Wednesday, January 8, 2025

బలరాముడు లేచినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు?

తిరుప్పావై18

మాడభూషి శ్రీధర్

02 జనవరి 2024

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

మదపుటేనుగులు వేయి నదుపు జేసెడివారు

 వైరుల దరిమెడు అతిరథుడు అరిభంజనుడు

నందగోపుని మేనగోడల నప్పిన్న పరిమళ నీలవేణి

కొక్కొరకోల ప్రభాతగీతమ్ము నీ చెవులు సోకలేదేమొ

మాధవీలతల చిగురుమేసిన కోకిల గానాలు వినలేదేమొ

గోవిందునెదపై నీళ హస్తమొకటి,  క్రీడించు బంతి మరొక చేత

కాలిఅందెల ఘల్లు ధ్వనుల స్వర్ణకంకణ కాంతులెగయ

 కంజదళాక్షి కదిలి రావమ్మ కవాటపు గడియతీయ.

మదపుటేనుగులు వేయి నదుపు అరిభంజనుడు

ప్రతిపదార్థం
         “ఉందు మదకళిత్తన్” =మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు “ఓడాద తోళ్ వలియన్” ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అంతటి “నంద గోపాలన్” నందగోపాలుని “మరుమగళే!” కోడలా, నప్పిన్నాయ్ = సమగ్ర సౌందర్య రాశీ, నీలాదేవీ అంటూ పిలిచారు. సీతా దేవి దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు గోపికలు. “కందం కమరుం కురలి” =సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! (మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ).”కడై తిఱవాయ్” గడియ తెరువుమా.”కోరి అరైత్తన కాణ్” = కోడి కూస్తుంది, కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. అమ్మా”ఎంగుం” =అన్నీ కోళ్ళు కూస్తున్నాయి “వంద్” = తిరుగుతూ కూస్తున్నాయి.

ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అటువంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అని గోదమ్మ వివరిస్తున్నారు.

భావం

నందగోపుడు మహాబలవంతుడు. ఏనుగులతో పోరాడగలిగిన వాడు. మదము స్రవించుచున్న ఏనుగు బలము కలవాడు, మదము స్రవించుచున్న ఏనుగులున్నవాడు. యుద్ధములో జంకడు. అంతటి నందగోపుని కోడలివి నీవు. నీలాదేవీ నీ నీలవేణి సుగంధాలు వెదజల్లుతున్నాయి. కోళ్లు అన్నీ కూస్తున్నాయి. తెల్లవారింది. మాధవీ లత అల్లుకున్న పందిరిమీద కోకిలలు గుంపులుగా కూచున్నాయి. నీచేతిలో బంతి ఉంది, మేం వచ్చి నీ బావ గుణకీర్తనం చేస్తున్నాం. ఆనందంగా మందస్మిత వదనంతో రామ్మా, నీ సుందరమైన చేతికంకణాలు ఘల్లుమని ధ్వనిస్తుంటే తలుపు తెరువుము.

దయ అంటే ఏమిటి

మనం దయ అనే పదం చీటికీ మాటికీ వాడుతూ ఉంటాం. దయ అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా?దయ అంటే ఎదుటి వారు దుఃఖిస్తే వారి దుఃఖం తొలగి పోయేంత వరకు అది తన దుఃఖంగా భావించడం. వాత్సల్యం అంటే వత్సం పై కరుణ. వత్సం అంటే గోదూడ. దోడపుట్టినపుడు దానిపై ఉండే మురికిని వాత్సమ్ అంటారు. ల అంటే దాన్ని నాకి తీసేయడం. మనం తెలియకుండా మనం తెచ్చుకున్న కొన్ని దోషాలు మనపై ఆవహించి ఉంటాయి. ఆ దోషాలను తొలగించి, మనలోని మంచిగుణాలు (ఉంటే) తండ్రికి చూపించే వాత్సల్యం తల్లికి ఉంటుంది. అందుకు తల్లి తండ్రితో నిరంతరం ఎడబాయకుండా ఉండాలి. ‘‘అగలగిల్లేన్ ఇరయుమ్’’ అరక్షణం కూడా అమ్మ స్వామిని విడువదని నమ్మాళ్వార్ చెప్పారు. పరమపదంలో లక్ష్మీదేవి, భూమికి వరాహ మూర్తిగా వస్తే ఆమె భూదేవి. రాముడైతే సీత. శ్రీకృష్ణుడైతే నీళాదేవి.

