Sunday, December 22, 2024

బీహార్ బాహాబాహీ: ఎటు చూస్తే అటు పరీక్ష

  • ఒపీనియ్ పోల్స్ లో ఎన్ డీఏ ముందంజ
  • క్షేత్రస్థాయిలో రెండు కూటములకూ అవకాశాలు
  • నితీశ్ నాలుగో సారి గెలిచి ముఖ్యమంత్రికా కొనసాగుతారా?
  • నవయువకుడు, లాలూ పుత్రుడు తేజశ్విని విజయం వరిస్తుందా?
  • మూడు దశాబ్దాలలో లాలూ ప్రచారం చేయని తొలి బీహార్ ఎన్నిక

బీహార్ లో ఎన్నికల వేడి పెరిగింది. పార్టీల తీరు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంది. ఒపీనియన్ పోల్స్ ఎన్ డి ఏ కూటమి గెలుపు వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ప్రజల తీర్పు మార్పు వైపు ఉంటుందా… పాత కాపుకే మళ్ళీ పగ్గాలు అప్పచెబుతారా.. అనే అంశం ఉత్కంఠగా ఉంది. ఇవి  ఉత్తరాదిలోని ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన ఎన్నికలు ఐనప్పటికీ, దేశమంతా ఎదురుచూస్తోంది. ఒకపక్క కరోనా కష్టాలు, మరొక పక్క  తీవ్ర వ్యతిరేకతల మధ్య వ్యవసాయ బిల్లులు ఆమోదం, ఇంకొక పక్క  వరదల ఆర్తనాదాలు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రతిష్ఠాత్మకమే అందరికీ

ఇవి  నరేంద్రమోదీ నాయకత్వంలో అధికారంలో  ఉన్న బిజెపి కూటమికి అగ్నిపరీక్ష. 15 ఏళ్ళ నుండి బీహార్ లో ముఖ్యమంత్రిగా స్థిరనివాసం ఏర్పరచుకున్న నితీష్ కుమార్ కు అగ్నిపరీక్ష. కడచిన మూడు దశాబ్దాలలో లాలూ ప్రసాద్ యాదవ్ రణక్షేత్రంలో లేకుండా బీహార్ లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ తీరున, ప్రతిపక్ష కూటమికి కూడా ఇది ఒక అగ్నిపరీక్ష. బిజెపి, జెడియు, తదితర పార్టీలు ఒక జట్టులో ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్ జె డి, వామపక్షాలు మహాకూటమిగా ప్రతిపక్షంలో ఉన్నాయి.ఇటీవలే దివంగతుడైన దళిత అగ్రనేత  రామ్ విలాస్ పాసవాన్ కుమారుడు చిరాగ్ పాసవాన్ ఎల్ జి పి (లోక్ జన్ శక్తి పార్టీ) తరపున ఎన్నికల బరిలో ఉన్నాడు. ఈ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇతను మోదీకి విధేయుడుగా ఉన్నాడు. అదే సమయంలో,  నితీష్ ను వ్యతిరేకిస్తున్నాడు.

చిరాగ్ పాసవాన్ వల్ల దళిత ఓట్ల చీలిక

పాసవాన్  వల్ల అధికార కూటమి ఓట్లలో కొంత చీలిక వచ్చే అవకాశం ఉంది. హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. దీని నాయకుడు జతిన్ రాం మాంఝి. ఇతను మాజీ ముఖ్యమంత్రి. మహాదళిత సామాజిక వర్గానికి చెందిన నేత. నితీష్ ఇతన్ని ఎన్ డి ఏ కూటమిలోకి కలుపుకున్నాడు. ఇది పాసవాన్ కు ఇష్టం లేదు. పాసవాన్ పెత్తనం ఇతనికి ఇష్టం లేదు. ఇవన్నీ రేపటి ఫలితాల్లో చూపిస్తాయి. ముఖ్యంగా దళిత ఓట్లపై  ఆ ప్రభావం ఉంటుంది. ముఖేష్ నిషాద్ నాయకత్వంలోని వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీకి బిజెపి తన కోటాలో నుండి కొన్ని సీట్లు కేటాయించింది. వీళ్ళందరూ అధికార ఎన్ డి ఏ పక్షాన ఉన్నారు. ప్రతి పక్ష మహాకూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ రెండవ కుమారుడు, ఆర్ జె డి నేత తేజశ్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నాడు.

కాబోయే ముఖ్యమంత్రి నితీశ్ లేదా తేజశ్వి

జశ్విపోటీలో ప్రధాన అభ్యర్థులు నితీష్ కుమార్ – తేజశ్వీ యాదవ్ అని చెప్పాలి. తేజస్వి 30 ఏళ్ళ యువకుడు. 2015 నుండి 2017 వరకూ అప్పటి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్నాడు. దేశంలోనే ప్రతిపక్ష నేతల్లో ఇతనే అందరికంటే యువకుడు. క్రికెట్ మాజీ ఆటగాడు కూడా. ఇతను కూడా సిబిఐ, ఈ డి నుండి  కేసులు ఎదుర్కొంటున్నాడు. 9వ తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. 2015లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కు అసలు సిసలైన వారసుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు ఇతని నాయకత్వాన్ని అంగీకరించలేక బయటకు వచ్చారు. మహాకూటమిగా ఏర్పడిన ప్రతిపక్షం మాత్రం  ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్విని సంపూర్ణంగా అంగీకరించి ఎన్నికలో బరిలో తలపడుతున్నాయి. “మార్పు కోసం మీ తీర్పు” ( హమారా సంకల్ప్ బదలావ్ కా ) అంటూ తేజస్వి ప్రజల్లోకి వెళ్తున్నాడు. అధికార కూటమిలో ఉన్న జె డి యు, బిజెపి బీహార్ కు వెన్నుపోటు పొడిచాయి అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నాడు.

