నిజాం పరోక్ష సైన్యం రజాకార్లతో పోరాటంలో ప్రాణాలు అర్పించిన 118 మంది స్వాతంత్ర్ సమర యోధులకు మాజీ పార్లమెంటు సభ్యుడూ, బీజేపీ నాయకుడూ రాపోలు ఆనందభాస్కర్ శుక్రవారంనాడు (27 ఆగస్టు 2021) సామూహిక పితృయజ్ఞం, పిండ ప్రదానం చేశారు. సరిగ్గా 73 ఏళ్ళ కిందట 27 ఆగస్టు 1948న రజాకార్లు బైరాన్ పల్లి బురుజు దగ్గరికి మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని ప్రతిఘటించి పోరాడుతూ 118 మంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు బలిదానం చేశారు. ఆ రోజు చనిపోయినవారిలో అత్యధికులు తాడిత, పీడిత, బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే. స్వాంతంత్ర సమర యోధులు రజాకార్ల రాకపోకలను గమనించేందుకు వీలుగా వీర బైరాన్ పల్లిలో బురుజు నిర్మించారు.
ఆనందభాస్కర్, మరి పలువురు కార్యకర్తలూ శుక్రవారం ఉదయం పదకొండ గంటలకు వీరబైరాన్ పల్లిలో పిండప్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైనారు. పురోహితులను పిలిపించి సంప్రదాయబద్ధంగా పిండప్రదాన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఎటువంటి సంస్మరణ సభలూ ఇటివలికాలంలో జరగలేదు. ఈ విషయంలో చొరవతీసుకొని చారిత్రక కార్యం నిర్వహించినందుకు ఆనందభాస్కర్ ను అక్కడికి వచ్చినవారు అభినందించారు. నాడు నిర్మించిన బురుజు వద్దే పితృయజ్ఞం నిర్వహించడం విశేషం. ఆనందభాస్కర్ పిలుపు మేరకు తెలంగాణలో బైరాన్ పల్లి అమరదినం పాటించారు. యావత్ తెలంగాన సబ్బండ ప్రజానీకం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించినట్టు ఆనందభాస్కర్ తెలిపారు.
భారత దేశానికి 15 ఆగస్టు 1947నాడు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానంలో నివసిస్తున్న ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందాలని నిజాం ప్రయత్నాలు ప్రారంభించాడు. పాకిస్తాన్ నాయకుడు మహమ్మదలీ జిన్నాతో మంతనాలు జరిపాడు. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టాడు. చివరి వైస్రాయ్ మౌట్ బాటన్ కు అర్జీ పెట్టుకున్నాడు. ప్రైవేటు సైన్యం రజాకార్లను ప్రజలమీదికి వదిలాడు. నిజాంని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ వాదులు పోరాటం ప్రారంభించారు. అప్పటికే భూస్వాములను ఎదిరించి పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ సాయుధయోధులు రజాకార్లను కూడా వ్యతిరేకించి పోరాటం సాగించారు. ఆ బాటలో సాగిన పోరులో భాగంగానే పాత వరంగల్లుజిల్లా, ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో భాగమైన బైరాన్ పల్లిలో బురుజు నిర్మించి ఆయుధాలు చేతపట్టిన ప్రజలు వీరోచితంగా పోరాటం చేశారు. వీరమరణం పొందారు. కానీ వారిని స్మరించుకోవడానికి ఒక సమావేశం పెట్టడం కానీ, ఒక సభ నిర్వహించడం కానీ జరగలేదు. ఆ లోటును బీజేపీ నాయకుడు ఆనందభాస్కర్ తీర్చారు.
వీర బైరాన్ పల్లి బలిదానం తర్వాతనే దిల్లీలో కదలిక వచ్చింది. నాటి దేశీయాంగమంత్రి, ఉపప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జనరల్ చౌదురి నాయకత్వంలో సైన్యాన్ని పంపించారు. మూడు రోజులలో నిజాం లొంగిపోయాడు. 17 సెప్టెబర్ 1948నాడు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారత్ యూనియన్ లో విలీనమైంది.
పందొమ్మిదేళ్ళ వయసులో బైరాన్ పల్లిలో రజాకారులపైన పోరాటంలో పాల్గొన్న 95 ఏళ్ళ ఇమ్మడి ఆగంరెడ్డిని ఈ సందర్భంగా ఆనందభాస్కర్ సత్కరించారు. బురుజు చుట్టూ అందరూ పరిక్రమ చేశారు.