అమ్మగారు పురుషకారం

వాత్సల్యాది గుణోజ్జ్వలాం వందేఅమ్మను ఆశ్రయించాల్సిందే

ఈశానాం జగతోస్య వేంకటపతే – ర్విష్ణోః పరాం ప్రేయసీం |

తద్వక్షస్థ్సలనిత్యవాసరసికాం – తత్‌ క్షాంతిసంవర్ధినీమ్‌ |

పద్మాలంకృతపాణిపల్లవయుగాం – పద్మాసనస్థాం శ్రియం |

వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం – వందే జగన్మాతరమ్‌.

ఇది శ్రీ వేంకటేశుని ప్రపత్తిలో వచ్చే సంస్కృత శ్లోకం. వేంకటపతి ప్రపంచానికి తండ్రి. ఆయనకు అలమేలుమంగ అత్యంత ప్రేయసి. ఆమెకు నిత్యం వేంకటేశుని వక్షస్థలంలోనే నివాసం. అక్కడ ఉండి ఆయన హృదయాన్ని శాంత పరుస్తూ ఉంటుందట. ఆమె చేతిలో పద్మాల మొగ్గలుంటాయి. పద్మం లోనే కూర్చుని ఉంటుంది. తనముందుకు వచ్చిన భక్తుల తప్పులు అయ్యకు కనబడుతూఉంటే అమ్మ మాత్రం ఆ బిడ్డడి ప్రేమను కష్టాలను గమనిస్తూ భర్తకు, వాడు మనవాడు, మన దూడ (వత్స) కాస్త ప్రేమతో సంభావించండి అని చెబుతూ విష్ణుదయను ఆవాహన చేస్తూ ఉండడమే ఆమె పని. వక్షస్థలంలో కూచుని వత్సలను కాపాడే ఆ వత్సల్యమూర్తి జగన్మాత, ఆమెకు వందనం. ఎంత అద్భుతమైన భావన. ప్రతి ఇంటా అమ్మనే కదా బిడ్డలకు తండ్రి దయను సంపాదించి పెట్టేది.

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి అని రామదాసు అమ్మ పురుషాకార ప్రాభవాన్ని తలచుకుని వేడుకుంటాడు. విష్ణు హృదయంలో తత్ క్షాంతి సంవర్థిని ఆమె. శ్రీకృష్ణుడి దయ కావాలంటే ముందుగా అమ్మగారు నీళాదేవిని ఆశ్రయించాలని భావించి నీళాదేవి భవనానికి వెళుతున్నారు గోపికలు. (https://www.youtube.com/watch?app=desktop&v=3HP9nyxv6Oo ఈ పాట ఇక్కడ వినవచ్చు) శ్రీకృష్ణుని మేల్కొల్పి ఆయన దర్శనానుభవ సుఖాన్నిఆనందించాలన్న ఆశ తీరలేదు. ఆయన మేల్కొనలేదు. రామదూత – రామదాసు

రావణునికి సీత చెప్పిన హితవు విన్నపుడు హనుమకు స్వస్వరూపం గురించి భగవత్స్వరూపముగురించి అర్థమైందట. అందాకా రామదూతను అనుకున్న వాడు రామదాసుడినని ఘోషించాడట. సీతాదర్శనంతో పావనమైన పావని, రాముని సర్వస్వభూతమైన ఆలింగమును పొందగలిగినాడు.

బలరాముడు లేచినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు. కనుక నీళాదేవిని ఆశ్రయించక తప్పదని గోపికలు గమనించారు. అమ్మవారిని ఆశ్రయించకుండా ఆశ్రయించే దశ పూర్తికాదు. అమ్మగారు పురుషకారం కట్టుకుంటారు. ఆమె మధ్యవర్తి. జీవుల పక్షాన నిలబడి, వారికోసం భర్త అయిన నారాయణుడికి సిఫారసు చేసే దయామయి. కనుక నీలాదేవినే ముందుగా మేల్కొల్పవలసింది అనుకుని ఆమెను ఆశ్రయించాలని గోపికలు తెలుసుకున్నారని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు వివరించారు. ఆమె భవనం సమీపించారు.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. మాధవీలత ప్రాకిన పందిరి మీద అనేక సార్లు కోకిలల గుంపులు  కూస్తున్నాయి. రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, బంతి చేతులలో కలదానా. ఈ భూమి వంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అటువంటి అండాలనన్నీ కలిపితే అది బ్రహ్మాండం. అటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

