హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ వదిలి బయటికి రాకపోవడానికి బలమైన కారణం ఉందని, సోదాలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అక్కడ ఏదో నిధి ఉందని, డీజీపీ తక్షణం అక్కడ సోదాలు జరపాలని సూచించారు.
అవి బయటపడితే ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. రైతులు సహా ఏ వర్గాన్నీ సీఎం పట్టించుకోవడంలేదని ఇంతకూ ఆయన ఎవరికోసం పనిచేస్తున్నారో తెలియదని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో సీఎం మాటతప్పారని, రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి రూ. 72 వేలు చెల్లించవలసి ఉందని సంజయ్ అన్నారు.
మైలార్ దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ పై అధికారపక్షం వారు దాడి చేశారని తిరిగి దాడి చేయడం తమకు పెద్ద విషయమేమీ కాదని, తాము తలచుకుంటే టీఆర్ఎస్ నేతలు తిరగలేరని సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ను గద్దె దించి, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే ప్రజల ఆలోచనగా ఉందని బండి అన్నాయి.
ఆ ఫలితాలకే అంత ఇదా? : తలసాని
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికలలో స్థానాలు పెరగడంతోనే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు బీజేపీ ఉరుకులు, పరుగులు పెడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎన్నికలలో గెలిచిందో అందరికీ తెలిసిందేనని ఆయన విజయవాడలో అన్నారు. ఆ పార్టీ రాజకీయాలు తాత్కాలికమేమని, తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం ఉండదని అన్నారు.