కాలం ఏదైనా, ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళా నాటకం. 20 వ దశకం ఆరంభంలో ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు అనువదించడం, ఆ కథనే నాటకాలుగా రాయడం జరిగింది. నాటకాలలో పద్యాలకు, పాటలకు ప్రాదాన్యత అధికంగా ఇచ్చిన కాలమది. ఈ విధంగా పలువురు రచయితలు అత్యధికంగా రాసి ప్రదర్శనలకు అవకాశం కల్పించిన నాటకం సత్య హరిశ్చంద్ర. అందునా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర నాటకం మిక్కిలి ప్రజాదరణ పొందింది.
సత్యహరిశ్చంద్ర నాటకంలోని కమనీయమైన పద్యరత్నాలు
ఎందరో నాటక రచయిత లకు సినిమా నిర్మాత దర్శకులకు స్ఫూర్తిని కలిగించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. “తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్”…‘మాయామేయ జగంబె నిత్యమని సంభావించి’… ‘చతురంభోధి పరీత భూధరణీ రక్షాదక్ష’ … సాగిరావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో… “దళమౌ పయ్యేదలో నడంగియు…లాంటి హరిశ్చంద్ర నాటకంలోని పద్యాల మాధుర్యాన్ని ఒకసారైనా ఆస్వాదించని తెలుగు నాటక అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇవి అన్నీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి విరచిత ‘సత్య హరిశ్చంద్రీయము’ నాటకం లోనివే.
హరిశ్చంద్ర చిత్రానికి మాటలూ, పద్యాలూ
భారతీయ భాషల్లో ‘హరిశ్చంద్ర’ నాటకానికి ఒక ప్రత్యేక స్థానముంది. మూకీ యుగంలో నాలుగు సార్లు, టాకీ యుగంలో ఇరవై సార్లు వెండితెర కెక్కిన ఒకే ఒక కథ ఇది. 1913లో చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాను పూర్తిస్థాయి మూకీ చిత్రంగా మరాఠీలో నిర్మించిన తరవాత అదే కథను ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ పేరుతో మరాఠీలోనే 1917లో లఘుచిత్రంగా నిర్మించారు. ఇదే మూల కథను ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ పేరుతోనే రుస్తుంజీ ధోతీవాలా కూడా బెంగాలీ భాషలో నిర్మించాడు. తెలుగులో 1935లో ఒకసారి 1956లో మరొకసారి 1965లో చివరిసారి హరిశ్చంద్ర సినిమా వచ్చింది. ఇన్నిసార్లు ఇదే కథను సినిమాగా మలచడానికి కారణం ఆ నాటికే ఆ నాటకం ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయడమే. ఆ నాటక కర్త కవితా కళానిధి బలిజేపల్లి కావడం తెలుగు వాళ్లకు గర్వకారణం. ఆ నాటకంలోని పద్యాలు, సంభాషణలు నాడు వెలుగు వారి నోళ్లలో నిరంతరం నానుతూనే ఉండేవి.
అనేక చిత్రాలకు మార్గదర్శి
1935లో తెలుగు తొలిటాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ నిర్మించిన స్టార్ ఫిలిం కార్పొరేషన్ సంస్థ ‘హరిశ్చంద్ర’ సినిమాను తెలుగులో నిర్మించినప్పుడు బలిజేపల్లి నాటకాన్ని స్పూర్తిగా తీసుకోవడం గమనార్హం. ఆ చిత్రానికి మాటలు, పాటలు, పద్యాలు బలిజేపల్లి కవే సమకూర్చడం విశేషం. 1936లో అదే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ అనసూయ’, ‘ధృవ విజయము’ జంట సినిమాలను నిర్మించారు. ఈ చిత్రాల నిర్మాణం కలకత్తాలోనే జరిగింది. ఈ చిత్రాలకు కథ, మాటలు, పాటలు, పద్యాలు రాసేందుకు బలిజేపల్లిని చిత్తజల్లు పుల్లయ్య కలకత్తాకు ఆహ్వానించారు. తెలుగులో వచ్చిన తొలిబాలల చిత్రం ‘ధృవ విజయం’ కావడం విశేషం.