May be an image of 3 people, temple and text that says 'ఋషిపీఠం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్ై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య:!! శ్రీరామునకు నమస్కారము; జనక సుతయైన సీతామాతకు ప్రణతి; లక్ష్మణునకు నమస్కారము; రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు నమస్కారములు. సూర్య చంద్రులకును, మరుద్దేవతలకు నమస్కారములు కార్య సిద్ధికర మంత్రం ఇది.'సీతా కటాక్షం – రామాయణ ఘట్టం

 ‘‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దైవ్యైచ తస్యై జనకాత్మజాయై’’ అని లంకలో సీత కోసం ఎంత వెదకినా దొరకకపోతే, ఆంజనేయుడు ప్రార్థిస్తాడు. అమ్మా ఆనాడు జనకునకు ఏ విధంగా స్వయంగా దొరికావో నాకూ నీయంత నీవే కనిపించు తల్లీ అన్నాడు. అశోక వనం వైపు అతని దృష్టి మళ్లింది, ఆమె కనిపించింది.

‘‘సీతామువా చాతియశా రాఘవంచ మహావ్రతమ్’’ వనవాసానికి లక్ష్మణుడు కూడా వస్తానంటే రాముడు నిరాకరిస్తాడు. అతను సీతను ఆశ్రయించి ఆమె ద్వారా కోరితే కాదనడు. సీత వల్లనే ఆమె పాదాలు పట్టిన కాకాసురుడిని రాముడు చంపకుండా కన్ను మాత్రం హరించి వదిలాడు. సీతను కాదని రాముని పొందబోయిన శూర్పణఖ ముక్కుచెవులు కోల్పోయింది. రాముడికి దూరం చేసి సీతను పొందాలనుకున్న రావణుడు ప్రాణాలు కోల్పోయాడు. సీత విసిరిన నగల ద్వారా సుగ్రీవుడు రామునికి స్నేహితుడైనాడు. తన భార్య, కూతురు ద్వారా సీతకు సేవలుచేసి విభీషణుడు రాముని శరణాగతి పొందగలిగాడు. సీతను ఆశ్రయించి రావణుడిని వదులుకోగలిగి లంకాధిపతి కాగలిగాడు. సీత దూరమైన రామలక్ష్మణులను మాత్రమే చూచిన హనుమ కు కూడా లంకలో సీతాకటాక్షం వచ్చే వరకు పరిపూర్ణత్వం సిద్ధించలేదు.

ఆమెకు బావ, నాజ్ఞజితిని గెలిచిన శ్రీకృష్ణుడు

18వ పాశురంలో గోదాదేవి నీళాదేవిని ఆశ్రయించే అవసరాన్ని వివరిస్తారు. ఎవరీ నీళాదేవి? ఆమెకు నాజ్ఞజితి అనే పేరు కూడా ఉందా? శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఆమెకూడా ఉందా?నీళాదేవిని ద్రావిడ భాషలో నప్పిన్న అంటారు. నందగోపుడు ఆచార్యుడు, యశోద తిరుమంత్రమని 17 వ పాశురంలోచదువుకున్నాం. వారితో సంబంధం ఉన్న నీళాదేవిని ఆశ్రయిస్తేనే ఫలం. భగవంతుడు ఆచార్యునికి, పురుషకార భూతురాలైన లక్ష్మికి వశవర్తియై ఉంటాడు.మహాలక్ష్మిమాతృస్థానంలో ఉండి జీవులపట్ల వాత్సల్యం కలిగి ఉంటుంది. నారాయణుడికి శ్రీ తత్త్వమే శ్రీదేవి భూదేవి, నీళాదేవి. ద్రావిడ సంప్రదాయం ప్రకారం నీళాదేవి శ్రీకృష్ణుని పట్టపురాణి. యశోదాసోదరుడైన కుంభుడి పుత్రిక నీళాదేవి. అంటే ఆమె యశోదకు మేనకోడలు. శ్రీకృష్ణుడు ఆమెకు బావ. శ్రీ, శ్రియఃపతి ఇద్దరి ఆ మిధునముకే చెందిన వారము మనము, కనుక వారిని మనము సేవించాలి అని శ్రీభాష్యం అప్పలాచార్యులవారు చెప్పారు.

