- హాజరైన లారీ యజమానులు, డ్రైవర్లు
32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో గోదావరిఖని లారీ యజమానులకు, డ్రైవర్ల కు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు.
వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు తెలిసి కూడా వాటిని పాటించకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రమాదాలలో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వలనే జరుగుతున్నాయని అన్నారు. అనుకోని ఘటనలవల్ల జరిగే తప్పిదాలు 1 శాతం మాత్రమేనని తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న జీఎం ఆఫీస్ మలుపు ని సరిచేయడానికి త్వరలోనే అక్కడ ఒక్క సర్కిల్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణ కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే బసంత్ నగర్ సమీపంలో గల రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద ఇంకా పూర్తిగా పనులు పూర్తి కాకపోవడం వలన వాహనదారులకు కొంత ఇబ్బందికరంగా ఉందని త్వరలో ఆ పనులు పూర్తయ్యేటట్టు చూస్తామని ఎమ్మెల్యే చందర్ అన్నారు. భారీ వాహనాలు అయిన లారీల వలన ప్రమాదం జరిగితే భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది కావున లారీ డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని ఆర్టీఏ ఉమామహేశ్వరరావు అన్నారు.
ఓవర్ లోడ్ తో వాహనాలు:
శిక్షణలో భాగంగా డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి, మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, అతి వేగంగా నడపకూడదు అని రహదారి భద్రత పై అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం రహదారి భద్రత పై పాటల ద్వారా, నాటకాల ద్వారా ఆకట్టుకునే విధంగా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో డీటీవో రంగారావు, మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు, ఎస్సై నాగరాజు, కళాబృందం ఇంచార్జి చంద్రమౌలి, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, కమిటీ మెంబెర్స్ ఇక్బాల్, కంది శ్రీనివాస్ తో పాటుగా సుమారు ఐదు వందల మంది లారీ ల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.