సాంఘిక చిత్రాలకూ మాటలు, స్క్రిప్టు
1938లో జయా ఫిలిమ్స్ సంస్థ చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తొలిచిత్రంగా ‘కృష్ణ జరాసంధ’ సినిమాను నిర్మించింది. వేలూరి శివరామశాస్త్రి రచించిన కథకు బలిజేపల్లి పాటలు, పద్యాలు సమకూర్చారు. 1939లో జగదీశ్ ఫిలిమ్స్, అధినేత వై.వి.రావు (యరగుడిపాటి వరదరావు)దర్శకత్వంలో ‘మళ్ళీపెళ్లి’ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు బలిజేపల్లి రాశారు. 1921-23 ప్రాంతాల్లో కాళ్ళకూరి నారాయణరావు వరకట్న పిశాచిని నిరసిస్తూ ‘వరవిక్రయం’ అనే నాటకాన్ని రచించారు. ఆ నాటకానికి బలిజేపల్లి మాటలతోబాటు అందుకు అవసరమైన పాటలు కూడా రచించి మంచి స్క్రిప్టును తయారు చేశారు. పుల్లయ్య కోరికమీద అందులో బలిజేపల్లి పిసినిగొట్టు భూస్వామి ’సింగరాజు లింగరాజు’ పాత్రను పోషించారు.
మాటలూ, పాటలూ, కథలు
1940లో బలిజేపల్లి ఎ.వి.ఎం వారు నిర్మించిన ‘భూకైలాస్’, న్యూటన్ స్టూడియో తరఫున వై.వి.రావు నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వమోహిని’ సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. శ్రీజగదీశ్ సంస్థ బ్యానర్ మీద దర్శకనిర్మాత సమర్పించిన రెండవ చిత్రం ‘విశ్వమోహిని’. ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది బలిజేపల్లి లక్ష్మీకాంతం. 1942లో “జీవన్ముక్తి” చిత్రానికి మాటలు పాటలు సమకూర్చిన బలిజేపల్లి ‘రాజగురు’ పాత్రను పోషించారు.బుర్రకథను ఆధారం చేసుకొని బాలనాగమ్మ’ చిత్రాన్ని నిర్మించగా, బలిజేపల్లి అద్భుతమైన కథను సమకూర్చి, దానికి సంభాషణలు, పాటలు రాశారు. ఇందులో బలిజేపల్లి నవభోజరాజు పాత్రను పోషించడం విశేషం.
చిత్రాలలో నటన సైతం
1944లో శ్రీజగదీష్ ఫిలిమ్స్ వై.వి.రావు ‘తహసిల్దార్’ అనే చిత్రాన్ని నిర్మించగా బలిజేపల్లి ‘సీతయ్య’, ‘పానకాలు’ అనే రెండు పాత్రలను పోషించారు. బలిజేపల్లి రచించిన నవల ‘బ్రహ్మరథం’ ఆధారంగా 1947లో శ్రీవెంకట్రామా పిక్చర్స్ బ్యానర్ మీద మీర్జాపురం రాజావారు ప్రధమ కానుకగా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘బ్రహ్మరథం’ చిత్రాన్ని నిర్మించగా, చిత్రానికి కథ, మాటలు, పాటలు బలిజేపల్లి సమకూర్చారు. బలిజేపల్లి కథ, మాటలు, పాటలు సమకూర్చి నటించిన చివరి సినిమా ‘రక్షరేఖ’ (1949). ఆర్. పద్మనాభన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి, కస్తూరి శివరావు, వంగర వెంకటసుబ్బయ్య, కనకం, గంగారత్నం ముఖ్య తారాగణం. ఇందులో బలిజేపల్లి ప్రతాప మహారాజు పాత్రను పోషించారు. అక్కినేని ఆయన కొడుకు సుధాకరుడుగా నటించారు.
గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్ 1881న నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మలకు జన్మించిన బలిజే పల్లి 30 జూన్,1953న కాళహస్తిలో పరమ పదించారు.
(డిసెంబర్ 23… బలిజేపల్లి లక్ష్మీకాంతం జయంతి)