నీళాదేవి యే నాజ్ఞజితి

భాగవతంలో నీళాదేవి పాత్ర మనకు కనిపించదు. శ్రీకృష్ణుని ఎనమండుగురు పట్టపు రాణుల్లో ఒకరైన నాజ్ఞజితి నీళాదేవి అని పెద్దలు సమన్వయించారు. రాముడు శివధనుస్సు ఎక్కుపెట్టి సీతను పెళ్లాడినట్టు, ఏడుమృత్యువుల వంటి ఎడ్లను పట్టి బంధించి నాజ్ఞజితిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. నాజ్ఞజితిని వలెనే నీళాదేవిని కూడా అదే రీతిలో వివాహం చేసుకున్నారని జీయర్ స్వామి వివరించారు. నాజ్ఞజితి నీళ ఒకరే అన్నారాయన. నీళకే పురుషకారం ఉందని పెద్దలు అంటారు. వైష్ణవ ఆరాధనలో శ్రీ, భూ, గోదా, నీళా దేవి దివ్య మహిషులుగా పూజలందుకుంటారు. నీళాదేవిని గోదమ్మ నప్పిన్న అని పిలుస్తున్నారు.

భాగవత పురాణం నాగ్నజితి వివాహం కథ ఉంది. ఆమె తండ్రి ధర్మబద్ధమైన రాజు, వేద గ్రంథాలను ఎంతో భక్తితో అనుసరించాడు. తన ఏడు భయంకరమైన ఎద్దులను యుద్ధంలో ఓడించి తన కుమార్తెను వివాహం చేసుకోవాలని రాజు షరతు పెట్టాడు. నాగ్నజితి కూడా కృష్ణుడిని చూసి చాలా సంతోషించి, కృష్ణుడు తన భర్త కావాలని ప్రార్థించింది. రాజు, అతని కుమార్తె ఇద్దరికీ కృష్ణుడి దైవత్వం గురించి తెలుసు. ఏడు ఎద్దులను అదుపులోకి తెచ్చినవాడికే తన కుమార్తెకు ఇస్తానని అంటాడు. రాజు కృష్ణుని శౌర్యాన్ని ప్రశంసించి, ఏడు ఎద్దులను సులభంగా మచ్చిక చేసుకోగలడని చెప్పాడు.

శ్రీకృష్ణ విజయము పేరుతో నాగ్నజితి పరిణయంబు అని శ్రీమద్ భాగవతంలో వివరించారు.

జననాథ! వినుము కోసలదేశ మేలెడినగ్నజిత్తను నరనాథుఁ డొకడు

సుమతి ధార్మికుఁడు దత్సుత నాగ్నజితి యనుకన్యక గుణవతి గలదు దానిఁ

బెండ్లియాడుటకునై పృథివీశు లేతెంచివాఁడికొమ్ములు గల వాని, వీర

గంధంబు సోఁకినఁ గాలు ద్రవ్వెడివాని,నతిమదమత్తంబు లయిన వాని

గోవృషంబుల నేడింటిఁ గూర్చి తిగిచిబాహుబలమున నెవ్వఁడు పట్టి కట్టు

నతఁడు కన్యకుఁ దగు వరుం డనిన వానిఁబట్టఁజాలక పోదురు ప్రజలు బెగడి.

ఇట్లు గోవృషంబుల జయించినవాఁడ క్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ఘ్యపాద్యాది విధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్న యెడ. అని పోతన వివరించారు. అర్థం ఇది. ‘‘ఓ పరీక్షన్మహారాజా! కోసలదేశాన్ని సద్గుణుడు ధర్మపరుడు అయిన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. సద్గుణ సంపన్న. ఆ రాజు దగ్గర వాడి కొమ్ములు కలిగి వీరగంధం సోకితే చాలు కాలుద్రవ్వుతుండే మిక్కిలి మదించిన ఏడు ఆబోతులు ఉన్నాయి. ఆ వృషభాలను తన బాహుబలంతో ఎవడు కట్టివేస్తాడో, అతడే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దులను చూసి బెదిరి పోయారు, పట్టికట్టలేకపోయారు. ఆ వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని వినిన శ్రీకృష్ణుడు సేనాసమేతంగా కోసలదేశానికి వెళ్ళాడు. ఆరాజు శ్రీకృష్ణుని గొప్పగా గౌరవించాడు. అర్ఘ్యం, పాద్యం, పీఠం, నమస్కారాదులతో సత్కరించాడు’’.

