ఆయన పేరు విన్నంతనే స్ఫురించేది `సత్య హరిశ్చంద్రీయం`. దాని పేరు తలచినంతనే గుర్తుకు వచ్చేది బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. ఆ రెండు పేర్లు అంతలా మిళతమయ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులు నుంచి బలిజేపల్లి లక్ష్మీకాంతం వరకు పద్దెనిమిది మంది `హరిశ్చంద్ర` నాటకాలు రాసినా, బలిజేపల్లి వారి `సత్యహరిశ్చంద్రీయం` ప్రసిద్ధి పొందింది. 1912లో రాసిన ఈ నాటకం అయనకు అపారమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. తిరుపతి వేంకటకవుల `పాండవో ద్యోగం`, చిలకమర్తి లక్ష్మీనరసింహం `గయోపాఖ్యానం` సరసన నిలిచిన నాటకం ఇది. గయోపాఖ్యానం మాదిరిగానే హరిశ్చంద్రీయం నాటకం ఆ రోజుల్లోనే లక్ష ప్రతులు అమ్ముడయ్యాయట.
జానపదులను ఆకర్షించిన నాటకం
నాగరీకులనే కాకుండా జానపదులను కూడా బాగా ఆకర్షించిన నాటకంగా దీనిని చెబుతారు. సన్నివేశ కల్పనలో దానికి అదే సాటి అని, సంభాషణల్లో దానికి మించిన నాటకంలేదని విమర్శకులు అంటారు. ఈ నాటకం ప్రదర్శించని పల్లెకానీ, పట్నం కానీలేదు. కొన్ని సందర్భాలలో ఆయా నాటకాలను పూర్తిగా ప్రదర్శించలేకపోయినప్పటికీ `పాండవోద్యోగం`లో శ్రీకృష్ణ మందిరంలో పడక దృశ్యం, హరిశ్చంద్రుడు కాటికాపరిగా మారిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. భక్తసిరియాళుడి కథా ఇతివృత్తంగా రాసిన `బుద్దిమతీ విలాసం`బలిజేపల్లి వారి తొలి నాటకం.సంస్కృతంలో భవభూతి రచించిన `ఉత్తర రామచరిత` ఆధారంగా రాసిన `ఉత్తరరాఘవం` రెండవ నాటకం. `సాత్రాజితీయం` ఆయన రాసిన మరో నాటకం. అయితే ఇది`సత్యాకృష్ణుల కల్యాణం`గానే ప్రదదర్శితమైంది
నటుడిగా…
బలిజేపల్లి మంచి ఉత్తమ నాటక కర్తే కాక ఉత్తమ నటుడు కూడా. తాను రాసిన నాటకాలలోని కథానాయకుడి పాత్రలను ఆయనే పోషించేవారు. హరిశ్చంద్ర పాత్రను ఎంతో హుందాగా పోషించేవారు. అనంతర నట ప్రముఖులు డీవీ సుబ్బారావు, మల్లాది సూర్యనారాయణ లాంటి వారు ఈ పాత్ర పోషణలో ఆయననే వరవడిగా తీసుకునేవారని చెబుతారు. రంగస్థల మహానటుడు మల్లాది బలిజేపల్లి వారి పద్యాలతో పాటే జాషువా పద్యాలను కలిపి హరిశ్చంద్ర నాటకాన్ని మరింత రక్తింకట్టించేవారు.
కృష్ణపాత్రలో మనోహరం
అలాగే `సాత్రాజితీయం`లోని కృష్ణ పాత్రలో బలిజేపల్లి మనోహరంగా కనిపించే వారట. ఆయన ఎన్ని పాత్రలు ధరించినా `సత్యహరిశ్చంద్ర`లోని నక్షత్రకుడిగా మాత్రం అనితర సాధ్యంగా నటించేవారట. ఆ పాత్రలో ఆయన నిరుపమానంగా ప్రకాశించి చిరకీర్తిని ఆర్జించారు. ఆయన రంగస్థల ప్రదర్శన ఇస్తుంటే ఎంతటి జడివాన కురిసినా ప్రేక్షకులు కదలేవారు కాదు. 1930లో రంగూన్ లో ప్రదర్శితమైన హరిశ్చంద్ర నాటకం అందుకు ఉదాహరణ.
