‘నా వారసుడు వచ్చాడు. నేనిక సంతోషంగా పక్కకు తప్పుకోవచ్చు’ అని నటదిగ్గజం బళ్ళారి రాఘవతో బహిరంగంగా మెప్పుపొందిన నటుడు బందా కనలింగేశ్వరరావు. చెన్నపురి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన `చిత్రనళినీయం`లో బందా బాహుకుని పాత్రపోషణకు పరవశించిన ఆయన మదరాసు నుంచే వెలువడే `మెయిల్` దిన పత్రికలో అభినందన పూర్వక పెద్ద సమీక్ష రాశారు. అనంతర కాలంలో వీరిద్దరు కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. రాజరాజనరేంద్రునిగా బళ్లారి, సారంగధరుడిగా బందా చక్కటి సమీకరణగా చెప్పుకునేవారు. శ్రీరాముడు, భరతుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, అభిమన్యుడు, కాళిదాసు, బిల్వమంగళుడు, ప్రతాపరుద్రుడు, సలీం, గిరిశం, అల్లూరి సీతారామ రాజు పాత్రల పోషణతో బందా ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్నారు.
ఆకాశవాణితో బంధం
ఆకాశవాణి నాటక విభాగాధిపతిగా, ముఖ్యంగా విజయవాడ కేంద్రంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. కాళ్లకూరి నారాయణరావు, గురజాడ అప్పారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేదం వేంకటరాయశాస్త్రి, మొక్కపాటి నరసింహం లాంటి ప్రముఖుల నాటకాలు, రచనలను నాటకీకరించడంలో ఆయన చూపిన నైపుణ్యం ప్రశంసనీయం. ఆయా రచనలను అప్పటికే చదివిన వారికి, తిరిగి రేడియోలో వింటే ఎక్కడా ఎలాంటి లోటు ఉందనిపించకూడదు. అందుకు వాటిపై సాధికారికత అవసరం. దానిని సాధించారు బందా.
రేడియో శ్రవణ మాధ్యమం కనుక సమయపాలన చేస్తూ, ఏ పాత్రకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నిభాయించుకురావడం కష్టతరమే. అయితే ఆయన స్వయంగా నటుడు, రచయిత కనుక దానిని సులువుగానే సాధించగలిగారు. రంగస్థలంపై గంటల కొద్దీ సాగే ప్రదర్శనను రేడియోలో గరిష్ఠంగా గంటకు కుదించడం నేర్పుతో కూడినపని.
సుమారు మూడు-నాలుగు గంటల నిడివి గల కాళ్లకూరి వారి `వరవిక్రయం` నాటకాన్ని 55 నిమిషాల వ్యవధితో రమణీయ శ్రవ్యనాటకంగా మలిచారు. గురజాడ వారి `కన్యాశుల్కం`ను 58 నిమిషాలకు, చిలకమర్తి వారి `గణపతి` నవలను 60 నిమిషాలకు మలచారు. సుదీర్ఘమైన రచనలను ఔచిత్యవంతంగా ఇలా మూడో వంతు,నాలుగో వంతుకు కుదించడం సాహోసోపేతంగానే చెబుతారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రేతరాల్లోని ఆకాశవాణి కేంద్రాల తెలుగు విభాగాలు నేటికీ ఆయా నాటకాలను పున: ప్రసారం చేస్తుండడాన్ని బట్టి వాటిని శ్రోతల దగ్గరికి చేర్చిన బందా వారి నైపుణ్యం విదితమవుతోంది. ఆయా రచయితల ప్రతిభా విశేషాలతో పాటు వాటికి రేడియో `అనుసరణ`లో బందా అనుసరించిన నైపుణ్యం వాటికి శాశ్వతత్వం చేకూర్చాయి. ప్రఖ్యాత విద్వాంసులు వేదం వేంకటరాయశాస్త్రి రాసిన `బొబ్బిలియుద్ధం` నాటకానికి, పానుగంటి లక్ష్మీనరసింహారావు `విప్రనారాయణ` నాటకానికి శ్రవ్యరూపం ఇచ్చారు. నాటకాలను సమర్పించడమే కాకుండా `వరవిక్రయం` (వకీలు), `కన్యాశుల్కం`(సౌజన్యారావు) సహా అనేక నాటకాల్లో పాత్రలు పోషించారు.
సినీ ప్రస్థానం
విద్యార్థి జీవితం నుంచి నటన పట్ల ఆసక్తితో అప్పటికే ప్రముఖ నటులతో కలసి నటించిన బందా `ద్రౌపదీ మానసంరక్షణ` (1935) చిత్రంలో శ్రీకృష్ణ పాత్రధారణతో చలనచిత్ర రంగం ప్రవేశం చేశారు. సారంగధర, కాలచక్రం, పాదుకాపట్టాభిషేకం, బాలనాగమ్మ తదితర చిత్రాలలో నటించారు. కొన్నేళ్లకు అక్కడి వాతావరణంతో ఇమడలేక ఏలూరు చేరుకున్నారు. రంగస్థలం నుంచి వెండితెరకు వెళ్లినవారు తిరిగి వెనక్కి రావడం అరుదైన సన్నివేశమే. కానీ బందా వారి తత్వం అందుకు భిన్నమైనది. నాటకాలు, సినిమాల వారిపై గల అపోహలు, విపరీతమైన దుష్ప్రచారం ఉన్న కాలంలో వాటికి దూరంగా ఉన్నారు. వదంతులకు సరైన సమాధానం చెప్పేలా ఆయన నడవడి ఉండేదట.`అంత పెద్ద నటుడైన మా బందా కనీసం తాంబూల సేవనం కూడా చేయడు`అని ఆయన మిత్రులు, ఆత్మీయులు ఘనంగా చెప్పుకునేవారు.