మరో కథ కూడా ఉంది. రాజు మాట విన్న తరువాత, కృష్ణుడు ఏడు రూపాలుగా మారి, ఏడు ఎద్దుల చుట్టూ నిలబడి ఒక శబ్దం చేశాడు. నాగ్నజిత్తు రాజు, అతని కుమార్తె సంతోషించారు. శ్రీకృష్ణుడు, నాగ్నజితి వివాహం వైభవంగా జరిగింది. రాజు కృష్ణుడికి 10,000 ఆవులు, 9,000 ఏనుగులు, 9,00,000 రథాలు, 90,000,000, 9,000,000,000 మగ సేవకులను కట్నంగా అందించాడు. కృష్ణుడు, నాగ్నాజితి వారి రక్షణ కోసం వచ్చిన సైన్యంతో కలిసి ద్వారకా నగరం వైపు బయలుదేరారు. నాగ్నాజిత్తు ఎద్దుల పోటీలో ఓడిపోయిన యువరాజులు మార్గమధ్యంలో వీరిపై దాడి చేశారు. కృష్ణుడి సైన్యం, అతని యాదవ వంశ యోధులు, అతని స్నేహితుడు అర్జునుడు ఆ యువరాజులను ఓడించి వారిని తరిమికొట్టారు. తరువాత, కృష్ణుడు తన భార్య నాగ్నజితితో కలిసి ద్వారకలోకి ప్రవేశించాడని అంటారు.

శ్రీరాముడి చెల్లెలే శ్రీకృష్ణుడి భార్య

శ్రీరాముడి చెల్లెలిని శ్రీకృష్ణుడు పెళ్లాడతాడు. నమ్మడం కష్టం కదా. విదేహ రాజ్యంలో యశోద తమ్ముడు కుంభకుడు ఉండేవాడు. అతని భార్య ధర్మద.  ఈదంపతులకు శ్రీరాముడు కొడుకు, నీళ (నాజ్ఞజితి అనీ అంటారు) కూతురు. ఆ రాజ్యంలో ఏడు వృషభాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఒక కథనం ప్రకారం వారు కంసుని చేత హతులైన దేవకీదేవి బిడ్డలంటారు. కాని వారు ఆరుగురే. ఇక్కడ పొగరుఆబోతులు ఏడున్నాయని అంటారు. అవి కుంభకుని మందలో పుట్టి ఆ రాజ్యంలో సంక్షోభం సృష్టిస్తూ ఉన్నాయి. కుంభుని ఆబోతులు చేసే విధ్వంసం గురించి విదేహ రాజుకి జనం మొరబెట్టుకున్నారు. విదేహరాజు కుంభకుని పిలిచి ఆబోతులను అదుపు చేయమని హెచ్చరించారు. ఎంత ప్రయత్నించినా ఆబోతులను ఆపడం సాధ్యం కాక, కుంభుడు వాటిని అణచిన వారికి తన కూతురునిచ్చి పెళ్లిచేస్తానని ప్రకటించాడట. ఆబోతుల సంక్షోభం ఏ విధంగా నివారించాలా అని ఆందోళన పడుతూ ఉన్నదశంలో ఒక రోజు యశోదా నంద రాజు బలరామ శ్రీకృష్ణులతో కలిసి యశోద సోదరుడైన కుంభకుడి ఇంటికి వచ్చారట, వారి వెంట మరెందరో గోపయువకులు కుంభుడి ప్రదేశానికి వచ్చారట.

కుంభకుడి ప్రకటన విన్న యువకులు ఎంతమంది ఆబోతులతో తలపడినా వాటిని అదుపుచేయడం సాధ్యం కాలేదు. వాటి బాధ పడలేక కొందరు ప్రజలు గ్రామం విడిచి పోయారట. కుంభుడి ఇంటిపైన కూడా ఆ పొగరుబోతు ఆబోతులు దాడిచేసి ధ్వంసం చేశాయి.