 మోదీ మాటలు నీటిపైన రాతలు : తేజశ్వి

బీహార్ లో జౌళి, చక్కెర, కాగితం మిల్లులన్నీ తెరిపిస్తానని 2015లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన మాటలు నెరవేరలేదనీ, ఆయన  మాటలన్నీ నీటి మీద రాతల్లాంటివంటూ తేజశ్వి యాదవ్  వ్యంగాస్త్రాలు సంధిస్తున్నాడు. వ్యవసాయ ఋణాల మాఫీ, నిరుద్యోగ యువతకు 10లక్షల ఉద్యోగాల కల్పన మొదలైన అంశాలతో ఆర్ జె డి మ్యానిఫెస్టో విడుదల చేసింది. నరేంద్రమోదీ దేశానికి, నితీష్ కుమార్ బీహార్ కు రక్షకులనీ, వీరిద్దరి నేతృత్వంలో బీహార్ లో అద్భుతాలు జరుగుతాయంటూ ఎన్ డి ఏ ప్రచారం సాగిస్తోంది. ఇలా రెండు వర్గాలు హోరా హోరీగా ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతున్నాయి.

సర్వేలు వేరు, క్షేత్రవాస్తవికత వేరు

సర్వేలు, పార్టీల మాటలు అలా ఉంచగా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. అవినీతిపరుడు కాదన్న  ఒక్క పేరు తప్ప, నితీష్ పాలనలో ఈ 15ఏళ్ళల్లో సాధించిన  చెప్పుకోదగ్గ ప్రగతి ఏమీలేదు. నిబద్ధత, విలువలు కలిగిన నాయకుడిగా నితీష్ కు కొంతకాలం మంచి పేరు ఉండేది. పదవి, రాజకీయ స్వార్ధంతో పలు రకాలుగా ప్రవర్తించాడు. కొంతకాలం బిజెపితో ఉండి, విడిపోయాడు. లాలూ ప్రసాద్ తో కొంతకాలం జతగలిసి, బయటకు వచ్చి మళ్ళీ బిజెపితో పొత్తుపెట్టుకున్నాడు. ఇలా, సాధారణ రాజకీయ నాయకుల  జాబితాలోకి ఎప్పుడైతే వెళ్లిపోయాడో, అప్పుడే నితీష్ వ్యక్తిగత ప్రతిష్ఠ గ్రాఫ్ పడిపోయింది. అటు అభివృద్ధి లేదూ -ఇటు నిబద్ధత లేదని నిరూపించుకున్నాడు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి పట్ల ప్రజలకు మొహం మొత్తే అవకాశమే ఉంటుంది.

మళ్ళీ నితీశ్ ఎన్నికైతే అద్భుతమే

నిజంగా మళ్ళీ ఇతనే ఎంపికైతే! ఇది అద్భుతమే. విజయమే వరిస్తే? నితీష్ కు ఎంత విజయమో? నరేంద్రమోదీ నాయకత్వానికి కూడా అంతే విజయమవుతుంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పాలన పట్ల కూడా బీహార్ ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు రుజువు చేస్తాయి. లేదా? యువకుడైన తేజశ్వి యాదవ్ పట్ల ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిత్వానికి ఇప్పుడే పనికిరాడనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అనుకోవాలి. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెరగలేదని అర్ధం చేసుకోవాలి. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో అవినీతి, అక్రమాలు తారా స్థాయిలో జరిగాయి. తేజస్వి ఆ  చెట్టు నుండి వచ్చిన కొమ్మే. అతనిపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలను బీహార్ ప్రజలు ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటారన్నది సందేహమేనని రాజకీయ పరిశీలకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్ష మహాకూటమికి మెజారిటీ వచ్చిందంటే, నితీష్ పాలనపై వ్యతిరేకత, యువనాయకుడు తేజస్వి పట్ల ఆకర్షణ, అగ్రనేత  లాలూ ప్రసాద్ జైల్లో మగ్గుతున్నాడనే సానుభూతి, దళిత ఓట్ల చీలిక మొదలైనవి కారణాలవుతాయి. బీహార్ లో మొత్తం 243స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 10వ తేదీనాడు ఫలితాలు వెలువడుతాయి. అందరి బండారం ఆరోజు బయటపడుతుంది. మొత్తంమీద ఈ ఎన్నికలు అందరికీ అగ్నిపరీక్షగానే ఉన్నాయి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles