Sunday, December 22, 2024

మన మిడిమేళపు మీడియా

రెండు పాములు రోడ్డుమీద సయ్యాటలాడుతూ పక్కనే ఉన్న చెరువులోకి దిగి సరససల్లాపాలను కొనసాగించుకుంటుంటే ఒక ప్రబుద్ధుడు తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. వాటి వ్యక్తిగత ఆనందాన్ని ఛేదిస్తూ, జంతువుల రతికార్యం చూడకూడదని నమ్మే మన దేశంలో ఆ ప్రబుద్ధుడు వీడియో తీయడం తప్పిదం. అక్కడితో ఊరుకోక, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. చూడకూడనిది, తాను చూడడమే కాకుండా, తన స్నేహితులు పదిమందికీ చూపించాలనుకున్నాడు. ఇంటర్నెట్లో ఆ వీడియోను వెలికితీసి చాలా చానెళ్లు కుటుంబమంతా కలిసి రాత్రిపూట భోజనాలు చేస్తూ వార్తలు చూసే సమయంలో ప్రసారం చేశాయి. అతని మందబుద్ధికి మనం బాధపడలేం గాని, దానిని పనిగట్టుకుని ప్రసారం చేసిన టీవీ చానెళ్లను చూసి తలలు దించుకోవాల్సి వస్తోంది. ఏది వార్త కానేరదో మన టీవీ చానెళ్ల విలేకరులకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదనే అనుకోవాలి. మనం అలాంటివి చూడలేక చానెల్ మార్చుకోవాలే తప్ప, వారి అవగాహనను మాత్రం వారు మార్చుకోరు. జంతువుల రతికార్యం సంగతి పక్కన పెడితే, మనుషులను కూడా మేము విడిచిపెట్టేదే లేదని తాజాగా తెలుగు టీవీ చానెళ్లు పోటీపడ్డాయి. వ్యక్తి గోప్యతకు తీవ్ర భంగం కలిగించి, నైతికత పేరుతో వీక్షకులను మభ్యపెట్టి, గుణశీలాలపై తీర్పులు చెప్తున్నారు.

Also read: రికార్డుల వేటలో మోడి ప్రభుత!

నైతికత పేరుతో మీడియా తీర్పులు

ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో జరుపుకొనే లైంగిక కార్యం పూర్తిగా వ్యక్తిగత అంశం. ఆ వ్యక్తులు ఇరువురూ పురుషులైనా, ఇరువురూ స్త్రీలైనా తప్పులేదని ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా అంగీకారం కూడా వస్తోంది. ఒకప్పుడు ఎల్జిబిటి సమస్యల గురించి మాట్లాడడమే ఏహ్యంగా భావించే సమాజాలు నెమ్మది నెమ్మదిగా ముసుగులు తీసేసి వాటి మంచిచెడ్డల గురించి లోతుగా చర్చలు జరుపుతున్నారు. మన సుప్రీంకోర్టు కూడా ఆధునికంగా ఆలోచిస్తుందనే ఇటీవల కొన్ని తీర్పులు సూచిస్తున్నాయి. అక్రమ సంబంధాలు, పాతివ్రత్యాలు వంటి వాటి చర్య విషయంలో మన భారతీయ సినిమా, ప్రత్యేకంగా దక్షిణాది భాషల సినిమాలు కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తున్నాయి. ఇద్దరు మేజర్లు హోటల్ గదిలో ఉన్నప్పుడు ఫిర్యాదు లేనిదే అరెస్టులు చేయకూడదని ఇటీవలి కోర్టు తీర్పులు సైతం స్పష్టపరుస్తున్నాయి. ఇవేవీ మన తెలుగు మీడియాకు అక్కర్లేదు. అధికార పార్టీకో, ప్రతిపక్ష పార్టీకో చెందిన నేతల ప్రైవేటు వీడియోలు దొరకడమే తరువాయి, మర్యాదవాక్కులు, నీతి సూక్తులు మొదలు పెడతాయి. అత్యంత దిగజారుడు, అనైతిక ప్రసారాలకు మన తెలుగు చానెల్లు తెగబడతాయి. వృత్తిపరమైన అన్ని విలువలకు తిలోదకాలు ఇస్తాయి. పార్టీలకు బురద పూయడం తప్ప మరో లక్ష్యం వాటికి ఉండదు. వ్యక్తుల ప్రతిష్టను భంగపరిచి, శీల హననం చేసి రాక్షసానందం పొందుతాయి. అవి ప్రసారం చేసిన కార్యక్రమాల నైతికత గురించి కన్వీనియెంటుగా మర్చిపోతాయి.

Also read: ఇదే మన ప్రస్తుత భారతం!

తన అధికారాన్ని వాడి, ఎదుటి వ్యక్తిని లొంగదీసుకుంటేనే నేరం అని వారికి గుర్తురాదు. ఈ వారంలో వైసీపీ ఎంపీ, పోలీసు ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసిన గోరంట్ల మాధవ్ వీడియో లీక్ ప్రచారం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఈ విషయంలో ఆయన బలహీనతే ఆయన నిండు కెరీర్ ను బలి తీసుకుంది. అనంతపురంలో జెసి దివాకర్ రెడ్డి ముందు ధైర్యంగా నిలబడి, ఇప్పుడిప్పుడే ప్రారంబించిన తన రాజకీయ జీవితానికి బలమైన ఎదురుదెబ్బ తగిలినట్టే. అయినప్పటికీ ఒక ప్రముఖ వ్యక్తి వీడియో దొరికిందని దానిని సమాజపు ముఖమ్మీద రుద్దడం మాత్రం మన మీడియా సిగ్గూ ఎగ్గూలేని తనమే. సినీతారలు చనిపోయినప్పుడు వారి బాత్ రూములలో ఉన్నట్టు స్టూడియోలలో గ్రాఫిక్స్ సృష్టించి, భారీ వర్షం కురుస్తున్నప్పుడు మోకాళ్లలోతు నీటిలో ఉన్నట్టు గ్రాఫిక్స్ చేసి వార్తలు చెప్పడం లాంటి నాటకీయత సృష్టించి, వార్తలు చదవడానికి అలవాటు పడిన మన చానెళ్లు రాబోయే రోజుల్లో చేసే విన్యాసాలకు అంతే ఉండకపోవచ్చు. బహుశా వీటికి మనం క్రమంగా అలవాటు పడాలేమో! అంతర్జాతీయ టెలివిజన్ చానెళ్లు కూడా దీనికి తక్కువేం తినలేదు. పేపరాజ్జికి బెదిరిపోయి డయానా మరణించిందని చెప్తారు. తన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అర్హత లేకపోయినా మీడియా చొచ్చుకుని వచ్చేయడమే డయానా మరణానికి కారణమని ఇప్పటికీ నమ్ముతున్నారు. చాలా విచిత్రమైన విషయం ఏమంటే, తమ ఇష్టానుసారంగా తీర్పులు చెప్పే మీడియా తప్పులను కోర్టుకు ఈడ్చినప్పుడు మాత్రం అదే మీడియా తమ స్వేచ్ఛను హరిస్తున్నారంటూ గగ్గోలు పెడుతుంది. తనకో నీతి, తన పాలపడిన వారికి మరో నీతి.

Also read: వారు చేసే తప్పు.. మనం చేస్తే ఒప్పు

సిగ్గుతో సిక్కోలు మీడియా

శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచానికి తెలియని మరో విచిత్రం జరుగుతోంది. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లను ఎత్తి చూపిస్తూ వార్తలను ప్రచురిస్తోన్న ‘సత్యం’ సంచలన సాయంకాలం దినపత్రికకు ప్రజలనుంచి అద్భుతమైన స్పందన వస్తున్నప్పటికీ, మీడియానుంచి మాత్రం ఏమాత్రం సహానుభూతి కనిపించకపోవడం విడ్డూరం. తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం కల్పించే కథనాలను సాక్ష్యాలతో ‘సత్యం’ పత్రిక రోజుల తరబడి ప్రచురిస్తోంది. అన్ని రకాలుగా యూనివర్శిటీ యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ఉన్నతాధికారులు ఒక్కో విషయంలో వాస్తవాల గురించి ఆరా తీస్తున్నప్పటికీ, మన జిల్లాకు సంబందించిన వార్తే కాదన్నట్టుగా కార్పొరేట్ ఉదయపు దినపత్రికలు స్మశాన నిశ్శబ్దం పాటిస్తున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తమ జిల్లా యూనివర్శిటీ పైన వస్తోన్న సమాచారం గురించి ఆత్రంగా వాకబులు చేస్తూ, పై అధికారులకు నిజానిజాలు చెప్తూ లేఖలు రాస్తున్నప్పటికీ మన జిల్లా పాత్రికేయులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విచిత్రమే. ఒక పత్రిక విశ్వవిద్యాలయం బాగోగుల కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నప్పుడు కనీసమాత్రంగా వార్తలు ప్రచురించక పోవడం సిగ్గుచేటు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీల లోపాలను మాత్రమే వార్తలనుకునే దౌర్భాగ్యం నుంచి పాత్రికేయులకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

Also read: సభ ముగిసింది.. సందేశం చేరింది..

గుండెగుండెలో తిరంగా

దేశమంతా ‘అజాదీ కా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రతి ఇంటా భారత దేశ జెండా ఎగరేయాలన్న నేతల పిలుపు ప్రజలకు ఎంతగానో నచ్చింది. దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జండాలు సులువుగా ప్రజలకు అందించడానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతవరకూ జెండా ఎగురేయడానికి పెట్టిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. సాయంత్రం ఐదు గంటలకు జెండా అవనతం చేయడం తప్పని సరి కాదంది. కావాలంటే రాత్రంతా జెండా ఎగురవేసుకోవచ్చని సెలవిచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద, పాఠశాలల వద్ద, ఇళ్ల వద్ద జెండా ఎగరేయాలని ఆదేశించింది. అయితే ఇద్దరు జెండాలు మాత్రం మార్కెట్లో దొరకడం లేదు. పాలిస్టర్ జెండాలకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్ పెట్టడం విచారకరం. జెండా సైజు గురించి నిబంధనలను పూర్తిగా సడలించారు. అయితే పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలని కోరారు. పైన కాషాయం, కింద ఆకుపచ్చ రంగుల నడుమ ఉన్న తెలుపు రంగులో మాత్రం ఇతర జాతీయ నాయకుల బొమ్మలు చిత్రించకుండా, కేవలం అశోక చక్రం మాత్రమే ముద్రించాలని ఆదేశించారు. మొత్తానికి ఈ వారమంతా అందరి హృదయాలలో స్వాతంత్ర్య స్ఫూర్తి తొణికిసలాడేట్టు ఒక బృహత్ ప్రయత్నమే జరుగుతోంది.

Also read: కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles