వైసీపీ పాలనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లో చంద్రబాబునాయుడు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా ఇద్దరు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. పెన్షన్లు తీసేయడం, రైతులు, ప్రజల సమస్యలపై చర్చించామని తెలిపారు.
బ్రిటీష్ కాలం నాటి జీవోతో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. వైజాగ్ లో తనను అడ్డుకున్నారని.. కుప్పంలో చంద్రబాబును కూడా అలాగే అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గమన్న పవన్.. జీవో నెంబర్ 1 పై ఎలా పోరాడాలనే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు.
ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ ను అడ్డుకున్నారని.. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. అలాతే తాను ఎక్కడికి పోయినా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై పోరాడితే తమ ఆఫీస్ పై దాడి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ప్రజా జీవితం అంధకారంగా మారిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షాలపై ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారనీ, పవన్ సభ పెట్టారని ఇప్పటంలో ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చేశారని.. ‘‘నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తారా?’’ అని ఆగ్రహం ప్రదర్శించారు. తన నియోజకవర్గంలో సైతం అడ్డుకుంటున్నారని చంద్రబాబు నాయుడు కోపంగా అన్నారు.