మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్ లో బాలగోపాల్ సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకూ జరుగుతుంది. ఇది 13వ సంస్మరణ సభ. మానవ హక్కులకోసం జీవితాన్ని అంకితం చేసిన మేధావి, కార్యశూరుడు డాక్టర్ కె. బాలగోపాల్ 08 అక్టోబర్ 2009 నాడు ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు.
మానవ హక్కుల వేదికకు చెందిన జహా ఆరా ‘హిందూత్వ దేశంలో నివసించడం’ అనే అంశంపైన ప్రసంగిస్తారు. ‘ఫాసిస్టు మొమెంట్’ అనే అంశంపైన ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీరాయ్ మాట్లాడతారు. పీయూసీఎల్ కు చెందిన మిహిర్ దేశాయ్ ‘హిందూత్వ కాలంలో న్యాయవ్యవస్థ’ అనే విషయంపైన ప్రసంగిస్తారు. ఏఐసీసీటీయూకి చెందిన క్లిఫ్టన్ డి రొజారియో ‘కార్మికవర్గంపైన ఫాసిస్టు దాడి’ అన్న విషయంపైన మాట్లాడుతారు. బాలగోపాల్ అభిమానులు, హక్కుల కార్యకర్తలు వందల సంఖ్యలో ఈ సమావేశానికి హాజరవుతారు.
‘‘కుడివాదులు ఈ రోజు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే, వారు న్యాయస్థానాలను కూడా గణనీయంగా తమ గుప్పిటలో పెట్టుకున్నారు.’’ ఇది మానవ హక్కుల సంస్థ పంపిన ఆహ్వానంపైన ప్రచురించి ఉన్నది.