అక్కతో ఆ విషయాలు చెబుతుంటూ శ్రీకృష్ణుడు విని వెంటనే ఆ ఆబోతులు ఉన్నచోటుకు వెళ్లిపోయాడు.  మురళిని పక్కన బెట్టి, పంచె కాసె బిగించి, ధోవతి అంచులను పైకి కట్టి శ్రీకృష్ణుడు విజృంభించాడు. ఒక్కొక్క ఆబోతు ఏనుగంత పెద్దగా పర్వతం వలెకనిపిస్తున్నాయి. నీలి నిండిన నలుపురంగులో భీకరంగా ఉన్నాయి. ఏడు ఒకే సారి దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి మధ్య ఏడు తాళ్లు తీసుకుని ఆబోతుల మెడకు చుట్టడానికి, వాటి ఊపిరి ఆగకుండా కట్టుబడేట్టు మాత్రమే చేయడానికి తగిన ప్రమాణంలో తగిన ముడులు సిద్ధం చేసుకుని దాడికి బయలుదేరాడట. ఒక్కో ఆబోతు మీదకు ఎగిరి దూకి శరవేగంతో మోచేతితో పొడుస్తూ, పిడికిలితో గుద్దుతూ ఏడు ఆబోతును వరసగా దెబ్బతీసాడు. అవి తేరుకుని దాడిచేసేలోగానే వాటని నేలకు పడేసాడు. తరువాత వాటి మెడలకు తాళ్లు తగిలించి ఏడు తాళ్లను చేతులతో పట్టుకుని వాటి కదలికలను స్తంభింప జేసి నడుపుకుంటూ మందకు తీసుకువచ్చి బంధించివేసాడు. మేనమామ

ఒక్కొక్క పిడికిలి పోటుతో ఒక్కొక్క ఆబోతును దెబ్బ తీస్తే ఆబోతులు రక్తం కక్కుకుని చనిపోయాయని ఒక కథనం. మరొక రచనలో ఆ ఏడు ఆబోతులను జయించి ఒక గాట కట్టి, ఆబోతుల సంక్షోభాన్ని తొలగించారంటారు. అంతటి పరాక్రమశాలి శ్రీకృష్ణునికి తన కూతురు నీళను ఇచ్చి కుంభకుడు-ధర్మద వివాహం చేశారని దాశరథి రంగాచార్యులు తన మానస తిరుప్పావై లో వివరించారు.  నీళాదేవినే నాజ్ఞజితి అంటారని, అతని తండ్రి పేరు నాజ్ఞజితుడని ఒక వివరణ ఉంది.

నీళాదేవే గోదాదేవి

నాగ్నాజిత రాజుకు నీలా దేవి తప్ప మరెవ్వరూ లేని కుమార్తె ఉంది. నీలాదేవి నాగ్నజితి ద్వారా భూమిలోకి ప్రవేశించిందని అంటారు. కారణాన్ని ఆండాళ్ స్పష్టంగా వివరణాత్మకంగా వివరించింది. ఆమె దక్షిణ భారతదేశానికి చెందిన కవయిత్రి సాధువు. నప్పినై నాగ్నాజిత కూతురు అని రాసింది. రాజు నగ్నజిత కృష్ణుని పెంపుడు తల్లి యశోద సోదరుడు. నప్పినైకి నాగ్నాజితితో ఉన్న పరస్పర సంబంధంతో, ఆమె కూడా నీలాదేవి అవతారంగా పరిగణించారని, నిజానికి ఆ నీళాదేవియే గోదాదేవి అనీ, గోద తులసీ వనంలో కనిపించి విష్ణుచిత్తునికి పెంచుకున్నారని, తిరుప్పావై రచించిన గోదమ్మ రంగనాథుడిని ప్రేమించి, వివాహం చేసుకోవాలని కలలు గని, వారణమ్ ఆయరం (వేయి ఏనుగులు) వచ్చి పెళ్లి చేసుకున్నారని అన్నారు. ఆ తరువాత ఆమె శ్రీరంగం ఆలయానికి రంగనాథుడు రప్పించి గర్భాలయంలో తనతో విలీనం చేసారు. ఆ విధంగా తులసీ వనంతో కనపించి భూదేవి కనుకనే సీతవలె, గోదాదేవి కూడా అదృశ్యమైనారు. 

