- బొంబాయ్ హైకోర్టు వల్లమాలిన షరతులు
- విచారణకు అందుబాటులో ముంబయ్ లోనే ఉండాలి
- పాస్ పోర్టు ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేయాలి
ముంబయ్ : ప్రఖ్యాత విప్లవకవి, అధ్యాపకుడు వరవరరావుకు కోరేగాం-భీమా కేసులో బెయిల్ లభించింది. రెండున్నరేళ్ళుగా ఈ కేసుకు సంబంధించి ఆయన జైలులో ఉన్నారు. ఆరోగ్య కారణాలపైన బొంబాయ్ హైకోర్టు సోమవారంనాడు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు జోక్యం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం వరవరరావును ఇక్కడి నానావతీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చింది.
మంబయ్ లోనే నివసిస్తూ, దర్యప్తునకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులో ఉండాలని హైకోర్టు వరవరరావును కోరింది. వరవరరావు పాస్ పోర్టును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టులో దాఖలు చేయాలనీ, తనతో పాటు నిందులను కలుసుకోవడానికి కానీ, మాట్లాడటానికి కానీ ప్రయత్నించరాదనీ, వ్యక్తిగత పూచీకత్తు కింద రూ. 50,000లు ఎన్ఐఏ కోర్టులో చెల్లించాలనీ హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read: భారత్ బచావో కాదు… కాంగ్రెస్ బచావో అనాలి
కోరేగాం-భీమ కేసు విచారణ ప్రారంభం కాలేదు. 28 ఆగస్టు 2018న మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ వచ్చి వరవరరావును అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన నిర్బంధంలో ఉన్నారు. ఇప్పుడు కనుక వరవరరావుకు బెయిల్ మంజూరు చేయకపోతే మానవహక్కుల విషయంలోనూ, ఆరోగ్యం, జీవితంపై రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల విషయంలో తప్పు చేసినవారం అవుతామని న్యాయమూర్తి అన్నారు.
ఈ కేసులో వరవరరావుతో పాటు మరి తొమ్మిదిమంది నిందితులు ఉననారు. వారిలో ఇంతవరకూ ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వలేదు. వరవరరావుది మొదటి బెయిల్. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ముంబయ్ లోనే ఉండాలనే షరతు ఉంది. దాని గురించి మేము ఆలోచించి ఏర్పాట్లు చేసుకోవాలి. లాయర్లతో మాట్లాడతాం,’’ అని వరవరరావు కుమార్తె పావని అన్నారు. అంతకు ముందు వరవరరావు అనారోగ్యం గురించి ప్రఖ్యాత న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానం ముందు గట్టిగా వాదించారు. నిరుడు ఫిబ్రవరి నుంచి గడచిన 365 రోజులలో 149 రోజులు ఆస్పత్రిలోనే గడిపారనీ, మహారాష్ట్రలోని తలోజా జైలు నుంచి వరవరరావును విడిపించాలనీ, ఇంటికి వెళ్ళి కుటుంబసభ్యులతో కలసి ఉండేందుకు ఆయనను అనుమతించాలనీ ఆమె వాదించారు.
Also Read: ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?
పుణె లోని ఎల్గర్ పరిషత్ సభలలో రెచ్చగొట్టే విధంగా 31 డిసెంబర్ 2017న ఉపన్యాసాలు చేశారంటూ వరవరరావుపైన అభియోగం. ఈ ప్రసంగాల వల్లనే మరునాడు కొరేగాం-భీమా స్మారకచిహ్నం దగ్గర హింసాకాండ జరిగిందని పోలీసులు ఆరోపణ. ఈ ఆరోపణను వరవరరావు నిర్ద్వంద్వంగా ఖండించారు. అయినప్పటికీ ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ కనికరం చూపించలేదు. ఒక సారి ముంబయ్ ఆస్పత్రిలో కళ్ళు తిరిగి కిందపడితే వరవరరావు తలకు గాయమైంది.ఈ కేసులో సాక్ష్యాధారాలను సృష్టించి నిందితులకు బుద్ధిపూర్వకంగా ఇరికించారనే ఆరోపణలు ఉననాయి.