- హిందువులను పిరికివాళ్లుగా చూడొద్దని హితవు
- తిరుపతిలో బీజేపీదే విజయమని ధీమా
ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని ప్రభుత్వాన్నిఉద్దేశించి అన్నారు. బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే ప్రభుత్వానికి కష్టాలు తప్పవని సంజయ్ ధ్వజమెత్తారు. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆలోచించి ఓటు వెయ్యండి
తిరుపతి ఉపఎన్నికలో ఓటేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని బండి సంజయ్ అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే తిరుపతిలో వస్తాయని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. దేవాలయాల దాడులపై సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
సంజయ్ కు తిరుపతి ప్రచార బాధ్యతలు?
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం తరువాత ఊపు మీదున్న బండి సంజయ్ కు బీజేపీ హైకమాండ్ అదనపు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పాదయాత్ర శ్రీకారం చుట్టబోతున్న సంజయ్ కు తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు, సవాళ్లు కాక రేపాయి. మార్చిలో తిరుపతి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటిఫికేషన్ వెలువడకముందే సంజయ్ ను తిరుపతికి పంపి ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పలువురు అగ్రనాయకులు కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.