- 69వ రోజుకు చేరిన రైతుల ఆందోళన
- ఆందోళనకారుల కట్టడికి ఇనుప కంచెలు, బారికేడ్ల ఏర్పాటు
సాగు చట్టాల రద్దుకోసం చేస్తున్న ఆందోళన 69వ రోజుకు చేరినా రైతులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నుంచి రైతులు ఢిల్లీ యూపీ సరిహద్దుల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 6న దేశ వ్యాప్త రాస్తారోకోకు రైతులు పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దు కోసం ఆందోళనను రైతులు రోజు రోజుకు విభిన్న పద్దతుల్లో ఉధృతం చేస్తున్నారు. అదే సమయంలో రైతుల ఆందోళనపట్ల పోలీసులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా భారీగా సాయుధ బలగాలను మోహరించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు, ఇనుపకంచె ను ఏర్పాటు చేశారు.
రైతుల ఆందోళన, పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలంటూ పోలీసులు సూచించడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింఘు సరిహద్దుల్లో రెండు వరుసలుగా సిమెంట్ బ్యారియర్లను ఏర్పాటు చేశారు. సింఘు నుంచి ఢిల్లీ లోనికి ఆందోళనకారులను అడ్డుకునేందుకు వీలుగా సిమెంటుతో గోడను నిర్మించారు. ఢిల్లీ లోపలికి ప్రవేశించే అన్ని ప్రదేశాల్లో ఆందోళనకారులను రానీయకుండా బస్సులను అడ్డుగా పెట్టారు. రోడ్డుపై పెద్ద పెద్ద మేకులను కొట్టారు.
ఇంటర్నెట్ సేవల నిషేధం:
రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాలలో ఈ రోజు (ఫిబ్రవరి 2) అర్థరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పరిస్థితులను బట్టి ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని లేదంటే సేవలపై నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
రైతుల దీక్షకు శివసేన మద్దతు :
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు శివసేన సంఘీభావం తెలిపింది. సంజయ్ రౌత్ సహా ఆరుగురు శివసేన ఎంపీలు ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లి భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ ను కలిసి సంఘీభావం తెలిపారు. బడ్జెట్ కేటాయింపులకన్నా సాగు చట్టాల రద్దే తమకు ముఖ్యమని రైతులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్షాల నిరసన
ఇనుప కంచె ఏర్పాటుపై రాహుల్ సెటైర్లు :
ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు ఇనుపకంచెలు, సిమెంటు గోడలు నిర్మించటాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. చట్టాలను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రైతుల దీక్షా శిబిరాల చుట్టూ గోడలు కాదు వంతెనలు నిర్మించాలంటూ ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీ పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే ఆందోళన కారులను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా నాలుగైదు వరుసలుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఎర్రకోటను ముట్టడించిన రైతులు