నాటక సమాజం
రంగస్థలాన్ని ఆరో ప్రాణంగా భావించిన బందా 1939లో `కాలేజీ ఆఫ్ డ్రమెటిక్స్` అనే ఒక సంస్థను నెలకొల్పారు. అటు తర్వాత `ప్రభాత్ థియేటర్స్` పేరుతో నాటక సమాజాన్నిప్రారంభించి మూడు దశాబ్దాలకు పైగా యువ కళాకారులకు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు. నటుడి నోటి వెంట వచ్చే ప్రతి అక్షరం, ప్రతిపదం, ప్రతి పద్యం శ్రోత మనసులోకి సూటిగా దూసుకు వెళ్లాలని యువ కళాకారులకు సూచించేవారు. నండూరి సుబ్బారావు తదితర కళాకారులు బందా వారి సౌజన్యంతోనే ఆకాశవాణిలో అడుగుపెట్టి శభాష్ అనిపించుకున్నారు. బందా కేంద్రరాష్ట్ర సంగీత నాటక అకాడమీలకు, ఆంధ్రనాటక కళాపరిషత్ సభ్యుడిగా వ్యవహరించారు. వివిధ దేశాలలోని రంగస్థల కళారీతులు అధ్యయనంలో భాగంగా 1955లో రష్యా, పిన్ లాండ్, చెకొస్లొవేకియా దేశాలు పర్యటించి నాటక, నాట్య కళలపై ఉపన్యసించారు. ఆ మరుసటి సంవత్సరం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక ప్రయోక్తగా ప్రవేశించి దాదాపు పుష్కరకాలంగా ఎన్నో నాటకాలకు రూపకల్పన చేశారు.ఆయన రూపొందించిన నాటకాలు నేటికీ ప్రసారం కావడంలోనే ఆయన ప్రత్యేకత తెలుస్తోంది. ఆయా రచయితల ప్రతిభా విశేషాలతో పాటు వాటికి రేడియో `అనుసరణ`లో బందా అనుసరించిన నైపుణ్యం వాటికి శాశ్వతత్వం చేకూర్చాయి.
పురస్కారాలు
ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి (1963) పురస్కారం అందుకున్నారు. జయపూర్ మహారాజా `నటశేఖర` బిరుదుతో సత్కరించారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ గౌరవపట్టం బహూకరించింది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణత తమ `శశిదూతం` కావ్యాన్నిబందా వారికి అంకితం ఇచ్చారు.
కూచిపూడితో
కూచిపూడితో బందా వారి అనుబంధం విడదీయలేనిది. కూచిపూడి నాట్యసంప్రదాయం ప్రచారానికి విశేషకృషి చేశారు. అక్కడ సిద్ధేంద్రయోగి కళాక్షేత్రం స్థాపించారు. కూచిపూడి సంప్రదాయంలో నాటకాలను ఆకాశవాణి ద్వారా రికార్డు చేయించారు. ఆ నృత్య సంప్రదాయం విశ్వవ్యాప్తం కావడం వెనుక బందా వారి చొరవ మరువలేనిది. ఆయన పేరిట నేటికి ఉత్సవాలు నిర్వహించడాన్ని బట్టి కూచిపూడి కళకు తన జీవితాన్ని అంకితం చేసిన తీరు తెలుస్తుంది.
ప్రజాసేవ
బందా కేవలం కళాకారుడు, కళారాధకుడే కాదు. ప్రజాహైతైషి కూడా.న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వెంటనే ఏలూరులో న్యాయవాద వృత్తి సాగిస్తూనే మరోవంక నాటక ప్రదర్శనలు, ప్రజాసంక్షేమ పనులు చేపట్టారు. స్వగ్రామం ఆటపాకలో వేదపాఠశాల నెలకొల్పారు. శివాలయం కట్టించారు. మంచినీటి చెరువు తవ్వించారు.
కృష్ణాజిల్లా ఆటపాక గ్రామంలో 1907 జనవరి 20న పుట్టిన బందా కనక లింగేశ్వరరావు ప్రాథమిక విద్యను స్వగ్రామంలో, ఉన్నత విద్యను ఏలూరు, మచిలీపట్నంలో పూర్తి చేశారు. మదరాసు లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. అక్కడ నాటక సంఘానికి కార్యదర్శిగా ఎన్నికైన ఆయన, చదువు పూర్తయిన తరువాత ఏలూరు తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్వల్ప అస్వస్థతతో 1968 డిసెంబర్ 3వ తేదీన నటరాజులో ఐక్యమయ్యారు.
(ఈ నెల 20న బందా కనకలింగేశ్వరరావు జయంతి)