ఒడిశా బాలాసోర్ లో రైళ్ళ ప్రమాదం జరిగిన తర్వాత పట్టాలు శుభ్రం చేశారు. రైళ్ళు యథావిధిగా నడుస్తున్నాయి. సీబీఐ దర్యాప్తుకోసం కొంతకాలం ఒక స్టేషన్ దగ్గర రైళ్ళు ఆగడంలేదు అంతే. కానీ ఒక గూడ్సు రైలు,రెండు ప్యాసింజర్ రైళ్ళు ఢీకొన్న ఫలితంగా జరిగిన అరుదైన ప్రమాదంలో 280 మంది ప్రయాణికుల దాకా మరణించారు. ఏడెనిమిది వందలమంది గాయపడ్డారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నాయకులు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించిన ఒరవడిని అనుసరించాలని కోరుతున్నారు.
లాల్ బహదూర్ కాలంలో ఏమి జరిగింది? ఆయన రాజీనామా పూర్వాపరాలు ఏమిటి? 13 మే 1952న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్ లో రైల్వే- రవాణాశాఖ మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణం చేశారు. 1956 సెప్టెంబర్, నవంబర్ మధ్యలో గలమూడు మాసాలలో రెండు ఘోరమైన రైలు ప్రమాదాలు సంభవించాయి. మే 1956లో రైల్వే ఎస్టిమేట్స్ కమిటీ నివేదికలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మెచ్చుకుంటూ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అంతలోనే రైలు ప్రమాదం జరిగి ప్రభుత్వం అప్రతిష్ఠపాలయింది.
సికిందరాబాద్-ద్రోణాచలం ప్యాసింజర్ రైలు 02 సెప్టెంబర్ 1956నాడు జడ్చెర్ల, మహబూబ్ నగర్ మధ్యలో ప్రమాదానికి గురయింది. సెప్టెంబర్ 5న లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాదస్థలాన్ని సందర్శించారు. 13 సెప్టంబర్ న పార్లమెంటులో మాట్లాడుతూ శాస్త్రి, ‘‘ఆ ప్రమాద దృశ్యాలు స్వయంగా చూసిన తర్వాత చాలా విచారంగా ఉంది. మొత్తం 117 మంది మరణించినట్టు తెలుస్తోంది’’అంటూ చెప్పారు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలనీ, మంత్రి రాజీనామా చేయాలని సీపీఐకి చెందిన ఆనంద కుమార్ ఉద్ఘాటించారు.
లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించారు. కానీ నెహ్రూ దానిని ఆమోదించలేదు. ఆ తర్వాత మూడు మాసాలు గడిచాయో లేదో మరో ప్రమాదం సంభవించింది. 23 నవంబర్ 1956న ట్యూటికొరిన్ ఎక్స్ ప్రెస్ మరుదయర్ నదిలో పడిపోయింది. 150 మందికి పైగా మరణించారు. వందమంది గాయపడ్డారు. ముత్తుసామి వల్లతరసు అనే మజ్దూర్ కిసాన్ ప్రజా పార్టీ సభ్యుడు లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. 26నవంబర్ 1956లొ నెహ్రూ పార్లమెంటులో శాస్త్రి రాజీనామా ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. 5 డిసెంబర్ 1956న రాజీనామాను వాస్తవంగా ఆమోదించారు. అప్పటి నుంచి ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా లాల్ బహదూర్ శాస్త్రి చేసినట్టు రాజీనామా చేయమని అగడటం ఆనవాయితీగా మారింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రైల్వే మంత్రి పదవికి ఈ కారణంగానే రాజీనామా చేశారు.
అప్పుడు నెహ్రూ ఏం చేశారు? రెండు ప్రమాదాలు జరిగిన తర్వాత రైల్వే కు ప్రత్యేక మంత్రివర్గశాఖ ఉండాలని నిర్ణయించారు. రైల్వే-రవాణా శాఖను రెండుగా చీల్చి రైల్వేశాఖను జగ్జీవన్ రామ్ కు అప్పగించారు. రవాణా శాఖను లాల్ బహదూర్ కి ఇచ్చారు. 17 ఏప్రిల్ 1957 నుంచి లాల్ బహదూర్ మళ్ళీ కేంద్ర మంత్రిగా కొనసాగారు.