ప్రజా సమస్యలే ధ్యేయంగా బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ప్రజల్లో ఎండగట్టటమే లక్ష్యంగా బండి సంజయ్ 31 రోజుల పాటు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర 386 కిలోమీటర్లు పాద యాత్ర కొనసాగనుంది. ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మక్తల్, జడ్చర్ల, దేవరకద్ర, కల్వకుర్తి, మహేశ్వరం నియోజకవర్గాల వారీగా సాగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదటి దశ ప్రజా సంగ్రామయాత్రను పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించారు. ఈసారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపురం ఆలయం నుంచి గురువారంనాడు ప్రారంభం అయ్యింది. గడీలు బద్దలు కొడతామని ప్రతిజ్ఞ చేశారు. అవినీతి, నియంత, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్టు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. 31 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర ముగించనున్నారు బండి సంజయ్. పాదయాత్ర సందర్బంగా ఊరూరా రచ్చబండలు, నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. పాదయాత్రకు జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు పాల్గొంటారని బిజెపి శ్రేణులు అంటున్నాయి.