Also Read : కవితా కళానిధి బలిజేపల్లి
నక్షత్రకుడిలో పరిణామం
హరిశ్చంద్రుడు కాటికాపరిగా వీరబాహువుకు అమ్ముడైపోయిన తరువాత ఆ ధనాన్ని విశ్వామిత్రునికి అందచేయాలని కోరినప్పుడు, అప్పటి వరకు అయిన దానికి కానిదానికి వేధిస్తూ వచ్చిన నక్షత్రకునిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. సర్వం సహా చక్రవర్తి హరిశ్చంద్రుడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హీనమైన దాస్యవృత్తికి అంగీకరించి అమ్ముడుపోయిన సన్నివేశంలో నక్షత్రకుడిలో మానవత్వం మేల్కొంటుంది. ఆయనలోని అసలు మనిషి వెలికి వస్తాడు. ఆయనలోని కాఠిన్యం కరిగిపోతుంది. సత్యధర్మరక్షణ కోసం జీవితాన్నే త్యాగం చేసిన హరిశ్చంద్రుడు తన తన గురువు విశ్వామిత్రుడి కంటే ఉన్నతుడనే భావన కలుగుతుంది.ఎంతో విలపిస్తూ హరిశ్చంద్రుడికి వీడ్కోలు పలుకుతున్న నక్షత్రకుడిగా బలిజేపల్లి ప్రదర్శించిన నటన అనన్యసామాన్యం. మహోన్నమైన ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులంతా కన్నీరు మున్నీరయ్యారు. మబ్బులు కమ్మి చినుకులు మొదలై, కుంభవృష్టిగ మారినా ప్రేక్షకులు కదలలేదట. వారి ఉత్సాహాన్ని చూస్తూ వర్షంలోనే నాటకం చివరికంటా సాగింది.
సినీనటుడుగా….
తెలుగు సినీరంగం ఆయన అఖండ ప్రతిభకు స్వాగతం పలికింది. ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. నటనతో పాటు కొన్ని చిత్రాలకు కథలు, మాటలు, పాటలు అందించారు. హరిశ్చంద్ర,అనసూయ,మళ్లీపెళ్లి,జరాసంధ,భూకైలాస్, వరవిక్రయం, విశ్వమోహిని, బాలనాగమ్మ,తసిల్దార్, బ్రహ్మరథం, రక్షరేఖ, సీతారామజననం, భీష్మ, నా చెల్లెలు, మంజరి, జీవితనౌక లాంటి చిత్రాలు ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనాలు. `వరవిక్రయం`లో ఆయన పోషించిన సింగరాజు లింగరాజు పాత్ర చిరస్మరణీయం.
దేశభక్తుడు
బలిజేపల్లి దేశభక్తుడు,స్యరాజ్య సమరయోధుడు. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలతో ఉద్యమాన్ని తేజోవంతం చేసినందుకుఆంగ్లేయుల ప్రభుత్వం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అంతకుముందు 1922లో చల్లపల్లి రాజావారి సహకారంతో గుంటూరులో `చంద్రిక ముద్రణాలయం` నెలకొల్పారు.
జీవిత విశేషాలు
గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని ఇటిపంపాడులో 1881 డిసెంబర్ 23న జన్మించిన లక్ష్మీకాంతం మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య ఇంటపెరిగారు. మేనత్త సరస్వతమ్మ వద్ద భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. భారత భాగవత రామాయణాల్లో ఆమెకు విశేష పాండిత్యం. మేనల్లుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నెన్నో కథలు, గాథలు,పురాణ రహస్యాలను బోధించి, భావి కాలంలో ఓ గొప్ప కవి. నటుడి ఆవిర్భావానికి సహకరించారు. అటు అమ్మా నాన్నలు, ఇటు మేనత్త శిక్షణతో బలిజేపల్లి చిన్నతం నుంచే సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పసాగారు. కర్నూలులో మెట్రిక్యులేషన్ పూర్త చేసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం పొందారు.
