Tuesday, December 3, 2024

ఆండాళమ్మ పాదాలకు బాపు పారాణి

గోదమ్మ సిరినోము, బాపు జయంతి

By Prof M Sridhar Acharyulu

మనందరిలో అభిమానం లేని వాడెవరూ లేరు. వారిలో గొప్ప అభిమాని బాపు వారి ముందు  వింజమూరి వెంకట అప్పారావు గారు విస్తృతంగా ఫేస్ బుక్ స్నేహితుల్లో నవ్వులతో బాపు చిత్రాలలో నవ్వించే వారాయన. ఆయన నవ్వుల దేవుడు భూమ్మీద మొదటి కెవ్వు వినిపించిన రోజివాళే అని నివాళులు ఇస్తున్నారు.

సాధారణంగా ధనుర్మాసనం ఎప్పుడైనా డిసెంబర్ 16న మొదలవుతుంది, సంక్రాంతి నాడు పండుగ 14 జనవరిన వస్తుంది. 15వ తేదీన గోదా రంగనాథుల కల్యాణం కూడా జరుపుతారు. ఇది ధనుర్మాస తిరుప్పావై నోముల రోజులు. ఇవి సిరినోముల రోజు. శ్రీకృష్ణుని రాజు, ముత్యాల ముగ్గులు వేసుకునే రోజుల రారాజు పూల రంగనాథుడు.  ధనుర్మాసం వైష్ణవులకు దివ్యమాసం. సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉంటాడు. చాంద్రమానరీత్యా మహావిష్ణువుకు ఎంతో ప్రియమైన మార్గశిరం, పుష్యమాసాల నడుమ ధనుర్మాసం ఉంటుంది. ఇది దక్షిణాయనంలో చిట్టచివరి మాసం.

దేవతలకు తెల్లవారుజాము కాలం ప్రారంభమవుతూ ఉండే ఈ సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శ్రీకృష్ణుని వివిధ నైవేద్యాలతో పూజిస్తుంటారు. ఆండాళ్ రచించిన తిరుప్పావై పాశురాలతో, ముంగిట ముగ్గులతో స్వామిని తమ లోగిళ్లలోకి స్వాగతిస్తారు. ధనుర్మాసంలో ప్రతీరోజూ ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనంచేస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాస వ్రతంతో శ్రీకృష్ణభగవానుణ్ణి అర్చించింది.

శ్రీకృష్ణుడు, అన్నతో కలిసి ప్రియులైన ఆబాలగోపాలురు ఆడుకుని పాడుకునే బొమ్మ ఇందులో బాపు ఈ అల్లరి వాడైనా చల్లని వాడైనా ఇతనే కదా చక్కని దేవుడే కదా.

శ్రీకృష్ణుడు, అన్నతో కలిసి ప్రియులైన ఆబాలగోపాలురు ఆడుకుని పాడుకునే బొమ్మ ఇందులో బాపు ఈ అల్లరి వాడైనా చల్లని వాడైనా ఇతనే కదా చక్కని దేవుడే కదా.

ఈ సందర్భంలో కూడా అప్పారావుగారే సేకరించిన అద్భుతమైన నారాయణ తీర్థులతో నారాయణుడిచేతనే నృత్యంచేయించిన భక్తుడాయన. కృష్ణంకలయ సఖీ సుందరం…బాలకృష్ణం కలయ సఖీ సుందరం

కృష్ణం గత విషయ తృష్ణం…. అని నృత్యం చేయని వారెవరు.

నారాయణతీర్థులవారికీదృష్టిదోషంఉండేది… రోజూరాత్రిళ్ళుభోజనాలయ్యాక….వసారాలోపడుకునీకళ్ళుమూసుకునితరంగాలుపాడుకునేవారు. అప్పుడు బాలకృఘ్ణడొచ్చి…..తీర్థులవారిబొజ్జమీదెక్కి….తాండవంచేసేవాడు.తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య…ఓ రోజు అడిగాడు. “గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?”

“బాలకృఘ్ణడి తాండవమా…ఎప్పుడ్రా…”

“అయ్యో! రాత్రిళ్ళు….మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా….అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు…నేను రోజూ చూస్తున్నాగా”!

