అకుంఠిత దీక్షతో, అలుపెరగని ఉత్సహంతో శబరిమల సన్నిధానాన్ని చేరే భక్తుల జన్మలు ధన్యం. కేవలం అయ్యప్ప నిజమైన భక్తులకు మాత్రమే లభించే అపూర్వ అవకాశమిది. 41 రోజుల పాటు మండల దీక్ష చేసి, కాలి నడకన గాని, ఇతర వాహనాల మీద గాని శబరిమలకు చేరుకునే భక్తులు తమ ఆరాధ్య దైవం అయ్యప్ప సేవలో తలమునకలవుతారు. మనసా వాచా దర్శించుకుని, తమ కోర్కెలు ఈడేర్చమని శరణు వేడుతారు. ఫలితంగా దయా సాగరుడైన అయ్యప్ప తమను కరుణించి అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
శబరిమల యాత్రకు దీక్ష చేపట్టడమే ముఖ్యమైన ఘట్టం. మొదటి సారిగా శబరిమల యాత్ర చేసే వారితో పాటు, శబరిమల యాత్రను చేపట్టే ఎలాంటి భక్తుడైనా దీక్ష చేపట్టాల్సిందే. దీక్ష చేపట్టి, అనేక సార్లు స్వామిని దర్శించే వారిని గురు స్వాములుగా పిలుస్తారు. వారి ఆధ్వర్యంలోనే, కన్నె స్వాములు దీక్ష తీసుకోవాలి.
దీక్ష ప్రారంభం ఎప్పుడు?
మలయాళ మాసం వృశ్చికం తొలి రోజున అంటే సూర్య భగవానుడు సద్గతి మార్గాన పయనించే సమయంలో శబరి యాత్ర కు దీక్ష మొదలవుతుంది. నియమ నిష్టలను పాటించి దీక్ష వహించే భక్తులను అయ్యప్పలగానే పరిగణిస్తారు. ఇరుముడి మూటలను తలపై ఉంచుకుని స్వామి సన్నిధికి చేరుకునే భక్తులు ముందుగా 18 మెట్లను ఎక్కాలి. దీనిని పదునేట్టాంబడి అంటారు.
పదునెట్టాంబడి ని ఎక్కడానికి 1984 వరకు పరశురామ నిర్మితమైన రాతి మెట్ల పై నుండే ఎక్కేవారు. వారు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరి కాయను కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. అయితే కాలక్రమేణా మెట్లు అరిగి పోయి భక్తులు అనేక ఇబ్బందులు పడేవారు. దీనితో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలో పంచ లోహ కవచాన్ని మంత్ర తంత్రాలతో తొడిగించారు దీనివల్ల 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది.
18 మెట్లు సులభంగా ఎక్కేవిధంగా ఏర్పాట్లు
భక్తుల రద్దీ పెరగడం వల్ల తొక్కిసలాటలు లేకుండా ఉండడానికి వీలుగా 1982లో ప్లై ఓవర్ బ్రిడ్జి కట్టి దాని పై నుంచి పదునేట్టాంబడి ఎక్కిన తరువాత వరుసలో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసారు. ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. వాటిని అణిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రకామ్య, బుద్ధి, ఇచ్చా, ప్రాప్తి, సర్వ కామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియంకర, సర్వ మంగళ కార, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వంగ సుందర, సర్వ సౌభాగ్య దాయక అనే పేర్లతో పిలుస్తారు.
అలాగే పదునెట్టాంబడి పై అష్టాదశ దేవతలు కూడా కొలువయ్యారు. వీరిలో మహంకాలి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వ రాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, హిడింబ, బేతాళ, నాగరాజ, కర్ణ వైశాఖ, పులుందిని, రేణుక పరమేశ్వరి, స్వప్న వారాహి, ప్రత్యాంగళి, నాగ యక్షిణి, మహిషాసుర మర్దని, అన్నపూర్ణేశ్వరి దేవతలు కొ లువయ్యారు.
18 మెట్లను ఎక్కుతున్నపుడు, మందిరం వైపు తరలి వెళుతున్నపుడు భక్తులను రాసుకుంటూ ముందుకి వెళ్ళ కూడదు. క్రమశిక్షణతో ముందుకి వెళ్ళాలి.
దర్శనానికి కూడా ఓ పద్ధతి ఉంది
మందిరంలోని ఆగ్నేయ మూలలోని వినాయకుడిని, ఆది శేషువుని, మాలిక పురుత్తమ్మ దేవతను తొలుత దర్శించుకోవాలి. దర్శనం తరువాత మొక్కులు చెల్లించాలి. వీటిలో నెయ్యభిషేకం చాలా ముఖ్యమైనది. ప్రతి పూజ వైవిధ్యంతో కూడుకుని ఉంటుంది. ప్రాతః కాలంలో నిన్నటి రోజున పూజధికాలతో ఉన్న విగ్రహానికి అస్టాభిషేకం చేయిస్తారు. ఈ సమయంలో స్వామికి తిరు మధురం (మూడు రకాల తీపి పదార్ధాలు ) సమర్పిస్తారు. కొబ్బరి పాలు, బెల్లంలో వరి బియ్యం కలిపి చేసే పాయాసాన్ని, అరవన (అయ్యప్ప ఆలయంలో బియ్యం బెల్లంతో చేసే ప్రత్యేక తీపి పదార్ధం )వెల్లను స్వామి వారికి సమర్పిస్తారు.
అయ్యప్ప స్వామి గర్భాలయం సంపూర్ణ స్వర్ణమయం. అలాగే ధ్వజ స్తంభాన్ని కూడా స్వర్ణమయం చేశారు. 2000 సంవత్సరం వరకు చెక్కలతో ఉన్న గర్భాలయంలో స్వామివారు ఉండేవారు. అయితే, అనంతరం ఓ దాత సహకారం తో తత్వమసి, గర్భాలయాలను బంగారు రేకులతో తాపడం చేయించారు. గర్భాలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా దర్శనమిస్తాడు. ఎడమ చేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహిని అవతారానికి ప్రతీక గా దర్శనమిస్తాడు. ఒంటి నిండా భస్మము హర రూపాన్ని తలపిస్తుండగా, ముఖాన ఉండే తిరు నామం హరి రూపాన్ని తలపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునికి ఇష్టమైతే, తులసి మాల శ్రీహరికి ప్రీతి పాత్రమైంది. గర్భాలయంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి దర్శనం పూర్వ జన్మల పుణ్య ఫలం.
ఓం స్వామియే శరణం అయ్యప్ప!
–దాసరి దుర్గా ప్రసాద్