- యడ్యూరప్ప సూచించిన వ్యక్తికే పగ్గాలు
- బసవరాజ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మయ్ కుమారుడు
- లింగాయత్ ప్రముఖుడు
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మయ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారంనాడు బెంగళూరులో జరిగిన బీజేపీ శాసనసభా పక్షం సభకు అధిష్ఠానవర్గం పరిశీలకులు కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రధాన్, జి. కిషన్ రెడ్డి హాజరైనారు. బసవరాజ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ నాయకుడు ఎస్ఆర్ బొమ్మయ్ కుమారుడు. లింగాయత్ కులానికి చెందిన ప్రముఖులు. సోమవారంనాడు రాజీనామా చేసిన యడ్యూరప్ప సూచించిన వ్యక్తి.
కర్ణాటక జనాభాలో లింగాయత్ లు 16 శాతం ఉంటారు. వారికి మతభక్తి, కులపట్టింపు, ఆవేశం అధికం. ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించరాదని లింగాయత్ కు చెందిన సాధువులు రెండు దఫాలు బీజేపీ నాయకత్వానికి స్పష్టంగా చెప్పారు. 79 ఏళ్ళ వయస్సు వచ్చింది కనుకా, పార్టీలో అసమ్మతి పెరిగి యడ్యూరప్పను వ్యతిరేకించే వర్గం బలపడింది కనుకా ఆయనను తప్పించక తప్పలేదు. కానీ లింగాయత్ లను సంతుష్టులను చేయాలంటే అదే వర్గానికి చెందిన వ్యక్తినీ, యడ్యూరప్ప సూచించిన వ్యక్తినీ ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ధర్మేధ్రప్రధాన్ కీ, కిషన్ రెడ్డికీ చెప్పారు.
బుధవారం ఉదయం 11 గంటలకు బసవరాజ్ బొమ్మయ్ రెండో బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయిస్తారు. అయిదేళ్ళలో బలసవరాజ్ మూడో ముఖ్యమంత్రి. మొదట జనతాదళ్ (సెక్యులర్)పార్టీ అధినేత హెచ్ డి కుమారస్వామి జెడీ(ఎస్)-కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రెండేళ్ళు కూడా పని చేయకముందే కాంగ్రెస్ నుంచి ఎంఎల్ఏలు బీజేపీలోకి వలస వెళ్ళారు. దాంతో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు యడ్యూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ఎంఎల్ఏలను దువ్వడానికీ, వారి చేత పార్టీ ఫిరాయింపజేయడానికి ఇజ్రేల్ సాఫ్ట్ వేర్ పెగాసస్ ని బీజేపీ నాయకత్వం వినియోగించిందంటూ కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. యడ్యూరప్ప నాలుగు విడతలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ ఎప్పుడూ ఒక టరమ్ పూర్తి చేయలేదు. కానీ ఆయనే బీజేపీకి దక్షిణాది నుంచి ఏకైక ముఖ్యమంత్రి. దక్షిణాది నుంచి రెండో బీజేపీ ముఖ్యమంత్రి బసవరాజ్ పేరు చరిత్రకు ఎక్కుతుంది.
యడ్యూరప్ప జులై 10 వ తేదీనే ఒక ఆంతరంగికుడి చేత తన రాజీనామా లేఖను దిల్లీకి పంపించారు. ప్రధాని చేతికి అదే రోజు చేరింది. ఈ విషయాన్ని యడ్యూరప్ప నిన్నటి వరకూ గట్టుగా ఉంచారు. సోమవారంనాడు వేడ్కోలు సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు యడ్యూరప్పకు కన్నీరు ఆగలేదు. గొంతు పెగలలేదు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినా పార్టీకి సేవలు చేస్తూ ఉంటానని చెప్పారు. కడచిన రెండేళ్ళుగా అగ్నిపరీక్ష ఎదుర్కున్నానని ఒకటికి రెండు సార్లు అన్నారు.
ఈ రోజు బసవరాజు పేరు ప్రకటించగానే ఆయనను అభినందిస్తూ యడ్యూరప్ప స్వయంగా ఆలింగనం చేసుకున్నారు. కొత్త ముఖ్యమంత్రి కర్ణాటకను ప్రగతిపథంలోకి తీసుకొని వెడతారనీ, ప్రజల ఆశలను నెరవేర్చుతారనీ, పార్టీ వాగ్దానాలను అమలు చేస్తారనీ ఆశిస్తున్నట్టు ఒక సందేశంలో యడ్యూరప్ప అన్నారు.