(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లో జరగనున్న ఎన్నికలలో బ్యాలట్ పత్రాలనే వినియోగిస్తారని తెలంగాణ ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. కోవిద్ పరిస్థితిని గమనంలోకి తీసుకొని, ఎన్నికలకు ఉన్న వ్యవధిని గుర్తించి, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి తెలియజేశారు. ఈవీఎంలా, బ్యాలట్ పేపరా అనే మీమాంసపై ఖరారు నిర్ణయం తీసుకునేందుకు పార్థసారథి, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ లు భేటీ అయ్యారు. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను పార్థసారథి తెలుసుకున్నారు. మెజారిటీ పార్టీలు బ్యాలట్ పేపర్ ని వినియోగించాలని కోరుకున్నాయని ఆయన వెల్లడించారు.
బ్యాలట్ వైపే మెజారిటీ పార్టీల మొగ్గు
మొత్తం 50 రాజకీయ పార్టీలను సంప్రదించాం. వాటిలో గుర్తింపు పొందిన పార్టీలు 11. సంప్రదించిన పార్టీలలో మొత్తం 16 పార్టీలు బ్యాలట్ పత్రాలను వినియోగించాలని కోరాయనీ, మూడు మాత్రం ఈవీఎంల వైపు మొగ్గు చూపించాయనీ పార్థసారథి అన్నారు. పైగా, పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలను నెలకొల్పడానికి అనుసరించవలసిన పద్ధతి చాలా సమయం తీసుకుంటుందని చెప్పారు. ఓటింగ్ యంత్రాలకు మొదటి దశ, రెండో దశ తనిఖీలు చేసిన తర్వాతనే ఉపయోగించవలసి ఉంటుందని తెలిపారు. ఈ దశలలో ఓటింగ్ యంత్రాలను ఉత్పత్తి చేసిన సంస్థల ప్రతినిధులూ, రాజకీయ పార్టీల ప్రతినిధులూ, ఎన్నికల సంఘం ఉద్యోగులూ పాల్గొనవలసి ఉంటుందనీ, ఈవీఎంల, వీవీప్యాట్స్ లను శుభ్రం చేయడానికీ, ప్యాకింగ్ చేయడానికీ, ప్యాకింగ్ లను విప్పడానికి కూడా చాలామంది మనుషులు కావలసి ఉంటుందని చెప్పారు. దీని వల్ల సామూహికంగా కోవిద్ వ్యాపించే ప్రమాదం ఉన్నదనీ, దీని కంటే బ్యాలట్ పత్రాల వల్ల ప్రమాదం తక్కువనీ పార్థసారథి వివరించారు.
భారత ఎన్నికల సంఘం అనుమతి
వీవీసీఏటీఎస్ లు ఉత్పత్తి చేయడానికి తమకు భారత ఎన్నికల సంఘం అనుమతి అవసరమని కంపెనీలు తెలియజేశాయి. ఆ ప్రకారమే భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశామనీ, ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నామనీ చెప్పారు. నిరుడు ఎంపీటీసీలకూ, జెడ్ పీటీసీలకూ, గ్రామపంచాయితీలకూ, యూఎల్ బీలకూ ఎన్నికలను బ్యాలట్ పత్రాల ద్వారానే నిర్వహించామని పార్థసారథి గుర్తు చేశారు.