అధ్యాపకుడిగా ఉద్యోగం
కానీ నచ్చక దానిని వదిలేసి గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసి అదీ నచ్చక దానినీ వదిలేశారు. ఆయన వైఖరిని చూసి` స్థిరత్వం లేనివాడని, చంచల స్వభావుడని ` బంధువులు, అయినవారు అంటుండేవారు. కానీ ఆయనలో కళాతృష్ణ నాటకరంగవైపునకు నడిపించింది. అర్థరూపాయి ప్రయోజనం లేక పోయినా అరవై మైళ్లు వెళ్లి నాటకం వేయాలన్న సామెత లాంటిది ఆయనలో నాటుకుపోయింది. బలిజేపల్లి పుట్టినప్పుడే అటుఇటుగా ఏర్పాటైన `హిందూ నాటక సమాజం` ఆయనను ఆదరించింది.
ఆచార్య కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి
ప్రముఖ కవి ఆచార్య కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ నాటక సమాజాన్ని స్థాపించారు. సుప్రసిద్ధ నటులు హరి ప్రసాదరావు,కోపెల్ల హనుమంతరావు లాంటి వారు ఈ సంస్థ ద్వారా ఎన్నో పాత్రల్లో నటించారు. స్వరాజ్య సమరంలో గాంధీజీకి ఎంతో ప్రేమాస్పదుడైన దేశభక్తి కొండా వెంకటప్పయ్య ఈ సమాజంలో స్త్రీల పాత్రలు ధరించేవారు. అలాంటి నాటక సమాజం బలిజేపల్లి రాకతో సహస్ర ప్రభల సూర్య బింబంలా మెరిసిపోయిందని నాటక విమర్శకులు చెబుతారు.
ఫస్టు కంపెనీ నాటక సమాజం
అటు తరువాత గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి సత్యహరిశ్చంద్రీయం , ఉత్తర రాఘవాది నాటకాలు అనేకసార్లు ప్రదర్శించారు. రంగూన్ తెలుగువారు ఆయనను `కవితా కళానిధి` బిరుదుతో ఘనంగా సన్మానించుకున్నారు. మద్రాస్ నాట్య కళాపరిషత్ ఆయనకు షష్టిపూర్తి మహోత్సవాన్ని నిర్వహించింది. ఆయనకు వారసుడిగా హరిశ్చంద్ర పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన డీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంత కవిని `పుంభావ సరస్వతి` బిరుదుతో ఘనంగా సత్కరించారు.
ఆధ్యాత్మిక చింతన, ఆశ్రమ నివాసం
ఆయనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతన జీవితం చివరి ధశలో ఉవ్వెత్తున వెలుగు చూసింది. భౌతిక సుఖాలకు దూరంగా శ్రీకాళహస్తిలో చిన్న ఆశ్రమం లాంటి ఇంటలోగడిపారు.బఐదు వేల పైచిలుకు పద్యాలతో `సుందరకాండ` కావ్యాన్ని రచించారు. కళారంగంలో పరిశ్రమించి, ప్రతి దశలోనూ త్రికరణశుద్ధిగా జీవించిన మహాకవి, నటుడు 72వ ఏట శివైక్యం చెందారు. తెలుగుభాష ఉన్నంత కాలం `హరిశ్చంద్ర` నాటకం, అది ఉన్నంత వరకు బలిజేపల్లి జీవించే ఉంటారు.
(డిసెంబర్ 23న బలిజేపల్లి జయంతి)