కంసుడు చంపింది తన కొడుకులనేనా

హరి వంశంలో ఒక కథ ఉంది. కాలనేమి అనే రాక్షసుడికి ఆరుగురు పుత్రులున్నారు. వారిని షడ్గర్భులు అంటారు. హిరణ్యకశిపుని కాలంలో వీరు జీవించి ఉన్నారట. ఈ ఆర్గురు చావులేని వరం కోరుతూ బ్రహ్మను గురించి తపస్సు చేస్తున్నారని తెలుసుకుని హిరణ్య కశిపుడు ఆగ్రహించాడు. అందరూ తననే పూజించాలని తనకోసమే తపస్సు చేయాలని హిరణ్య కశిపుడి శాసనం. అందుకని ఆ షడ్గర్భులు తండ్రి చేతిలోనే చస్తారని శపిస్తాడట. కాలనేమి మరుజన్మలో కంసుడై పుడతాడు. తన చెల్లి దేవకి పుత్రుడే శత్రువని తెలుసుకున్న కంసుడు దేవకి ఆరుగురు బిడ్డలను వధిస్తాడు. ఆ ఆరుగురే పూర్వపు షడ్గర్భులు.

తిరుప్పావై జీయర్ రామానుజుని కథ

ఈ పాశురము రామాజునునికి ప్రియమైనది. ఓసారి భిక్షాటనం చేస్తూ రామానుజుడు ఈ పాశురాన్ని మనసులో లోతుగా మననంచేస్తూ గురువుగారైన మహాపూర్ణుల ఇంటికి వెళ్లి తలుపుతట్టారట. గురుపుత్రిక అత్తులాయమ్మ ఆమె గాజులు ఘల్లుమన్న ధ్వనితొ తలుపు తీస్తే ఆమెను చూసి నీళాదేవి సాక్షాత్కరించిందనే పరవశంతో ఆయన మూర్ఛపోయారట. ఇదంతా గురువుగారు దూరాన ఉండి ఊహించారట. నిన్ను చూసి నీళాదేవి అనుకుని ఉంటాడు అటూ వచ్చి రామానుజుడిపై నీళ్లు చల్లి మేల్కొల్పారట. ఈ పాశురం అనుసంధానం చేస్తే అమ్మవారి సాక్షాత్కారం కలుగుతుందని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు మృదు మధురంగా వివరించారు. తిరుప్పావై అంటే అమిత అభిమానం కలిగిన రామానుజుల వారిని తిరుప్పావై జీయర్ అని పిలుస్తారు.

బాపురేఖ, శ్రీధర్ వ్యాఖ్య: నీల కుంతల నీళాదేవి నీళా కృష్ణుల శృంగార గీతిక అయిన 18వ పాశురానికి ఇది బాపు చిత్రం. ఆమె నీలవేణి, ఆ కురులు పరిమళాలు వెదజల్లుతున్నాయి. గోవిందుని ఎదపైన ఒక హస్తం, క్రీడా కందుకము (బంతి) ఇంకో చేతిలో. కాలికి అందెలు చేతులకు బంగారు కంకణాలు.  కలువ కన్నులు వాలుజడ లేని బాపు బొమ్మలు ఉండవు కదా. నీళాదేవిని నప్పిన్న పిరాట్టి అంటారు. నీళాదేవిని ముందుగా మేల్కొల్పితే తప్ప కృష్ణయ్యను పిలవడం కష్టం అని తెలుసుకున్నారు. బలరాముని కడియాల పాదాలను ప్రస్తుతించిన తరువాత, ఈ పాశురంలో గాజులు, స్వర్ణ కంకణాలతో కళకళ లాడే నీళాదేవి కరకమలాలను ప్రశంసిస్తున్నారు. కోకిలలు పాటలు నేర్చుకోవడానికి నీళాదేవి దగ్గరకు వస్తాయట. బ్రహ్మాండ నాయకుడితో బంతులాడుతున్నదట.  చెట్లు, తీగలు, పక్షులు, జింకలు అన్నీ ఆమెవశమే అనే దృశ్యాన్ని బాపు మనకు సాక్షాత్కరింపజేస్తున్నారీ చిత్రంలో.
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles