“ఒరే అన్నా !” “ఒరే తమ్ముడు !”… ఎప్పటి పిలుపులవి?
కలిసి నడచిన రోజులు
గొంతులు కలిపి “వందేమాతరం!” అంటూ నినదించిన క్షణాలు
మృత జ్ఞాపకాలై, కాలి బూడిదై,
గాలిలో ఎప్పుడో కలిసిపోయాయి.
శతాబ్దాల నాటి బంధం
దశాబ్దాల క్రితం తెంచు కొన్నాం,
భాగాలు పంచు కొన్నాం, పగలు పెంచుకొన్నాం!
నేను దత్తత తీసుకున్న నీ బిడ్డలు
నా దగ్గర అపురూపం గానే పెరుగు తున్నారు.
మొండి చేసినా, మూర్ఖంగా ప్రవర్తించినా
ముద్దు చేస్తూనే ఉన్నాను.
మరి నీ దగ్గర మిగిలి పోయిన
నా పిల్లలు…?
మా వాకిట తెల్ల మల్లె పూలు పూయిస్తున్నాము,
నీ ఇంట ఆకుపచ్చ నాగులను పెంచుకొంటున్నావు …
మొదటి కాటు నీకే సుమా?
కాలు ఆనే చోట కట్టలేని ‘జన్నత్ ‘
కల్పనలో కట్టుకొని
అక్కడికి పోవాలని ముచ్చట పడుతున్నావు.
కంటికి కనిపించే సుకుమార సౌందర్యాన్ని
కర్కశంగా నలిపేస్తూ
కనిపించని లోకంలో కల్ల కన్నియల పొందు కోసం
కలలు కంటున్నావు.
ద్వేషం నీ దౌర్బల్యం, ప్రేమ నా వ్యసనం.
అప్పుడప్పుడు ధర్మరాజులా, విభీషణుడి లా
భ్రాతృ వాత్సల్యంతో నేను ఉక్కిరి బిక్కిరి కాకపోలేదు.
నిన్ను మార్చాలని, అక్కున చేర్చాలని
అంతరాంతరాలలో లేకపోలేదు…
మోహరించిన విరుద్ధ ప్రకృతుల
మధ్యన నిలబడి ఈ విచికిత్స వ్యర్థమే!
లీలగా సీతమ్మ తల్లి మాటలు గుర్తుకొచ్చాయి
కర్మణః ఫలమ్ కాలోప్యంగీ భవత్యత్ర సస్యానామివ పక్తయే
పాపాత్ముని యొక్క దుష్కర్మ ఫలము వెంటనే కనబడదు గదా!
Also read: కోడి
Also read: బొమ్మలు
Also read: పుష్ప వేదన
Also read: తపస్సు
Also read: యుగసంధి