“ఎంత అదృష్టవంతుడివిరా…గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!” అని కళ్ళు తుడుచుకునీ

“ఒరే…ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో…”

“ఓ……అలాగే”అన్నాడు సిద్దప్ప…

మర్నాడురాత్రిబాలకృఘ్ణడుకనపడగానేదణ్ణంపెట్టీ “జగద్గురూ….మాగురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?” అన్నాడు.

“నీకు ఈ జన్మలోనే…(నా దర్శనం అయ్యిందిగా…..!)

మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!” అన్నాడు. మురళి మనోహరంగా మోగింది…అంచేతేసిద్దేంద్రయోగి…యక్షగానంని ఆంధ్రదేశం అంతటా ప్రదర్శించీ…పుణ్యలోకాలకెళ్ళారు.ఆ తర్వాత…వారి గురువు నారాయణతీర్థులు అని అప్పారావుగారు వర్ణిస్తూ ఉంటే ఇంకా వేరే రచన ఎందుకు. రచనెట్లాగా రాయలేం. కాని నచ్చిన ఈ అద్భుతాలు ఇంకేం కావాలి? అపురూపయైన మన కళాకారుడు, బాపుజన్మదినం సందర్భంగా కొచ్చెర్ల జగదీశ్ ఈ విధంగా రాయడం మరో అద్భుతం. ఇంత అందమైన తెలుగు భాషలో రాస్తూ ఉంటే ఇంకా వేరే రాయడం ఎదుకు? కనుక జగదీశ్ రాసిందే చదవండి.

‘గుండ్రంగా రాయడం రాక ఇలా వంకరటింకరగా లాగించేస్తున్నాడు… ఏం తెలివి?’ అనేసుకుని నోట్లో కొంగులూ, కండువాలూ కుక్కేసుకున్నార్ట!

ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా వుంటాయి. కాసేపు  చూస్తే ‘ఏదోవుందిందులో!’ అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేశాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది.

మనం పెట్టే కొమ్ములూ, దీర్ఘాలన్నింటినీ కొత్తరకంగా తగిలించే తెలివి.

పేరంతా రాసేసిన తరవాత చూస్తే ఊరేగింపుకి తయారైన దేవుడిపల్లకీలా వుంటుంది. ఆ నిండుదనం గోదారినించీ, ఆ అందం చందమామనించీ తెస్తాడు.

చూడండి, ఈ కళ కూడా చూడండి.

అంతర్జాతీయ స్థాయి అందాలబొమ్మల అపురూప చిత్రకారుడు…అమరలోకంలో రంభావూర్వశులు రోజూ వాళ్ళ బొమ్మలెయ్యమని సలపాదిస్తూవుండేవుంటారు. తన బొమ్మల్ని చూస్తూ పెరిగాం. తన బొమ్మల్ని చూస్తుండగానే మనలనొదిలి వెళిపోయాడు. మనసులో ఆ బొమ్మ మాత్రం పదికాలాలపాటు పదిలంగా అలానే వుంటుంది. అని జగదీశ్ కొచ్చెర్లకోట నివాళులర్సించారు.

బాపురే బాపు రేఖావ్యాఖ్య

బాపురే బాపు రేఖావ్యాఖ్య

ఆయన అసలు పేరు సత్తిరాజు వేంకట లక్ష్మీనారాయణ. కాని కొద్ది మందికి మాత్రమే తెలుసు. అదే బాపు అని పిలవండి, మొత్తం తెలుగురాష్ట్రాల్లో తెలియని వాడు ఉండడు. ఆయన ఒక అరుదైన అద్భుతం. ఆయన కుంచె కదిలితే చాలు, దేవతలు దిగివస్తారు. బ్రహ్మ సృష్టించిన జీవుల్లో మానవులు ఇంత అందంగా ఉంటారా అన్నట్టు బాపు బొమ్మలు కనిపిస్తాయి. అందమైన అమ్మాయిలను వర్ణించడానికి బ్రహ్మ కూడా ‘బాపు బొమ్మ’ లను సృష్టించాడంటారు.

తిరుప్పావై పాశురాల పారాయణం ‘‘నీళాతుంగ స్తనగిరి…’’ శ్లోకాలతో మొదలవుతుంది.

