• ప్రిపోల్ సర్వేలు బీజేపీకి అనుకూలం
• సర్వేలన్నీ బూటకమన్న తృణమూల్
• మమతకు ప్రత్యామ్నాయం లేరన్న పార్టీ నేతలు
మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ గట్టిగా తలపడుతోంది. బెంగాల్ లో రెండు రోజుల పర్యటన ప్రారంభించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అసెంబ్లీ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా 10 జిల్లాలలో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన బబానిపూర్ నుంచి నడ్డా ప్రచారాన్ని ప్రారంభించారు.
బీజేపి కే అధికారం అని తేల్చిన ప్రిపోల్ సర్వే లు:
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఉప్పెనలా దూసుకొస్తున్న బీజేపీ ప్రాభవాన్ని అడ్డుకునేందుకు మమత చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలతాలను ఇస్తున్నట్లు కనిపించడంలేదు. రాబోయే ఎన్నికలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నా లోలోపల భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ప్రిపోల్ సర్వే ఫలితాలు మమతా బెనర్జీని మరింత భయపెడుతున్నట్లు సమాచారం. ఐదు సంస్థలతో పాటు ఈ టీవీ బంగ్లా, జీ 24, ఏబీపీ న్యూస్, క్రౌడ్ విజడమ్ లు ప్రిపోల్ సర్వే నిర్వహించాయి. అన్ని సర్వేలు తృణమూల్ కాంగ్రెస్ ఓటమి అంచుల్లో ఉన్నట్లు చెబుతున్నాయి. బీజేపీ ప్రాభవాన్ని ఎవరూ ఆపలేరని అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 150 నుంచి 185 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ 85 నుంచి 110 సీట్లలో విజయం సాధిస్తాయని సర్వేలు తేల్చాయి.
మమతను దెబ్బకొట్టనున్న ప్రభుత్వ వ్యతిరేకత:
నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణం, శాంతి భద్రతలు, మమత పాలన పట్ల అసంతృప్తి ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సర్వేలో తేలింది. బెంగాల్ అధికారం చేపట్టేందుకుక మిషన్ బెంగాల్ ను ప్రారంభించిన అమిత్ షా, నడ్డాలు ఎన్నికల వరకూ ఇదే ఒరవడిని, ఉత్సాహాన్ని బీజేపీ కొనసాగిస్తే ఎన్నికలనాటికి బీజేపీ మరింత బలీయమైన శక్తిగా ఎదుగుతుందని సర్వేలో తేలింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 225 స్థానాలలో విజయం సాధించాలని అమిత్ షా లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని బెంగాల్ ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 42 లోక్ సభ స్థానాలున్న బెంగాల్లో 18 చోట్ల విజయం సాధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ ను ఖంగుతినిపించింది. ఈ ఎన్నికల్లో బీజీపీ 40 శాతం ఓట్లను పొందింది.
సర్వేలను కొట్టేసిన తృణమూల్:
అయితే ఈ సర్వేలను తృణమూల్ కాంగ్రెస్ కొట్టివేసింది. బెంగాల్ రాజకీయాల్లో మమతకు ప్రత్యామ్నాయమే లేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఇప్పటి నుండే మైండ్ గేమ్ మొదలు పెట్టిందని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు.