Thursday, November 7, 2024

తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌నం బాపు బొమ్మ‌

  • సృజనాత్మతకు ప్రతీకలు బాపు చిత్రాలు
  • బాపు-రమణ ద్వయం అద్భుతమైన అధ్యాయం

తెలుగు నాట ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు బాపు.  తెలుగు  వారి సంస్కృతిలో ఓ భాగ‌మైన ఆయ‌న గీత‌, వ్రాత ఎన్న‌టికీ  తెలుగు వారి గుండెల్లో నిలిచి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల‌లో   బ‌హుముఖ ప్ర‌జ్నాశాలిగా పేరు పొందిన ఆయ‌న చిత్రాలు ప్ర‌చురించ‌ని తెలుగు ప‌త్రిక‌లు కానీ, కార్టూన్లు కానీ, పుస్త‌కాలు కానీ లేవంటే అతి శ‌యోక్తి కానేర‌దు. బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. ఆయ‌న 1933 వ సంవ‌త్స‌రం  డిసెంబరు 15 తేదీన   పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో   వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.   1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయ‌వాద ప‌ట్టా పుచ్చుకున్న  ఆయ‌న  అదే ఏడాది  ‘ఆంధ్ర పత్రిక’ దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.

సీతారామ కల్యాణం

చిత్రకారులెవరైనా కుంచెతో బొమ్మలు వేస్తారు. కానీ ఆయన అదే కుంచెతో వెండితెరపై బొమ్మలు గీశారు. ఆ బొమ్మలన్నీ కదిలి ఒయ్యారాలు పోయి, గిలిగింతలు పెట్టి ప్రేక్షకుల గుండెల్లో అపురూప చిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి.  అందుకే ఆయన చలన ‘చిత్ర’కారుడు.

బాపు గీత అద్భుతం

బాపు వేసిన ప్ర‌తి చిత్రం అపురూపం.  అన‌న్య సామాన్యం. వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాలను  ఆయ‌న వేసిన ప్ర‌తి చిత్రం తేట‌తెల్లం చేస్తుంది. బాపుకు  చిత్రలేఖనం అంటే అమిత‌మైన ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది.  పాఠశాల రోజుల్లోనే ‘బాల’ అనే చిన్నపిల్లల   ప‌త్రిక‌ల‌కు   ‘అమ్మమాట వినకపోతే’ అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది.  కాలానుగుణంగా వారి స్నేహ బంధం కూడా  బ‌ల‌ప‌డింది. ఆయ‌న అనేక పత్రికల్లో కార్టూనిస్ట్ గా బాపు బొమ్మలు వేశారు. . బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే.  అలాగే,  రమణ రాత, బాపు గీతతో   వెలువడ్డ ‘కోతికొమ్మచ్చి’ ‘బుడుగు’లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. బాపు వ్యంగ్య చిత్రాల‌లోని వంపు సొంపుల‌ను గ‌మ‌నించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత ఆరుద్ర బాపుకు ఎప్పుడో ప‌ద్యాభిషేకం చేశారు.

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

అంటూ  కూనలమ్మ పదం రాసి  ఆరుద్ర బాపుకు  పద్యాభిషేకం చేశారు. బాపు  బొమ్మలే కాదు,  బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. నేడు ఆయ‌న   చేతివ్రాత కూడా  బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి  మొద‌టిగా అందరికి గుర్తొచ్చే ఫాంటు బాపు ఫాంటు అంటే  అతిశయోక్తి కాదు.  బాపు   గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన చిత్రంలో దర్శకుడిగా ఆయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఆయ‌న సొంతం.

బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితం కాలేదు. 1945 నుంచి బాపు  చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా వేశారు.   నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకం, అన్నమయ్య పాటలు, రామాయణం, భారతీయ నృత్యాలు, తిరుప్పావై  ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు.

పొదుపుగా గీతలు వాడటం, ప్రవహించినట్లుండే ఒరవడి, సందర్భానికి తగిన భావము, తెలుగుదనము బాపు ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న గీసే అమ్మాయిల బొమ్మలు అందానికి నిర్వచనంగా మారి అందమైన అమ్మాయి అంటే బాపు గీసిన బొమ్మ అనడం ఆనవాయితీగా మారింది. 1974 లో ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలో పిల్లల కోసం రామాయణాన్ని తనదైన శైలిలో బొమ్మలతో ఆయ‌న చెప్పారు. దీనికి కొనసాగింపుగా మహాభారతం ను, శ్రీకృష్ట్ణలీలలను కూడా ఆయ‌న రూపొందించారు.

ముళ్ళపూడి వెంకటరమణ కోతికొమ్మచ్చి రచయిత

దిగ్విజయాలకు ‘సాక్షి’

దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో ‘ముత్యాలముగ్గు’ చిత్రానికి  తెలుగు  ప్రేక్షకులు నీరాజ‌నాల‌ర్పించారు.  1967లో సాక్షి   చిత్ర దర్శకునిగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రశంస‌లు  అందుకున్నారు.  ఆయన త‌న కెరీర్లో మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

1969లో బాపు-రమణలు భారీ తారాగణంతో ‘బుద్ధిమంతుడు’ చిత్రాన్ని తీశారు. 1952లో వచ్చిన ‘ద లిటిల్‌ వరల్డ్‌ ఆఫ్‌ డాన్‌ కేమిల్లో’ అనే ఇటాలియన్ చిత్రం  ఆధారంగా రమణ మలిచిన కథ ఈ సినిమాకు ఆధారం.  ఈ చిత్రం  తరువాత వరసగా ‘బాలరాజు’, ‘సంపూర్ణ రామాయణం’, ‘అందాల రాముడు’, ‘ముత్యాలముగ్గు’ చిత్రాలు   తీసి రమణ నిర్మాతగా, బాపు దర్శకునిగా స్థిరపడి పోయారు.  1976లో పింజల సుబ్బారావు బాపుతో తీసిన ‘సీతా కల్యాణం’ ఓ కళాఖండం,  ఒక గొప్ప సంగీత రూపకం. రవికాంత్‌ నగాయిచ్‌ చేత గంగావతరణం చిత్రీకరణ చేసిన విధానం ఆశ్చర్యం.. అద్భుతం. లండన్‌ ఫిల్మ్​ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శనకు నోచుకుంది. 1976 లోనే మరొక కళాఖండం ప్రదర్శనకు నోచుకుంది. అదే సూర్యనారాయణ రాజు నిర్మించిన ‘భక్త కన్నప్ప.’ అలాగే,  భారత కథను సోషలైజ్‌ చేసి జయకృష్ణ నిర్మాతగా బాపు నిర్మించిన ‘మనవూరి పాండవులు’ మరో కొత్త కోణాన్ని చూపించింది. ఇక ‘గోరంత దీపం’ విషయానికొస్తే, వాణిశ్రీ మేకప్‌ లేకుండా నటించటం ఈ చిత్ర విశేషం.   రాజమండ్రి పరిసరాల్లోనే తీసిన మరో చిత్రం ‘తూర్పు వెళ్ళే రైలు’ లో బాలు చేత సంగీత దర్శకత్వం నిర్వహింపజేసారు. పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. మధ్యలో కొన్ని చిత్రాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ,  పెళ్ళి పుస్త‌కం చిత్రం బాపు ద‌ర్శ‌క ప్ర‌తిభ‌కు మ‌రో  నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఈ చిత్రంలోని ఆరుద్ర రాసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట వినిపించని పెళ్లి పందిరి ఉంటుందంటే సందేహ‌మే. 1991లో బాపు ‘మిస్టర్‌ పెళ్లాం’ తీశారు. ఉత్తమ చిత్రంగా నంది బహుమతి వచ్చింది.

బాపుకు బోలెడు పురస్కారాలు

బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం చిత్రం  లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. బాపు దర్శకత్వం వహించిన ‘ముత్యాలముగ్గు’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ బహుమతితో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి ఛాయగ్రాహకుడిగా బహుమతి ల‌భించింది. 1986 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక బహుమతి మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి బాపు స్వీకారించారు. అలాగే,   శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి పుర‌స్కారం  1982 లో ఆయ‌న‌కు ల‌భించింది. వీటితో పాటు  1991 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, 1992  లో అమెరికా తెలుగు అసోసియేషన్  వారిచే శిరోమణి పుర‌స్కారం,  1993లో ‘మిస్టర్ పెళ్ళాం’ చిత్రానికి  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పుర‌స్కారం, 1995 లో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (తానా)  వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల (గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకు గాను ఘన సన్మానం, బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పుర‌స్కారం,  2001 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్  వారిచే జీవిత సాఫల్య పుర‌స్కారం,  2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పుర‌స్కారం, అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా పుర‌స్కారం,  ‘బాలరాజు కథ’ (1970), ‘అందాల రాముడు’ (1973), ‘ముత్యాలముగ్గు’ (1975), ‘పెళ్లి పుస్తకం’ (1991), ‘మిస్టర్ పెళ్ళాం’ (1993), ‘శ్రీరామరాజ్యం’ (2011) చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు, 2013 లో పద్మశ్రీ పుర‌స్కారం ఆయ‌నకు ల‌భించాయి. 

కొంతకాలం  అనారోగ్యంతో బాధపడిన బాపు చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 31 ఆగస్టు 2014 న గుండెపోటుతో మరణించారు. చిత్ర ప‌రిశ్ర‌మ బ‌తికున్నంత కాలం బాపు బ‌తికే ఉంటారు. భార‌తీయ క‌ళారంగానికి చేసిన ఆయ‌న సేవ‌లు ఎప్ప‌టికీ స‌జీవంగా నిలిచే ఉంటాయి. అలాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌క దిగ్గ‌జం తెలుగు వాడు కావ‌డం తెలుగు వారు చేసుకున్న పుణ్య ఫ‌లం.

(డిసెంబ‌ర్ 15 ద‌ర్శ‌కుడు బాపు జ‌యంతి సంద‌ర్భంగా )

దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌

7794096169

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles