విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేక జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉద్యమం దినదిన ప్రవర్ధమానమవుతోంది. సకల జనులు ఆందోళనల బాట పట్టారు. రాష్ట్ర బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తుతోంది. విద్యా వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలపడం మంచి పరిణామం.
స్థంభించిన సకల సంస్థలు
అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడ స్థంభించాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగక తప్పలేదు. ఈ ఉద్యమం తీరు మొన్నటి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలపింప చేస్తోంది. సందట్లో సడేమియా లాగా వివిధ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు కూడా భగ్గుమన్నాయి. ఎవరి కొలువు వాళ్లు ఏర్పరచుకున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క ఎజెండా. పైకి స్టీల్ ప్లాంట్ ఉద్యమం అని కనిపించినా ఎవరి లెక్కలు వారికున్నాయి. కలసి పోరాడాల్సిన ఇటువంటి సమయంలోనూ రాజకీయ స్వార్ధాలతో అల్లరి సృష్టించుకుంటే నష్టపోయేది ఆంధ్రప్రజలే.
Also Read : కైకలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
విశాఖ ఉక్కు కోసం వజ్రసంకల్పం
స్టీల్ ప్లాంట్ స్థాపనకు గతంలో వజ్ర సంకల్పంతో అందరూ ఉద్యమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కదిలి వచ్చింది, కలిసి వచ్చింది. అదే స్ఫూర్తి నేడూ కావాలి. లేకపోతే, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క ప్రయోజనం కూడా నెరవేరదు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత విశాఖపట్నం పర్యటన సందర్భంలో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. పట్టుదలకు మారుపేరుగా పిలువబడే జగన్ మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకుంటారనే విశ్వాసం చాలామందికి వుంది. రాష్ట్ర బిజెపి నేతలంతా ఢిల్లీ పెద్దలకు నచ్చచెప్పి, ప్రైవేటీకరణను ఆపించాలి.
నిపుణుల సూచనలు కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి
రాష్ట్ర ప్రభుత్వం, నిపుణులు సూచించిన అంశాలను కేంద్రం పాటించాలి. స్టీల్ ప్లాంట్ పూర్తిగా భారత ప్రభుత్వ రంగ సంస్థ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవు. ఒత్తిడి తేవడం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదన్నది అందరికీ తెలిసిందే. దేశంలోని అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి సంపూర్ణంగా సిద్ధమైన కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో వెనకడుగు వేస్తుందన్నది అనుమానమే. స్టీల్ ప్లాంట్ తో పాటు పోర్ట్ కూడా అదే బాటలో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెల్లఏనుగులై పోయాయనే బలమైన భావనలోనే కేంద్రం ఉంది.
Also Read : ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రానికి నిధులు
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షల కోట్లు సృష్టించగలమనే విశ్వాసంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆదానీలు, అంబానీలు వంటి ప్రైవేట్ వ్యాపారస్తులను బాగుచేయడం కోసమే ఈ నాటకాలని ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గగ్గోలు పెట్టడం తప్ప, చట్ట సభల్లో నిలదీసి, నిర్ణయాలను ఆపే శక్తి దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీకీ లేదు. అదే అత్యంత విషాదం. బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కష్టమని నాటి మహానేతలే సెలవిచ్చారు. ఆ మాటలు ప్రతి దశలో ఇప్పుడు అర్ధమవుతున్నాయి. మెజారిటీ ఎక్కువగా ఉన్న అధికార పార్టీలు ఏకస్వామ్యంగానే వ్యవహారిస్తాయని నేటి మేధావులు కూడా వాపోతున్నారు.
కాపాడుకునే అవకాశం ఇప్పటికీ ఉంది
స్టీల్ ప్లాంట్ సమస్య చేయిదాటి పోలేదు. చిన్న చిన్న సంస్కరణలు, కాస్త సహకారంతో పెట్టుబడుల ఉపసంహరణ లేకుండానే లాభాల బాట పట్టించవచ్చని కేంద్రానికి తెలియనిది కాదు. తను అనుకున్నది సాధించాలనే పట్టుదల తప్ప ఇంకేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువిచ్చే అలవాటు పోయి కూడా చాలాకాలమైందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం – రాష్ట్రాల మధ్య సత్ సంబంధాలు అంటే, హక్కుల పరిరక్షణ ఒక్కటే కాదు.రాష్ట్రాల గోడు కూడా విని,సలహాలు, సూచనలు పాటించి, సమస్యలను పరిష్కరించాలి.
Also Read : అమరావతి కథల మంచె సత్యం శంకరమంచి
కేంద్ర మొండి పట్టు వీడాలి
మిగిలిన అంశాలు ఎలా ఉన్నా, స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం మొండిపట్టు వీడాలి. రాజకీయాలు మరచి అన్ని పార్టీలూ కలిసి సాగాలి. ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయకపోతే, స్టీల్ ప్లాంట్ దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. పార్టీలు కొట్టుకోవడం వల్ల, నేతలు ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ఉద్యమాలు నిర్వహిస్తున్న నాయకులపై ప్రజలకు విశ్వాసం కలుగడం లేదు. ఈ ఉద్యమ తొలి విజయం ప్రజా విశ్వాసాన్ని పెద్ద ఎత్తున పొందడంలోనే ఉంది. దాన్ని సాధిస్తే, ఆన్నీ సాధించవచ్చు. కేంద్రం కూడా తప్పకుండా దిగి వస్తుంది.రాష్ట్ర బిజెపి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఒక్కొక్క చోట ఒక్కొక్క వైఖరి పాటిస్తే, ఆ పార్టీకీ నష్టం, రాష్ట్రానికీ నష్టం.
దిల్లీలో నిరసన గళం వినిపించాలి
ఢిల్లీ వీధుల్లోనూ గళాన్ని వినిపించి, కేంద్ర పెద్దలు దిగివచ్చేట్లు చేస్తామని ఉక్కు పరిరక్షణ వేదిక నాయకులు అంటున్నారు. నెలల తరబడి వేలాది రైతులు ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న ఉద్యమానికే దిక్కు లేదు, ఈ ఉక్కు ఉద్యమాన్ని కేంద్రం లెక్క చేస్తుందా? అనే మాటలు వినపడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో క్రమంగా బిజెపికి వ్యతిరేక వాతావరణం ఏర్పడుతోందని, ఇటువంటి నిర్ణయాలే దానికి ప్రధాన కారణమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి ఇదే పంథాలో కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఉక్కు సంకల్పమే విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుతుందని మెజారిటీ మేధావుల అభిప్రాయం. త్వరలో అన్ని బండారాలు బయటపడకమానవు.
Also Read : ఉక్కు సంకల్పమే శరణ్యం