నీళా తుంగ స్తనగిరి తటీ సుప్తముద్భోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శృతిశతశిర స్సిద్ధ మధ్యాపయంతీ

స్వోచ్చిష్టాయాం స్రజినిగళితం యాబలాత్ కృత్య భుంక్తే

గోదా తస్త్యె నమ యిదమిదం భూయ ఏవాస్తు భూయః

తన ప్రేయసి నీళాదేవి స్తన ద్వయ శిఖరోన్నతముల తీరాన శయనించిన శ్రీకృష్ణుడిని మేల్కొలిపి, వేదాల వివరించిన సూత్రమైన పారతంత్రమును విన్నవించి, తాను ధరించి వదిలిన మాలలచేత బంధించి, ఆ పరంధాముని బలవంతంగా అనుభవించిన గోదాదేవికి నమస్కరిస్తున్నాను ఈ శ్లోకం అర్థం. 

పక్కన బాపు ఈ సందర్భాన్ని చిత్రించిన మనోహర దృశ్యం చూస్తే ఈ కఠినమైన శ్లోకం సులువుగా అర్థమైపోతుంది. ఇక్కడ నీళాదేవి తన వాలుజడతో శ్రీ కృష్ణమూర్తిని ఏ విధంగా బంధించిందో చూడండి. చిత్రం అప్పటి విషయమే కాక అంతకుముందు జరిగిన ఉదంతాన్ని కూడా వివరిస్తుందనడానికి ఉదాహరణ కాలిదగ్గరపడిపోయిన విసన కర్ర. అందాకా విసురుకుని అలసిపోయి ఇద్దరూ నిద్రలోకి ఒరిగారని కళాకారుడు చెబుతున్నాడు.

నీళాకృష్ణులిరువురి ముఖాల్లో ఆనందాన్ని ప్రశాంతతను చూడవచ్చు. బాపు కుంచె పాటలు పాడుతుంది. బొమ్మ చూసే వారితో మాట్లాడుతుంది. బాపు చెప్పదలచుకున్న మాటలను చిలక పలుకుల వలె పలుకుతుంది ఈ బొమ్మ. దీనికి ప్రాణం లేదనగలమా?

తిరుప్పావైలో వివరించిన కొన్ని అంశాలు బాపు బొమ్మల్లో నాకు విపులంగా అర్థమైనాయి. మరే ఇతర వ్యాఖ్యానాలు సొబగులు అవసరం లేకుండా 30 బాపు బొమ్మలు చాలు తిరుప్పావై మీద విశిష్టమైన వివరణగా మిగిలిపోతాయి. బాపు కళారేఖావ్యాఖ్యానం లేకుండా తిరుప్పావై అసంపూర్ణం. తిరుప్పావై మాత్రమే కాదు, రామాయణ మహాభారత భాగవతాలుకూడా అసంపూర్ణం అని నా ప్రగాఢ నమ్మకం.

వాల్ట్ డిస్నీ వలె బాపు యూనివర్సిటీని ఎవరైన స్థాపించి, బాపుశైలి కార్టూన్ లతో రకరకాల కథలు శృంఖలాలు చిత్రిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. బాపు ఒక సకల కళా విశ్వవిద్యాలయం. తన చిత్రాన్ని తానే చిత్రించిన ఈ బాపు చిత్రంలో బాపు తన ఆలోచనాలోచనాలు ఎంత నిశితంగా  దీపింపజేసారో చూడండి. కేవలం నాలుగైదు గీతల్లో తన ముఖ చిత్రాన్ని తానే వేసుకోవడం ఒక అద్భుతం. బాపు చిత్ర వైభవ తిరుప్పావై కథా కథనానికి మూలపురుషులు యశోదాకృష్ణులు. అది కూడా ఎంత బాగా మనకు సాక్షాత్కరింపజేశారో తిలకించండి.

ముఫ్పయి పద్యాలు రచించి, ఏదీ తప్పకుండా పాడి, అందులో వ్యక్తం చేసిన భావాలను సంభావించి అనుభవించి, అనుసరించి, మార్గశీర్షస్నానవ్రతం ఆచరించి, రంగనాథుని రూపాన ఉన్న కృష్ణునే ధ్యానించి, పూమాలలు పా(శురాల)మాలలు ఇచ్చి ఫలితంగా శ్రీరంగనాథుడే తనకు పల్లకీ పంపే భాగ్యాన్ని పొంది, ఆయనలోనేలీనమైన గోదాదేవి భోగించిన రోజు చివరి రోజు. అదే భోగి. కలియుగంలో విల్లిపుత్తూరును వ్రేపల్లెగా మలచి, పక్కన వాగే యమున అనుకున్న గోద సాధించింది. ఆమె సఖులే గోపికలై వ్రతం పాటించి సంసారపాపకూపాలనుంచి బయటపడి కొండంత బలం ఉన్న నాలుగు భుజాల వాడు హరి అండదండలే అందుకున్నారు. ఆతనే హరి, ఆతనే రంగడు, పైనున్న ఆదిశేషుడు గుర్తు. ఆమెనే విష్ణుపత్ని ఆమెనే గోద. చిలుక గుర్తు. చేత వరమాల. అగ్నిహోత్రం, పూలూ పండ్లూ. పసుపు పట్టు వస్త్రాలు. గోద వధువు. చిన్న చిత్రంలో బాపు మనకు గోదారంగనాథుల కల్యాణ దృశ్యాన్ని ఆవిష్కరించారు.

ఉపనిషద్ వేద సారాంశమై అత్యంతగహనమైన తిరుప్పావై అంతరార్థాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. దానికి తగిన దృశ్యాన్ని ఎంచుకోవడం మరొక కష్టం. ఆ ఎంచుకున్న కథావస్తువును తెలియజేసే కథను, కథనాన్ని కదలని బొమ్మలో కనిపించి మనను కదిలింపజేయడం ఇంకా కష్టం. కాని బాపుగారికి ఏ కష్టమూ లేదు. ఆయన భావనా బలాన్ని తెలిపే రంగులను రేఖలను మనకు ఇచ్చిన మహాకళాకారుడు బాపు. పారాణి అద్దిన పాదాలతో వివాహ వైభవాన్ని చూపగలదు బాపు కుంచె. తిరుప్పావై కథానాయకుడు శ్రీకృష్ణుడు బాపు బొమ్మల ద్వారా గోదాగీత గోవిందాన్ని మనకు అందించారు. బాపు ధన్యుడు. బాపు బొమ్మలద్వారా తిరుప్పావైని అనుసంధానించే భాగ్యం కలిగిన మనం ధన్యులం. కింద ఇచ్చిన చిత్రం రామకృష్ణులిద్దరినీ కలిపి చూపే బాపు అద్భుత చిత్రం. ఫలశృతి: బాపు బొమ్మల తిరుప్పావై చూచిన గోపబాలుడు మన పాపాలు బాపు.ఫలశ్రుతిలో భక్తునికి, భగవంతునికి ఉన్న సంబంధం వల్ల ఎవరూ ప్రత్యేకంగా కోర్కెలను కోరాల్సిన అవసరం ఉండదని, భగవంతునిపై ఎంతో స్వతంత్రంతో వ్యవహరిస్తూ ఆయననుంచి కావలసినవన్నీ భక్తులు పొందవచ్చనే భావనకనిపిస్తుంది, అని అప్పారావుగారు నమస్కరించారు.

బాపు గారిభామలు ఇదిగో వీరు. ‘‘వేణు గానం వినిపించే నీ ..

చిన్న కృష్ణయ్య కనిపించడే!మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట…

లేదులేదంచూ లోకాలు చూపాడట… అంత మొనగాడటే…వింతకధలేనటే.. ఏడీ? ? …

క న ప డి తే కనులారా చూ…డా…లి… వా..ని..నీ ..” అని ఆ భామలు పాడుతున్నట్టు అనిపిస్తుంది కదా.

అంతే కాదు. ఈ విధంగా ఒక కవిత కూడా కితాబు గా రచించారు. ‘‘
ఎంతటి రసికుడవంటూ హలం
నవ్వుల జాజులు పూచిన కలం
ప్రతి ఇంటా ఒక బుడుగై జననం
తెలుగు జాతికే బాపుగారొక వరం

సరసమైన రసమైన చిత్ర రసం ఇదొకటి మచ్చుకు.

మూలం. బాపు బొమ్మలు, రసన అప్పారావు,  బాపు అభిమాని మాడభూషి శ్రీధర్ సేకరణ
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles