(అభ్యుదయ కవి సంక్షిప్త పరిచయం)
కవి, రచయిత: ఆ కవితావేశానికి బెదిరి పోయిన ప్రభుత్వం ఆయన కవిత్వాన్ని నిషేధించింది . ఐనా, పదుల సంఖ్యలో ఆయన కవితా సంపుటాలు ప్రచురించారు. జీవితమే కవిత్వంగా బతికారు. ఒంటిచేత్తో ఏకంగా అక్షరాలా వందకి పైబడి పుస్తకాల్ని ప్రచురించిన వ్యక్తి!
ఉద్యమకారుడు: ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున పీడిత ప్రజానీకం కొరకు గొంతెత్తడం మొదలు పారిశుధ్య కార్మికుల సమస్యల వరకూ, అణగారిన వర్గాల పక్షాన న్యాయ పోరాటం చేయడం నుండీ, అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షునిగా ఆయన రూపొందించిన కార్యక్రమాల వరకూ అన్నింటా ఆయన ఒక ధిక్కారమే !
విమర్శకుడు: గురజాడ, వీరేశలింగం, శ్రీశ్రీ, నారాయణ బాబు, కొ.కు, పురిపండా, తిలక్, చలం, కృష్ణశాస్త్రి, అనిశెట్టి, రవీంద్రనాథ్ టాగూర్, శరత్, హెన్రిన్ హెయినీ, బుద్ధదేవ్ బోస్, సుబ్రహ్మణ్య భారతి, హరిన్ చటో, వంటి మహామహుల పై సమగ్రంగా ఒక్కొక్క గ్రంథం సాధికారికంగా రాసిన వ్యక్తి. ఆంగ్లంలో విమర్శ కోసం ఆయన చేసిన అధ్యయనం అద్వితీయం అంటారు !
అనువాదకుడు: ప్రఖ్యాత జర్మన్ సాంస్కృతిక శీలి బెర్తోల్ బ్రహ్ట్ ‘అమ్మ’ నాటకాన్ని,ఎర్నెస్ట్ టోలర్ మందీ- మనిషీ నాటకాన్నీ, తెలుగు చేసిన గొప్పవ్యక్తి. గోథే మహాకవి రచన శోకతరంగాలు పేరిట అనువదించినాయన. ప్రఖ్యాత మార్క్సిస్ట్ మేధావి క్రిస్టోఫర్ కాడ్వెల్ ఇల్యూజన్ రియాలిటీ ‘భ్రాంతి – వాస్తవికత’ గా అనువదించిన మహా కృషీవలుడు. మహాకవి షెల్లీ కావ్యాన్నే కాక షెల్లీ జీవితం గురించిన అద్భుతమైన నవల ‘ఏరియల్’ ని తెలుగు వారికి అందించిన గొప్ప అనువాదకుడు!
పరిశోధకుడు: లియొనార్డో డావిన్సీ గురించి శోధించిన వ్యక్తి.కన్యాశుల్కంలో గిరీశం వాడిన పూర్రిచ్చర్డ్ ఆదుపాదుల్ని వెలికితీసి తెలుగు సాహిత్య లోకానికి అందించిన వ్యక్తి. నూరు శరత్తులు,ఆ తరం కవితా తరంగాలు, శరచ్చంద్రిక, దేశీ సారస్వతము – సమాజ వాస్తవికత వంటి గ్రంథాలు ఆయనలో శోధనకు ప్రతీకలు !
ప్రయోగశీలి: ఆయన రచనలేవీ అచ్చు వేయరాదనీ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వం ప్రెస్సులకి తాఖీదు ఇచ్చిన సందర్భంలో తెనాలిలో ప్రచురించిన ఏకైక కథా సంపుటి ‘బానిసల దేశం’. రష్యా విఫల వామపక్ష ప్రయోగాన్ని ‘సీకింగ్ మై బ్రోకెన్వింగ్స్’ అనే ప్రయోగాత్మక కావ్యంగా మల్చిన వ్యక్తి. ఆయన సంపూర్ణ ప్రయోగ కావ్యం రక్తాక్షి.భారతీయ పునరుజ్జీవనానికి తోడ్పడిన మహా వ్యక్తుల జీవనరేఖలు ‘వెలుతురు తెరువులు!’
ఉద్వేగి: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగానికి మద్దతుగా ‘కాహళి’, అరసం – విరసం వివాదం గురించి రాష్ట్రమంతా పర్యటించి వచ్చిన ప్రశ్నలు – జవాబుల్ని ‘సాహిత్యంలో సంశయ కల్లోలం’, ఇంగ్లాండ్ పర్యటన ఆరుద్రగారితో చేసొచ్చి ‘ఆంగ్ల సీమలో ఆమని వీణలు’,బాబ్రీ మసీదు, మతకలహాల నేపథ్యంలో ‘చేతావని’, ‘రక్షరేఖ’ రైల్లో బాంబు దుస్సంఘటన గురించి ‘ధూపఛాయ’ కవిగా ఆయనలోని మానవీయ స్పందనకి చిహ్నాలు !
రసజ్ఞుడు: ‘కవిత్వం కాలాతీత కాంతిరేఖ’ ఈనాటికీ ఎందరో కవులకి ఒక దిక్సూచి. ‘ఉర్దూ సాహిత్యంలో ఉన్నత శిఖ రాలు’హిందుస్తానీ కవిత్వంలో ఆయన పరిచయానికి తార్కాణం. గవాక్షంలో అంతరిక్షం, కెరటాలు – కిరణాలు ఆంగ్ల సాహిత్యంలో ఆయనకున్న గాఢతకు సాక్ష్యాలు. భారతీయ శాస్త్రీయ సంగీతం పై ఆయన సాధికారికతకి ప్రమాణం, ‘హంసధ్వని’!
కార్యశీలి: 1953 లో సంభవించిన వరద ముంపు గ్రామాల్ని స్వయంగా వెళ్ళి చూసి ‘గోదావరి జల ప్రళయం’ అనే కావ్యం రాసిన కవి. కళాకేళి పత్రిక వ్యవస్థాపకులు. ప్రముఖ తత్వవేత్త జార్జి థామ్సన్ ని స్వయంగా ఇంగ్లాండ్ లో కలిసి ముచ్చటించి ఆయన రచన మార్క్సిజం – కవిత్వాన్ని తెలుగులో అనువదించిన మహాకవి. కళాకేళి నికేతన్ ప్రచురల ద్వారా అనేకమంది రచనల్నీ, సో.సు. లిటరరీ ట్రస్ట్ స్థాపించి తద్వారా అనేకమంది ప్రముఖ కవులు, రచయితలు, అనువాదకులు, విమర్శకులు, ఉద్యమకారుల్ని సత్కరించిన వ్యక్తి !
(ఇవికాక కలలు – కన్నీళ్ళు, పూలూ – ముళ్ళు పేరిట రెండు భాగాల స్వీయచరిత్ర మరెన్నో విమర్శనా గ్రంథాలు, భాషాసేవ, బృహత్ కావ్యాలు, ప్రయోగ గీతాలు, ప్రసంగాలు, పద్యాలు, పాటలు, బాలల గేయాలు, నవలలు, కవితాసంపుటాలు, కావ్యాలు..వంటివాట్లో నిరంతర కృషిచేసిన స్నేహశీలి, మానవతావాది. చనిపోయే వరకూ సాహిత్యంతో సహవాసం చేసిన డా.ఆవంత్స సోమసుందర్ శత జయంతి సమీపిస్తున్న సందర్భంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ స్తబ్ధంగా ఉన్న కవిమిత్రులు, సాహితీ వేత్తలు కాస్త మేల్కొని ఆయన కృషి కోసం కనీసం నేటి తరాలకు తెలిపేందుకైనా కార్యాచరణ రూపొందించా ల్సిందిగా మనవి చేస్తూ ఈ చిన్న రైటప్!)
– గౌరవ్