ఇంతకుముందే ఫేస్బుక్ లో DHPS ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుబ్బారావు, తిరుపతి జిల్లా బాధ్యుడు చిన్నం కాలయ్య గారు, ఒకరు ఎర్ర షర్టు మరొక రు బ్లూ షర్టు వేసుకొని లాల్ – నీల్ ఐక్యతని పోస్ట్ పెట్టారు. ఈ లాల్ – నీల్ ఐక్యత సిద్ధాంతకారులు ఎవరయ్యా అంటే ప్రధానంగా షెడ్యూల్ కులానికి చెంది కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్న వారు అని చెప్పవచ్చు. దీనిపై నేను “కులం- బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ “అనే పుస్తకంలో ఇలాంటి వారి గురించి ‘అటు ఇటు కానీ ఇష్టులు’అనే వ్యాసంలో చర్చించాను. కమ్యూనిస్టు పార్టీలు ఇటీవల షెడ్యూల్ కులాలు ఎదుర్కొంటున్న కుల వివక్షపై పనిచేయటానికి గాను DHPS, KVPS అని సంస్థలు పెట్టాయి. ఇందులో పనిచేసే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. అయినప్పటికీ అక్కడ బ్లూ షర్ట్ లు, జెండాలు వాడవచ్చు. ఆ అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క సంఘంలో మాత్రమే ఇలాంటి అవకాశం ఉంది. మరి ఏ ప్రజా సంఘంలో ఇలాంటి అవకాశం లేదు.(బ్లూ రంగు వాడే) వీరు ఇరువురు షెడ్యూల్ కులానికి చెందిన వారు కావున ఒక ఎర్ర షర్టు, మరొకరు బ్లూ షర్ట్ వేసుకొని లాల్ నీల్ ఐక్యత అంటే ఎట్లా? ఇలా స్వీయ మానసిక అవసరాల నుండి నినాదాలు, నిర్మాణాలు చేస్తే నిలబడతాయా? మార్క్సిజం స్వీయ మానసిక ధోరణుల నుండి విశ్లేషణలు చేస్తే నిలబడవు అని అంటుంది. కమ్యూనిస్టు పార్టీలలో పనిచేస్తున్న వీరికి మార్క్సిజం అర్థమయ్యే ఇలా చేస్తున్నారా? అంటే ప్రశ్న రావడం న్యాయం. వాస్తవానికి లాల్ – నీల్ ఐక్యత అనేది కమ్యూనిస్టు పార్టీ సమస్య కాదు. ఇప్పుడే కాదు ఇక ముందు కూడా కాదు. ఇది కేవలం ఆ పార్టీలో పని చేస్తున్న షెడ్యూల్ కులాల కార్యకర్తల అవసరార్థ సిద్ధాంతం. మరి వీరికే ఎందుకు ఈ అవసరం పడ్డది? ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ స్లొగన్స్ చూసి బ్రమలకు లోనై ఆ పార్టీలోకి వెళ్లి పనిచేస్తున్నారు.
Also read: భక్తులతోనేదేవుడికిముప్పు, నాస్తికులతో కాదు!
వాస్తవానికి ఇప్పటివరకు షెడ్యూల్ కులాల్లో వచ్చిన మార్పులన్నీ అంబేద్కర్ పోరాటాలు, సిద్ధాంతాల వల్లనే అనేదాన్ని కూడా చూస్తున్నారు. అలాగని కమ్యూనిస్టు పార్టీని వదిలి వచ్చి అంబేద్కర్ ఉద్యమాన్ని నిర్మించలేరు. దాన్ని వదిలితే ఉన్న ఉపాధి పోతుంది. బయటకు వచ్చి ఉద్యమం నిర్మించే శక్తి కూడా లేదు. అలాగని అంబేద్కర్ను అభిమానించకుండా ఉండలేరు. ఇలాంటి సందిగ్ధత, అవసరాల నుండి పుట్టిందే లాల్ – నీల్ ఐక్యత. దానికి ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన రామచంద్ర మోరే అనే వ్యక్తి ఐకానుగా వారికి దొరికాడు. ఆయన అంబేద్కర్తో మొదట్లో కలిసి పనిచేసి తర్వాత సిపిఎం పార్టీలో చేరాడు. షెడ్యూల్ కులానికి చెందిన వాడుగా ఉండటం ,అంబేద్కర్ తో కలిసి పని చేసిన వాడు కావడం వల్ల కమ్యూనిస్టు పార్టీలోకి పోయిన తర్వాత కూడా అంబేద్కర్ తో స్నేహపూర్వకంగా సంబంధాలను కొనసాగించాడు.
Also read: భారతదేశంపైన మార్క్స్ఏమన్నారంటే….!?
ఇది ఆయన నేపథ్యం. ఆయనపై సిపిఎం సెంట్రల్ కమిటీ ప్రచురణ విభాగం’ లెఫ్ట్ వర్డ్’ఆయన అనుభవాలతో కూడిన పుస్తకాన్ని దళిత కమ్యూనిస్టు టైటిల్తో తెచ్చింది. నేను అప్పుడే మోరే అనుభవాలు ఏ దళిత కమ్యూనిస్టు అని పెడితే, బీవీ రాఘవులు అనుభవాలను ఏ కమ్మ కమ్యూనిస్టు అని, సీతారాం ఏచూరి అనుభవాలను ఏ బ్రాహ్మణ కమ్యూనిస్టు అని పేరుతో పబ్లిక్ చేస్తారా? అని రాశాను. దానిపై ఇంతవరకు ఎవరు కూడా మన దళిత కమ్యూనిస్టులు కూడా సమాధానం ఇవ్వలేదు. వీరు దేన్ని వదులుకోలేరు. అంటే అటు కమ్యూనిస్టు పార్టీని ఇటు అంబేద్కర్ను. అందుకే ఇలాంటి వారిని ‘అటు ఇటు కాని ఇస్టు లు అని’ అన్నాను. కాబట్టి ఇలా స్వీయ మానసిక అవసరాల నుండి (అవసరార్థం) పుట్టుకు వచ్చే సిద్ధాంతాలు, నినాదాలు ఆచరణలో నిలబడవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టే ఈ అయోమయ గందరగోళం నుండి ఇలాంటి అవసరార్థ సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి.(మరింత వివరణ కోసం నా – బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’ అనే పుస్తకములో చూడండి.)
Also read: దారితప్పిన దళితోద్యమం!?
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు