నాకు తెలుసు నేను దున్నుతున్నది
చవుడు భూమి అని.
ఇప్పుడు నయం. ఒకప్పుడు ఇది
ప్రవహించే ఇసుక కెరటాల క్రింద
మెలికలు తిరుగుతూ నాగులు
ఎలుకలను వెతికిన ఎడారి నేల.
వేరే గతిలేక, కేవలం జీవితేచ్చతో
బ్రహ్మజముడు మొక్కలు
బ్రతకలేక బ్రతికీడ్చిన మరుభూమి!
పచ్చటి పచ్చిక బయళ్ళనే
వరుణుడు వరిస్తా డెందుకో…
నదులు నగ్న సుందర వనాల సొగసులనే
స్పృశిస్తూ సాగుతాయెందుకో,
రేగడి నేలలోనే ఆరడుగుల లోతులో
జల వాహినులు ప్రవహిస్తాయి ఎందుకో?
మరి ఇక్కడో…
ఇక్కడి ఆకాశంలో నల్ల మబ్బుల
జాడలు కనపడవు
దరిదాపు లో ఒయాసిస్ లు అగుపడవు.
ఇసుక తుపానుల వికృత రోదన
వ్యగ్ర వంధ్య భూమి వ్యర్థ వేదన…
మధ్య మధ్యలో నిరీహ నిశ్శబ్దం
చేసే వేడి నిట్టూర్పులు! ఇంతే!
ప్రకృతి కి ఎంత పక్షపాతం?
భగవంతుడూ బలవంతుడి పక్షమే!
అయినా కష్టపడ్డాను…
ఎండి పగుళ్లు వారిన నేలను కన్నీటితో తడిపాను
దాహార్తి తో దహించుకు పోతున్న నేల తల్లికి
స్వేదం అర్ఘ్యం గా ఇచ్చాను.
ఈవేళ కాక పోతే రేపు,
వరి రాకపోతే వేరు శనగ,
వేరేది పండక పోతే
సణుగుకుంటూ వేసే సరుగుడు…
ఆరు నెలలకు రాకపోతే ఆరేండ్లకు
నాకు, నా నేల తల్లికి గట్టి గుండెలు…
అవి చీల్చి అయినా
మధుర మధుర జీవ జల ఝరులలో
ఓ రోజు మునిగి తేలుతాం!
ఈ సంక్రాంతి కి కాకపోయినా
వచ్చే సంక్రమణకు
తీయ పొంగలి చేసి భూఆశ్రిత
భూత గణాలకు నైవేద్యం పెడతాం!
అంత వరకు కరగవు ఈ కండలు…
సడలదు మనో ధైర్యం…
బ్రతకడానికి అన్నం లేకపోతే
కంద మూలం!
Also read: పాత కథ
Also read: చరిత్ర
Also read: భాష్పాంజలి
Also read: చందమామ
Also read: పగటి కలలు