవసరం. పార్లమెంటులో జబర్దస్తీగా ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులకు నిజంగా వ్యవసాయదారుల మద్దతు ఉన్నదో లేదో తేలడానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పరీక్షగా భావించవచ్చు. కోవిద్ దాపురించిన సందర్భంలో దేశవ్యాప్తంగా షట్ డౌన్ విధిస్తూ మోదీ వ్యవధి ఇవ్వకుండా ప్రకటించడం సమంజసమో, కాదో తెలియడానికీ ఈ ఎన్నికల ఫలితాలు తోడ్పడతాయి. వలస కార్మికలు విషయంలో మోదీ, నితీశ్ కుమార్ ల వైఫల్యాన్ని ఆర్ జేడీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎండగట్టబోతున్నారు. ఈ విషయంలో జనాభిప్రాయం ఎట్లా ఉన్నదో కూడా ఎన్నికల ఫలితాలు సూచిస్తాయి. మధ్య ప్రదేశ్ లో, కర్ణాటకలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి సొంత ప్రభుత్వాలు  ఏర్పాటు చేసిన బీజేపీ వైఖరిపైన కూడా బీహార్ ప్రజలు తీర్పు ఇస్తారు. ఇన్ని కారణాల వల్ల బీహార్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles