- కర్నూలు జిల్లా దేవరగట్టు లో దసరాకి కర్రలతో కొట్టుకునే ఆచారం
- తలలు పగలకొట్టుకునే ఆయవాయితీకి స్వస్తి చెప్పాలి
మనమెంతో ఆధునికకాలంలో ఆధునిక జీవితాన్ని గడుపుతున్నామని అనుకుంటున్నాము. కానీ మానసికంగా, ఆచరణలో మాత్రం ఎంతోవెనుకబడి ఉన్నాము అనడానికి ఎన్నొ ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో ప్రతిసంవత్సరం దసరాకి దేవుని కొరకు ఇనుప పొన్నులు తొడిగిన కర్రలతో కొట్టుకోవటం, తలలుపగలటం , ప్రాణాలుపోగొట్టుకోవటం ఏకాలపు సంప్రదాయం?
అలాగే చదువులకు కేంద్రమైన తిరుపతిలో తిరుపతి నడిబొడ్డున గంగమ్మ తిరునాళ్లపేరుతో, తిరునాళ్ళు జరిగే సమయంలొ మొగవాళ్ళు ఆడవేషాలువేసుకొని తిరగటం, పిల్లలకు పెద్దలుకూడా మొఖాలకు వికృతంగా సున్నపుచుక్కలు, నల్లబొట్లు పెట్టుకొని తిరగటం, వేలాది కోళ్లను, గొర్రెలను గుడిదగ్గర, నడిరోడ్డు మీద చంపటం, చంపేటప్పుడు వాటిఅరుపులు, తిరునాళ్ల చివరిరోజు గంగమ్మని భక్తులు బండబూతులు తిట్టడము ….ఏ నాగరికతను తెలియచేస్తుంది?
అందులొ తిరుపతి ఆధ్యాత్మికకేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. చదువులకు నిలయంగా మారింది. అలాంటిచోట ఇలాంటి అనాగరిక చేష్టలను అరికట్టవలసిన అవరం ఎంతైనా ఉంది.
1930 ప్రాంతములొ తెనాలికి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన హేతువాద పితామహుడు త్రిపురనేని రామస్వామి అంతకు ముందు కొన్ని పండగలకు అక్కడజరిగే జంతుబలులను జరగకుండా ఆపగలిగారు. అలాంటివారు ముఖ్యమంత్రులు అయితే ఇలాంటి అనాగరిక ఆచారాలను అరికట్టగలిగేవారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అనాగరిక ఆచారాలను అరికట్టేవిధంగా చర్యలు తీసుకోవాలి.
దేవరగట్టులో గత 11 సంవత్సరాలుగా జరిగిన సంఫటనలను పరిశీలించినట్లయితే 12 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తొక్కిసలాటలో చిన్నపిల్లలుకూడా చనిపోయారు. ఈ 11 సంవత్సరాలలో వెయ్యిమందికి పైగా తలలు పగిలాయి. ఉద్యోగులు స్ట్రైకు అంటే రాత్రికిరాత్రి హౌస్ అరెస్టు చేసి ఆపగలిగే ప్రభుత్వానికి, అలాగే ప్రతిపక్ష నాయకుల ఉరేగింపులను ఆపేందుకు నాయకులను రాత్రికి రాత్రి అరెస్టు చేసి ఉరేగింపులను ఆపగలిగే శక్తి ఉన్న ప్రభుత్వానికి, ఒక మూఢ నమ్మకాన్ని ఆపే శక్తి కచ్చితంగా ఉంది. చిత్తశుద్ధి కావాలి. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా పూనుకోవాలి.
కోవెలకుంట్ల దగ్గర గోవిందిన్నె గ్రామంలో ఒక ఉత్సవం సందర్భంగా వేలాదిగా ఎద్దులను, ఆవులను, దున్నలను బలి ఇచ్చే ఉత్సవాన్ని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి వెళ్ళగా ఆమె నిపుణులతో చర్చించి, ఆ బలులను పూర్తిగా నిషేదించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటె ఈ దేవరకొండ బన్నీ ఉత్సవంలో కర్రలతో కొట్టుకొనే అనాగరిక ఆచారాన్ని ఆపటం అంత కష్టమైన పనేమీ కాదు.
నార్నెవెంకటసుబ్బయ్య