(డా.ఆవంత్స సోమసుందర్ ఆత్మీయ లేఖ)
కొన్ని జ్ఞాపకాలు కాలాతీతమైనవి. కొందరు వ్యక్తులు ప్రేమాస్పదులు. నెయ్యమైనా, కయ్యమైనా సరే వారితో సఖ్యతగానే ముగుస్తుంది. వజ్రాయుధ కవి డా. ఆవంత్స సోమసుందర్ పదిహేడు సంవత్సరాల క్రితం హైదరాబాదులో నేను ఉంటున్న కాలంలో అభిమానంగా రాసిన లేఖ ఇది. అప్పటికి చేగువేరా (బహుశా రష్యన్ నుండి ఇంగ్లీష్ అనువాదం) అలాగే ఆస్కార్ వైల్డ్ పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే చదివినట్లుంది. షెల్లీ ఏరియల్ మొదటి భాగం పూర్తిచేసి నేనే నగేష్ అనే అబ్బాయిని ఆయన దగ్గర రాతకి కుదిర్చాను!
అభ్యంతరకరమైన పరుష పదజాలంతో సో.సు.కి రాసిన ఉత్తరాలిప్పుడు తల్చుకుంటే ఏదో ఒక బాధ. అంత పెద్దమనిషిని పట్టుకుని అన్నన్ని మాటలెలా అనగలిగానో, అసలాయన ఎలా ఊరుకుని మళ్ళీ నన్ను గారం చేసారో అనేంత ఆశ్చర్యం. ఎంత పొగరు కాకపోతే రాసిన లేఖలో పదాలకి అర్ధాలు కూడా ఇచ్చేంత అహంకారం ఆ కుర్ర వయసుకి? ఇప్పుడవన్నీ ఎంత గుర్తుకొచ్చి గుచ్చుకుంటాయో. శతజయంతి సందర్భంగా నెమరేసుకున్నకొద్దీ నెమ్మదిగా నెమలీకల్లా మనసుని తాకుతున్నాయో అనే ఆలోచనల లోతైన తరంగాల ఝరి !
జీవితాంతం సాహితీ సేవ చేసిన ఆ యోధుడి ఆశయాల మాటటుంచి అక్షరాలు సైతం ఎంత విస్మరించడం జరిగిందంటే, లక్షలాది పుస్తకాలు చెదలు పట్టిపోయాయ్. తూగుటుయ్యాలలో అనేక మంది అభిమానులు, శ్రేయోభిలాషులకు కబుర్లు చెప్పిన ఆయన నివాసగృహం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. టేకు బీరువాల్లో కొత్తగా మెరిసిపోతున్న మంచి పుస్తకాలన్నింటినీ చెదలు తినేస్తున్నాయి. ఇప్పుడెవరూ ఇక వాట్ని చదివేందుకు లేరు, రారన్నట్లుగా మొత్తం అక్షరాల్ని ఆక్రమించుకొని స్వాహా చేస్తున్నాయ్. మహాకవి భావాలకి పట్టిన అధోగతిది. ఈ స్థితిని అధిగమించడం ఆలోచనాపరులందరి ఉమ్మడి బాధ్యత. అందులో భాగమే ఆయన శతజయంతి కార్యక్రమం !
సాహిత్యమే జీవితంగా భాసించిన అక్షరమూర్తి అనితరసాధ్యమైన కృషికి ఆశయ నీరాజనం ఈ కార్యక్రమం. సేచ్ఛగా అక్షరాల్ని సృజించి, స్వతంత్రంగా తన భావాల్ని ప్రవహింపజేసిన కవితా బాంధవుడి అపారమైన స్పూర్తికి ఆశాచిహ్నం ఈ సమావేశం. కాబట్టి,దగ్గర్లోని సాహితీ మిత్రులు, సామాజిక ఆలోచనా పరులు తప్పక రండి. రచనావ్యాసంగాన్నే ఊపిరిగా చేస్కున్న మహోన్నత కవి, రచయిత, విమర్శకుడు, తత్వవేత్త, విశ్లేషకుడు, ఉపన్యాసకుడు, కళావేత్త, పరిశోధకుడు, ఉద్యమకారుడు, పత్రికా సంపాదకుడు, ప్రచురణకర్త…డా. ఆవంత్స సోమసుందర్ గారికి ఆత్మీయ నివాళులు అర్పించేందుకు ముందుకు రండి!
(చాలా కాలం తర్వాత దొరికిన ఈ ఉత్తరం నాకొ అమూల్యమైన జ్ఞాపకం. ఇంకా రాత రూపంలో లేని అద్భుతమైన సంభాషణలు, సద్గోష్టులు మా మధ్య ఎన్నున్నాయో. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుండీ, తరగని ఆస్తిపాస్తులుండీ,అవకాశం ఉండి కూడా ఏదోక పేద్ద నగరంలో స్థిరపడాలని ఆయన అనుకోలేదు. పైగా బతికినంతకాలం పిఠాపురాన్నే తన కార్యక్షేత్రం చేసుకున్నాడు. ఇక్కడి ప్రజల్ని ప్రేమించాడు, ఇక్కడి జనాల తో జీవించాడు. ఆయన వజ్రా యుధుడు, చాలా మంది మరుగుజ్జు మనసున్న వారికి అర్ధం చేసుకోవటానికి సమయం పడుతుంది కానీ ఆయన వ్యక్తిత్వం సారస్వత సమర్పితం. అందుకే ఆయన జీవితం, చేసిన కృషిని తలచు కుంటూ శతజయంత్యుత్సవ కార్యక్రమం కరపత్రం, లేఖ,సో.సు. పుస్తకాల చదల ఫొటోలతో ఈ చిన్న రైటప్ !)
– గౌరవ్