నీ పుట్ట దరికి నా పాపలొచ్చేరు
పాప పుణ్యమ్ముల వాసనే లేని
బ్రహ్మ స్వరూపులౌ పసికూన లోయి!
కోపించి బుస్సలు కొట్ట బోకోయి!
నాగుల్ల చవితికి నాగేంద్ర నీకు
పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ!
చీకటిలోన నీ శిరసు తొక్కేము
కసిదీర మమ్ముల్ని కాటెయ్య బోకు
కోవపుట్టాలోని కోడె నాగన్న
పగలు సాధించి మా ప్రాణాలు తీకు!
నాగుల్ల చవితికీ నాగేంద్ర నీకు
పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ!
అర్ధరాతిరి వేళ అపరాత్రి వేళ
పాపమేమెరుగని పసులు తిరిగేను
ధరణికి జీవనాధారాలు సుమ్మ!
వాటిని రోషాన కాటేయబోకు!
నాగుల్ల చవితికి నాగేంద్ర నీకు
పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ!
అటుకొండ యిటుకొండ ఆ రెంటి నడుమ
నాగుల్ల కొండలో నాట్యమాడేటి
దివ్య సుందర నాగ, దేహి యన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి!
నాగుల్ల చవితికీ నాగేంద్ర నీకు
పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ!
పగలనక రేయనక పనిపాట లందు
మునిగి తేలేటి నా…
భావకవితా యుగపు వినీల గగనంలో జ్వాజ్జ్వల్యమానంగా ప్రకాశించి అర్ధాంతరంగా అదృశ్యమైన తార బసవరాజు అప్పారావు (1894 – 1933). పద్యరచన కొంత చేసినప్పటికీ, ప్రధానంగా గేయకవి ఆయన. గుండెలు చీల్చుకొని వచ్చే ఆయన ఉద్వేగానికీ, నిసర్గ మోహనమైన ఆయన కవితాధారకు గేయమే సరియైన వాహిక. ఆయన అర్ధాంగి రాజ్యలక్షమ్మ సైతం కవయిత్రి. ఇరువురూ గాంధేయ పథంలో పయనించిన వారే. రాజ్యలక్షమ్మ గాంధీ గారి సేవాగ్రామం మహిళాశ్రమంలో తరిఫీదు పొంది కారాగార క్లేశం చవిచూచిన మహిళ.
ఆయన గీతాలన్నీ ప్రసిద్ధములు. “వటపత్ర శాయి” “టాజమహల్,” “చలిపిడుగు” “ప్రేమతత్వము” వంటివి ఒకానొకప్పుడు ఇంటింటా అపురూపంగా పాడుకొన్న కమనీయ గీతాలు.
Also read: నీ పదములు
స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆయన రచించిన
“కొళ్ళాయి గట్టితే నేమి
మా గాంధి
కోమటై పుట్టితే నేమి”
అనే గేయం ఆంధ్రదేశాన్ని ఉఱ్ఱూతలూపింది. మహాకవి విలియమ్ వర్డ్స్ వర్త్ కవిత్వ నిర్వచనం బసవరాజు మనస్తత్వానికి సరిగ్గా సరిపోతుంది: “Poetry is the spontaneous outflow of feelings. It takes its origin from emotion recollected in tranquillity”.
Also read:వంతెనపై పొద్దుపొడుపు
ఆయనకు ఘనమైన నివాళి అర్పించిన వారిలో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒకరు. బసవరాజుపై కృష్ణశాస్త్రి ఖండిక యిదుగో చదవండి:
నా వలెనె ఆతడున్మత్త భావశాలి
ఆగికోలేడు రేగు ఊహల నొకింత
ఎట్టి నిశినేని అదరిపోవు నెగసిపడును
ఎన్ని చుక్కల పాటు లెన్నెన్ని మెరపులు!
ఇంత చిరుగీతి యెద వేగిరించునేని
పాడుకొనును; తాండవ నృత్య మాడుకొనును
మస్తకమ్మోరగా వంచి మన్ను మిన్ను
వేయి కేలాడగా వ్రాసి వేసికొనును
నే నెరుంగుదు నా వలెనే యతండు
పాట పదములకై నిత్య పథికు డయ్యె
నే నెరుంగుదు నా వలెనే యతండు
ప్రతి పదమ్మున శీతలస్వాదు మధు తు
షారముల పార్శ్వముల విరజల్లుచేగు!
మానవుడు, ప్రకృతితో మమేకమై జీవించే పల్లెపట్టుల్లో మనిషి, సర్పము, పరస్పరం ఎదురెదురు కావడం సహజం. పసిపిల్లలు, స్త్రీలు, పశువులు, చీకటిలో తెలియక తొక్కితేనో, ఇతరత్రా ఏ కారణం చేతనో, పాముకాటుకు గురికావడం సహజం. పాములు అందమైనవి. భీతిని కలిగించేవి కూడా. మానవుడు సర్పజాతితో మైత్రీ భావాన్ని ప్రకటించే పండుగ నాగుల చవితి.
రోషంతో కెరటం వలె ఉవ్వెత్తున లేచి పడగ విసిరే ఫణీంద్రుణ్ఢి చూచినప్నుడు శరీరం గగుర్పొడిచినట్లే, నల్లని పాము పుట్టల్లో మహిళలు పాలు పొయ్యడం, ఆ పుట్టలకు భక్తితో మ్రొక్కడం, వాటిని పసుపు కుంకుమలతో ఆకర్షణీయంగా అలంకరించడం కూడా అంతే అలరించేది నా పసితనంలో ఒకప్పుడు.
Also read: గంగిరెద్దు
ఈ గేయం నిండా సున్నితమైన బసవరాజు మనస్సును, దయామయమైన ఆయన హృదయాన్ని, తనివితీరా అనుభవించి, పరవశిస్తాము.
ఎద మెత్తనౌటకే
సుదగొందరా అంత
మది గల అహమ్మెల్ల
వదలి పోవునురా!
వలపెరుంగక బ్రతికి
కులికి మురిసేకంటె
వలచి విఫలమ్మొంది
విలపింప మేలురా
అన్నది అప్పారావు జీవన తత్వం.
దాదాపు నూరేళ్ళ నాటిదీ కవిత. పాతకాలపు తీపి గురుతులను మృదువుగా తట్టి పిలిచి గుండెలకు హత్తుకుంటుంది.
Also read: మా ఊరు ఓరుగల్లు
నివర్తి మోహన్ కుమార్